మెగాస్టార్ కాదంటే.. మెగా ప్రిన్స్

Update: 2015-11-06 07:27 GMT
మొన్నటిదాకా మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ మూవీగా ‘కత్తి’ రీమేక్ ఖాయమనే అనుకున్నారంతా. కానీ ఇప్పుడు మళ్లీ సస్పెన్స్ నడుస్తోంది. దసరా లోపే ప్రకటన ఖాయం అన్నారు కానీ.. ఇప్పుడు చడీ చప్పుడు లేదు. మెగా కాంపౌండ్ నుంచి వస్తున్న సమాచారం ప్రకారం ‘కత్తి’ రీమేక్ ను కూడా పక్కనబెట్టేశారని తెలుస్తోంది. ‘కత్తి’ సంగతి తర్వాత చూద్దాం.. వేరే కథలేవైనా ఉంటే చూడమని చిరు వినాయక్ కు చెప్పాడని.. వేరే రైటర్లను కూడా పురమాయించాడని వార్తలు వినిపిస్తున్నాయి.

ఐతే చిరు కాదంటే ‘కత్తి’ రీమేక్ సంగతి ఏమవుతుందన్నది ఆసక్తికరం. ఎప్పుడో ఏడాది కిందటే తెలుగులోకి నేరుగా డబ్ కావాల్సిన సినిమా ఇది. ఐతే సామాజికాంశాలతో ముడిపిన ఈ కమర్షియల్ ఎంటర్ టైనర్ ను తెలుగులో ఓ స్టార్ హీరోతో రీమేక్ చేస్తే మంచి ఫలితం వస్తుందన్న ఉద్దేశంతో రీమేక్ కోసం ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. ముందు పవన్ తో - ఆ తర్వాత ఎన్టీఆర్ తో రీమేక్ కోసం ప్రయత్నాలు జరిగాయి కానీ.. కుదర్లేదు. చిరు ఆసక్తి చూపించడంతో ఎట్టకేలకు ‘కత్తి’ రీమేక్  సెట్స్ మీదికి వెళ్లబోతోందని అనుకుంటే మళ్లీ బ్రేక్ పడిపోయింది.

ఐతే ఒకవేళ చిరు కాదంటే తన కొడుకు వరుణ్ తేజ్ తో ‘కత్తి’ రీమేక్ చేయాలని నాగబాబు భావిస్తున్నట్లు సమాచారం. వరుణ్ తొలి రెండు సినిమాలు డిఫరెంటుగా ట్రై చేసిన నేపథ్యంలో అతడికి మాస్ ఇమేజ్ తెచ్చిపెట్టే సినిమాల కోసం చూస్తున్నాడు నాగబాబు. ఇప్పటికే  పూరితో సినిమా చేయించాడు - తర్వాత గోపీచంద్ మలినేనిని లైన్ లో పెట్టాడు. ఇప్పుడు ‘కత్తి’ రీమేక్ అయితే వరుణ్ కి పర్ఫెక్ట్ గా ఉంటుందని భావిస్తున్నాడు. చిరు కాదంటే కచ్చితంగా ‘కత్తి’ రీమేక్ వరుణ్ తోనే చేయించాలని.. వినాయక్ ఫ్రీ అయితే అతడితోనే సినిమా చేద్దామని అనుకుంటున్నాడట నాగబాబు. చూద్దాం.. కత్తి రీమేక్ చేసేది మెగాస్టారా.. మెగా ప్రిన్సా అని.
Tags:    

Similar News