కామ్‌గా ఉండవయ్యా కత్తి మహేశ్: వర్మ

Update: 2018-01-18 04:36 GMT
కత్తి మహేశ్ - కంచె ఐలయ్య వంటివారు పేరు చెప్పగానే ఎవరైనా వారిని వివాదాస్పద వ్యక్తులనే అంటారు. కానీ, రాంగోపాల్ వర్మ పేరు చెబితే ఆ పదం చాలదంటారు, వివాదాల విషయంలో ఆయన వ్యక్తి కాదు శక్తి అని చెప్తారు. అలాంటి వర్మే తెలుగు రాష్ర్టాల్లో కొన్నాళ్లుగా సాగుతున్న ఓ భారీ వివాదంపై లైట్‌ గా తీస్కో అని చెప్పినా కూడా ఆ వివాదంలో కీలక పాత్ర పోషిస్తున్న కత్తి మహేశ్ కాదనేశాడు.
    
పవన్ అభిమానులు - కత్తి మహేశ్ మధ్య కొన్నాళ్లుగా వివాదం కొనసాగుతోంది. ఇది రోజురోజుకీ పెరుగుతుందే కానీ, ఏమాత్రం తగ్గడం లేదు. చివరకు ఈ రగడలోకి సినీ నటి పూనమ్ కౌర్‌ ను - కత్తి మహేశ్ తల్లిని కూడా లాగారు. ఇందులో ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అనేది కాకుండా ఇది ముగింపు పలకలేని వివాదమైతే కాదు, అంతేకాదు.. ఈ వివాదం వెనుక ఉన్న కారణాలూ ఏమీ సామాజిక - రాజకీయ - ఆర్థిక - చారిత్రకంగా చాలా గొప్పవేమీ కావు. అందుకేనేమో రాంగోపాల్ వర్మ ఈ విషయంలో మాట్లాడుతూ లైట్ గా తీస్కుంటే ఈ వివాదం ఆగిపోతుందని అన్నారు. కానీ - కత్తి మహేశ్ మాత్రం ఆ ప్రతిపాదనను తిరస్కరించారు.
    
వర్మ దర్శకత్వం వహించిన జీఎస్టీ అనే చిత్రంపై ఓ చానల్ నిర్వహించిన డిబేట్‌ లో రామ్ గోపాల్ వర్మతో పాటు కత్తి మహేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కత్తి మహేష్ - పవన్ కల్యాణ్ అభిమానుల మధ్య జరుగుతున్న వివాదం ఎలా ముగుస్తుందని వర్మని అడగగా... వర్మ సింపుల్‌ గా సమాధానం చెప్పేశారు. కత్తి మహేష్ ఈ విషయాన్ని ఇగ్నోర్ చేస్తే.. ఈ విషయం ఇంతటితో ఆగిపోతుందని వర్మ తెలిపారు. అయితే వర్మ ఇచ్చిన సలహా విన్న కత్తి మహేష్ ఇంత దూరం వచ్చిన తర్వాత ఇగ్నోర్ చేయడం జరగదని అన్నారు.
Tags:    

Similar News