రుద్రమదేవిపై కేసీఆర్‌ గరం గరం?

Update: 2015-03-19 04:29 GMT
రుద్రమదేవి.. ఓరుగల్లు కోటని పాలించిన వీరనారి. తెలంగాణ ధీరవనిత. ఆ టైటిల్‌తో సినిమా అంటేనే ఉద్విగ్నత. ఆసక్తి రేకెత్తించే విషయం. అందునా తెలంగాణ, ఆంధ్ర రెండు రాష్ట్రాలుగా ముక్కలయ్యాక తెరకెక్కించిన సినిమా ఇది. స్టార్‌ డైరెక్టర్‌ గుణశేఖర్‌ ఈ చిత్రాన్ని స్వీయదర్శకత్వంలో తెరకెక్కించారు. అనుష్క టైటిల్‌ పాత్ర పోషించింది. చిత్రీకరణ సహా అన్ని పనులు పూర్తయ్యాయి. ఈనెల 21, 22 తేదీల్లో ఏపీ, తెలంగాణలో ఆడియో వేడుక జరగనుంది

ఏపీలో జరిగే ఆడియోకి చంద్రబాబు, తెలంగాణ (వరంగల్‌) ఓరుగల్లులో జరిగే ఆడియోకి కేసీఆర్‌ హాజరవుతారని ప్రచారమైంది. అయితే ఈ రెండుచోట్లా ముఖ్యమంత్రులు బిజీగా ఉండడం వల్ల రావడం కుదరలేదని సమాచారం. అంతేకాదు.. ఈ చిత్రంలోని ఓ డైలాగ్‌ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ హృదయాన్ని తీవ్రంగా గాయపరిచిందని తెలుస్తోంది. ఒకే తల్లి పాలు తాగినవాళ్లందరూ అన్నదమ్ములైతే, ఒకే నీళ్లు తాగే వాళ్లంతా అన్నదమ్ములు, అక్కజెల్లెళ్లు కాలేరా? అని రుద్రమ ప్రశ్నించే డైలాగ్‌ కేసీఆర్‌కి ఎంతమాత్రం రుచించలేదని, రాష్ట్రం విడిపోయాక ఇలాంటి డైలాగును సినిమాలో పెట్టడమేంటని గరమ్‌ అయ్యారని తెలుస్తోంది.

అంతేకాదు హైదరాబాద్‌ నుంచి వరంగల్‌ వరకూ ఆడియో కోసం ప్రయాణించడం ఈ బిజీ షెడ్యూల్‌లో కుదరదని కేసీఆర్‌ చెప్పారని తెలుస్తోంది. రుద్రమదేవి 3డి స్టీరియోస్కోపిక్‌ పద్ధతిలో తెరకెక్కిన సినిమా. ఏప్రిల్‌లో రిలీజవుతోంది.
Tags:    

Similar News