ఎంత కీర్తి వచ్చేసిందంటే..

Update: 2018-05-10 04:33 GMT
హీరోయిన్ గా కెరీర్ ప్రారంభించిన అతి తక్కువ టైంలోనే గుర్తుండిపోయేలా.. ఇంకా చెప్పాలంటే గుర్తు ఉంచుకోవాల్సిన రేంజికి చేరింది కీర్తి సురేష్. ఇంతకుముందు చేసిన సినిమాల్లో కీర్తి మంచినటి అని పేరు తెచ్చుకుంది. కానీ తాజాగా అలనాటి మేటి నటి సావిత్రి జీవిత గాథతో తీసిన మహానటి సినిమాతో యాక్టర్ గా ఆమె కీర్తి ఇండస్ట్రీలో మార్మోగిపోతోంది.

కీర్తి సురేష్ హీరోయిన్ గా తెలుగులో నటించిన అజ్ఞాతవాసి.. తమిళంలో నటించిన తానా సేండ్ర కూట్టమ్ (తెలుగులో గ్యాంగ్) రెండూ బాక్సాఫీస్ వద్ద ఫెయిలయ్యాయి. ఈ రెండు ఫెయిల్యూర్ల తరవాత వచ్చిన మహానటి కీర్తికి బోలెండత రిలీఫ్ ఇచ్చింది. సావిత్రి పాత్ర ఇంతకన్నా ఎవరూ బాగా చెయ్యలేరన్న కాంప్లిమెంట్ దక్కించుకుంది. సావిత్రి రోల్ లో కీర్తి నటనకు నేటి కుర్రకారు నుంచి ఆనాటి సినీజీవుల వరకు అందరూ ఫిదా అయిపోయారు. కమర్షియల్ సినిమాల్లో ఎంత పేరొచ్చినా ఆ గుర్తింపు కొంతకాలమే. కానీ నటనకే భాష్యం చెప్పిన సావిత్రి పాత్రలో శభాష్ అనిపించుకోవడం ఆషామాషీ కాదు. ఆమె కెరీర్ లో ఇదో ల్యాండ్ మార్క్ మూవీగా నిలిచిపోతుందని అంతా ఏకకంఠంతో చెబుతున్నారు.

మహానటి సినిమాలో కీర్తి సురేష్ సావిత్రిని అనుకరించలేదు. దానికి బదులుగా సావిత్రికి వెండితెరపై తిరిగి ప్రాణం పోసింది అంటూ దర్శక ధీరుడు రాజమౌళి కీర్తి గురించి గొప్పగా కాంప్లిమెంట్ ఇచ్చాడు. ఆమె ఇంతవరకు చేసిన పాత్రలో ఇదే అత్యుత్తతమైన పెర్ఫార్మెన్స్ అని జక్కన్న ఘంటాపథంగా చెప్పేశాడు. అందం.. అభినయం కీర్తి సురేష్ కు ముందు నుంచే ఉన్నాయి. ఇప్పుడు మహానటితో అద్భుతం అనే స్థాయికి ఎదిగింది. కీపిటప్ కీర్తి.


Tags:    

Similar News