మహేష్ కత్తి.. ఒక ఓటమి.. ఒక గెలుపు

Update: 2018-01-20 10:33 GMT
మొత్తానికి పవన్ కళ్యాణ్ అభిమానులకు.. క్రిటిక్ కం ఫిలిం మేకర్ మహేష్ కత్తికి మధ్య గొడవ తాత్కాలికంగా సద్దుమణిగినట్లే కనిపిస్తోంది. నిన్న లేట్ నైట్ ఒక టీవీ ఛానెల్లో చర్చ సందర్భంగా పవన్ కళ్యాణ్ అభిమానుల ప్రతినిధికి.. మహేష్ కత్తికి మధ్య ఒక అంగీకారం కుదిరింది. ఈ సందర్భంగా ఇకపై తాను పవన్ కళ్యాణ్ వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడనని.. జనాలతో ముడిపడ్డ సమస్యల మీదే మాట్లాడతానని కత్తి హామీ ఇచ్చాడు. అంతే కాక తనపై కోడి గుడ్లతో దాడి చేసిన పవన్ అభిమానుల మీద కేసు వాపస్ తీసుకోవడానికి కూడా అంగీకరించాడు. వెళ్లి కేసు కూడా వాపస్ తీసుకున్నాడు.

ఈ సందర్భంగా పవన్ అభిమానుల ప్రతినిధి మాట్లాడిన మాటలు.. ఈ మొత్తం ఎపిసోడ్లో కత్తిదే పైచేయి అన్న విషయాన్ని స్పష్టం చేస్తాయి. ఇకపై పవన్ అభిమానులు మీ జోలికి రారని.. మీ కోసమే జనసేన నుంచి ప్రెస్ నోట్ కూడా ఇప్పించామని.. దయచేసి ఈ గొడవకు ఇంతటితో తెరదించాలని.. కేసు వాపస్ తీసుకోవాలని చాలా వేడుకోలుగా మాట్లాడాడు అభిమానుల ప్రతినిధి. పవన్ ఫ్యాన్స్ వైపు నుంచి ఇలాంటి అభ్యర్థన రావడమే కత్తి విజయానికి సూచికగా భావించొచ్చు. మొదట్నుంచి పవన్ అభిమానులు అతడిని రెచ్చగడుతూనే ఉన్నారు. అతను తగ్గకుండా మరింత రెచ్చిపోతున్నాడు. చివరికి పవన్ అభిమానుల వైపు నుంచే రాజీ ప్రతిపాదన వచ్చింది. పవన్ ఫాం హౌస్ రహస్యాలన్నింటినీ బయటపెడతానంటూ కత్తి కొన్ని సంచలన ఆరోపణలు చేసినపుడు అవతలి వైపు స్వరం తగ్గింది. రాజీ ప్రతిపాదన వచ్చింది. ఇక్కడి వరకు కత్తి పైచేయి సాధించినట్లే.

ఐతే కత్తి ఈ హెచ్చరిక చేయడానికి ముందు ఏం జరిగిందన్నది కూడా పరిశీలించాలి. కత్తి కొందరు మహిళలకు అసభ్యకర సందేశాలు పంపాడని.. వారి లోబరుచుకునే ప్రయత్నం చేశాడని.. రెండు రోజుల కిందట బయటికి వచ్చిన కొన్ని వాట్సాప్ సంభాషణల తాలూకు స్క్రీన్ షాట్లు ఆన్ లైన్లో హల్ చల్ చేశాయి. వీటి గురించి కత్తి సమాధానం చెప్పలేకపోయాడు. తాను అలా చేయలేదని ఖండించలేదు. ఇలాంటి విషయాలపై తాను స్పందించాలంటే పవన్ ఫాం హౌస్ విషయాలు కూడా మాట్లాడాల్సి ఉంటుందంటూ ఆవేశంగా కొన్ని ఆరోపణలు చేశాడు. ఆ టాపిక్ ఎత్తొద్దన్నట్లుగా హెచ్చరికలు చేశాడు. దీన్ని బట్టి చూస్తే కత్తి తాను తప్పు చేసినట్లు పరోక్షంగా అంగీకరించినట్లే. దాని మీద చర్చే వద్దంటూ ప్రతి ఆరోపణలు చేయడం ద్వారా ఇక్కడ కత్తి వాదన తేలిపోయిందనే చెప్పాలి. ఇది కత్తి ఓటమే కదా?
Tags:    

Similar News