విక్రమ్‌ మార్కెట్‌ ను పెంచేసిన హీరోయిన్‌

Update: 2018-09-14 16:36 GMT
తమిళ స్టార్‌ హీరో విక్రమ్‌ కొన్ని సంవత్సరాల క్రితం తెలుగులో వరుసగా సూపర్‌ హిట్‌ లను అందుకున్నాడు. ఆమద్య విక్రమ్‌ నటించిన ప్రతి సినిమా తెలుగులో డబ్‌ అవ్వడంతో పాటు - నిర్మాతలకు మంచి లాభాలను తెచ్చి పెట్టేవి. కాని అందంతా గతం - ప్రస్తుతం విక్రమ్‌ సినిమాలను తెలుగులో కొనే వారే లేరు. తెలుగులో విక్రమ్‌ కు గుర్తింపు తగ్గిపోయింది. ఆయన నటించిన చిత్రాలు తెలుగులో అంతగా సక్సెస్‌ కాకపోవడంతో ఆయన చిత్రాలను తెలుగు నిర్మాతలు డబ్‌ చేసేందుకు ఆసక్తి చూపించడం లేదు. విక్రమ్‌ నటించిన తమిళ చిత్రాలు తెలుగులో డబ్‌ అయ్యి కేవలం బుల్లి తెరకు పరిమితం అవుతున్నాయి.

ఇలాంటి సమయంలో విక్రమ్‌ నటించిన ఒక చిత్రం ‘సామి’గా తెలుగులో భారీ ఎత్తున విడుదలకు సిద్దం అవుతుంది. విక్రమ్‌ గత చిత్రాలు రెండు కోట్లు కూడా పలకని నేపథ్యంలో ఈ చిత్రం మాత్రం ఏకంగా 8 కోట్లకు తెలుగు డబ్బింగ్‌ రైట్స్‌ అమ్ముడు పోయినట్లుగా చెబుతున్నారు. విక్రమ్‌ కు తెలుగు ప్రేక్షకుల్లో ఏమాత్రం క్రేజ్‌ లేకున్నా కూడా ఇంత భారీ మొత్తంకు అమ్ముడు పోవడానికి ప్రధాన కారణం హీరోయిన్‌ కీర్తి సురేష్‌ అంటూ సినీ వర్గాల్లో టాక్‌ వినిపిస్తుంది.

తమిళ హీరోయిన్‌ కీర్తి సురేష్‌ తెలుగులో ‘మహానటి’ చిత్రంతో స్టార్‌ హీరోయిన్‌ క్రేజ్‌ ను దక్కించుకుంది. ‘మహానటి’ చిత్రంతో కీర్తి సురేష్‌ కు మంచి గుర్తింపు రావడంతో ఆమె నటించిన తమిళ చిత్రంకు కూడా తప్పకుండా మంచి ఆధరణ తెలుగులో ఉంటుందనే నమ్మకంతో నిర్మాతలు ఈ చిత్రంను భారీ మొత్తంకు కొనుగోలు చేసినట్లుగా తెలుస్తోంది. కీర్తి సురేష్‌తో పాటు దర్శకుడు హరికి తెలుగులో మంచి క్రేజ్‌ ఉంది. హరి దర్శకత్వంలో వచ్చిన సింగం చిత్రాలు తెలుగులో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాయి. అందుకే ‘సామి’ చిత్రం కూడా తప్పకుండా ఆకట్టుకుంటుందనే నమ్మకంతో 8 కోట్లకు తెలుగు డబ్బింగ్‌ రైట్స్‌ ను కొనుగోలు చేసినట్లుగా తెలుస్తోంది. హీరోను కాకుండా హీరోయిన్‌ను చూసి అంత పెట్టడంపై సినీ వర్గాల్లో కొందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News