టాలీవుడ్ కి తెలంగాణ ప్రోత్సాహ‌కం వెన‌క లాజిక్ ఇదీ!

Update: 2022-03-13 10:52 GMT
తెలుగు సినిమాకు గ‌డ్డుకాల‌మిది. రెండేళ్లుగా క‌రోనా మ‌హ‌మ్మారీ తీవ్ర ఇబ్బందుల‌కు గురి చేయ‌గా.. ఉపాధి క‌రువై బ‌తుకు తెరువు లేక తీవ్ర క‌ష్టాల్ని అనుభ‌వించాల్సి వ‌చ్చింది. దీనికి తోడు ఇటీవ‌లి కాలంలో ఏపీలో టిక్కెట్టు ధ‌ర‌ల అంశం టాలీవుడ్ కి ఊపిరి ఆడ‌నివ్వ‌లేదు. కొంత‌కాలంగా ఏపీలో జ‌గ‌న్ స‌ర్కార్ టిక్కెట్ ధ‌ర‌ల స‌వ‌ర‌ణ పేరుతో ఇండ‌స్ట్రీని ఇర‌కాటంలో పెట్టిన సంగ‌తి తెలిసిందే.

అద‌న‌పు షోల‌ను బెనిఫిట్ షోల‌ను కూడా ర‌ద్దు చేసి పెద్ద దెబ్బ కొట్టారు. దానికి తోడు టికెట్ ధ‌ర‌ల్ని మ‌రీ తీసిక‌ట్టుగా నిర్ణ‌యిస్తూ జీవో జారీ చేయడంతో బిగ్ పంచ్ ప‌డింది. అయితే మొన్న‌టికి మొన్న స‌వ‌రించిన కొత్త ధ‌ర‌ల‌తో కొత్త నియ‌మాల‌తో మ‌రో జీవోని రిలీజ్ చేయ‌డంతో ప‌రిశ్ర‌మ కొంత ఊపిరి పీల్చుకుంది. కానీ ఈ కొత్త జీవోలో బోలెడంత మ‌త‌ల‌బు ఉంది. ఐదు షోలు వేసుకోవ‌చ్చు కానీ కండీష‌న్లు అప్ల‌య్ అనేశారు. అద‌న‌పు షోలు లేనేలేవు. ఇండ‌స్ట్రీకి ఒక ర‌కంగా జ‌గ‌న్ ప్ర‌భుత్వం వ‌ల్ల టార్చ‌ర్ త‌ప్ప‌లేద‌న్న వాద‌న ఇటీవ‌ల వినిపించింది.

ఇక‌పోతే తెలంగాణ‌లో ఏపీకి పూర్తి విరుద్ధ‌మైన ప‌రిస్థితి ఉంది. ఇప్ప‌టికే ఇక్క‌డ టిక్కెట్టు ధ‌ర‌ల్ని పెంచుకునే వెసులుబాటు క‌ల్పించారు. పెద్ద సినిమాల‌కు తొలి రెండు వారాలు టికెట్ ధ‌ర‌ల్ని పెంచుకునే వెసులుబాటు ఉంది. ఇక ఐదో ఆట వేసుకోవాలంటే మాత్రం ఉద‌యం 8 నుంచి రాత్రి 1గంట లోపు మాత్ర‌మే అవ‌కాశం క‌ల్పించింది. ఒంటి గంట నుంచి ఉద‌యం 8 గం.ల మ‌ధ్య‌లో సినిమాలు వేయ‌డానికి వీల్లేద‌నేది నియ‌మం. అయితే ప్ర‌తిసారీ ప్ర‌తి సినిమా కి ఐదో షో కావాల‌ని అనుమ‌తులు కోరాల్సి వ‌చ్చేది. కానీ ఇప్పుడు దాని బ‌దులుగా శాశ్వత ప్రాతిప‌దిక‌న ఐదో షో వేసుకునేందుకు కొత్త జీవోని ప్ర‌భుత్వం వెలువ‌రించింది. ప్ర‌తిసారీ ప్ర‌భుత్వానికి ద‌ర‌ఖాస్తు ఇక అవ‌స‌రం లేదు.

ఇక‌పోతే ఏపీతో పోలిస్తే తెలంగాణ‌లో పూర్తి భిన్న‌మైన వాతావ‌ర‌ణం ఉండ‌డానికి కార‌ణ‌మేమిటి? అన్న‌ది ఆరా తీస్తే ఓ షాకిచ్చే విష‌యం తెలిసింది. నిజానికి ఏపీ- తెలంగాణ డివైడ్ త‌ర్వాత ఏపీకి సినీప‌రిశ్ర‌మ త‌ర‌లిపోతుంద‌ని అంతా భావించారు. దీని విష‌యంలో తెలంగాణ ప్ర‌భుత్వం కంగారు ప‌డింది. హైద‌రాబాద్ కి టూరిజం హంగులు రావ‌డానికి గ్లామ‌ర్ ఇండ‌స్ట్రీ ఒక పెద్ద వ‌రంగా ప‌ని చేస్తోంది. గ్లామ‌ర్ ఇండ‌స్ట్రీ చుట్టూ ఇత‌ర ఇండ‌స్ట్రీలు అలుముకున్నాయి. అందుకే అలాంటి గొప్ప ప‌రిశ్ర‌మ‌ను ఏపీకి త‌ర‌లించేందుకు మ‌న‌స్క‌రించ‌లేదు.

ఆ క్ర‌మంలోనే సినీప‌రిశ్ర‌మ‌కు కేసీఆర్ - కేటీఆర్ బృందాలు వీలున్నంత‌వ‌ర‌కూ వ‌రాలు కురిపిస్తూనే ఉన్నారు. ఇండ‌స్ట్రీని హైద‌రాబాద్ నుంచి ఎటూ క‌ద‌ల‌నివ్వ‌కుండా వ్యూహంలో ఇది భాగ‌మ‌న్న చ‌ర్చ కూడా ఇండ‌స్ట్రీలో ఉంది. మ‌రోవైపు ఏపీ కి గ్లామ‌ర్ ఇండ‌స్ట్రీ రాక‌పోవ‌డం పై గుర్రుగా ఉండ‌డం వ‌ల్ల‌నే జ‌గ‌న్ ప్ర‌భుత్వం ప‌రిశ్ర‌మ‌పై సాధింపుల‌కు పాల్ప‌డుతోంద‌న్న వాద‌న‌లు కూడా లేక‌పోలేదు. ఈ స‌న్నివేశంలో అడ‌క‌త్తెర‌లో పోక చెక్క‌లా ప‌రిశ్ర‌మ న‌లుగుతోంది.
Tags:    

Similar News