మూవీ రివ్యూ : మిస్ ఇండియా

Update: 2020-11-04 12:01 GMT
చిత్రం : ‘మిస్ ఇండియా’

నటీనటులు: కీర్తి సురేష్-నవీన్ చంద్ర-జగపతిబాబు-నదియా-నరేష్-రాజేంద్ర ప్రసాద్-కమల్ కామరాజు-సుమంత్ శైలేంద్ర-పూజిత పొన్నాడ తదితరులు
సంగీతం: తమన్
ఛాయాగ్రహణం: సుజీత్ వాసుదేవ్
నిర్మాత: మహేష్ కోనేరు
రచన: నరేంద్రనాథ్-తరుణ్ కుమార్
దర్శకత్వం: నరేంద్రనాథ్

‘మహానటి’తో నటిగా ఒకేసారి చాలా మెట్లు ఎక్కేసింది కీర్తి సురేష్. దాని తర్వాత వరుసగా లేడీ ఓరియెంటెడ్ సినిమాలు ఆమెను వెతుక్కుంటూ వచ్చాయి. అందులో ఒకటైన ‘పెంగ్విన్’ కొన్ని నెలల కిందటే వచ్చింది. వెళ్లింది. ఇప్పుడు అదే కోవలో ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకొచ్చిన సినిమా ‘మిస్ ఇండియా’. నెట్ ఫ్లిక్స్‌ లో రిలీజైన ఈ సినిమా అయినా కీర్తి స్థాయికి తగ్గట్లు ఉందో లేదో చూద్దాం పదండి.

కథ: మానస సంయుక్త (కీర్తి సురేష్) విశాఖపట్నంలోని లంబసింగి ప్రాంతానికి చెందిన మధ్య తరగతి అమ్మాయి. తాను పెద్దయ్యాక ఎంబీఏ చదివి బిజినెస్ చేయాలని చిన్నతనంలోనే ఒక లక్ష్యం పెట్టుకుంటుంది. ఆమె తాతయ్య (రాజేంద్ర ప్రసాద్) తనకు ప్రోత్సాహంగా నిలుస్తాడు. కానీ పెరిగి పెద్దయ్యాక మాత్రం మిగతా కుటుంబ సభ్యులెవరూ ఆమెకు అండగా నిలవరు. తాత చనిపోవడం, అన్నయ్యకు ఉద్యోగం రావడంతో అయిష్టంగానే అమెరికాకు వెళ్తుంది సంయుక్త. అక్కడ చదువు పూర్తయ్యాక వ్యాపార ప్రణాళికల్లో ఉన్న ఆమెకు ఎవరి నుంచీ సహకారం అందదు. చివరికి అందరినీ విడిచిపెట్టి.. ఒక్కత్తే తన లక్ష్యం వైపు అడుగులు వేయడం మొదలవుతుంది. ఈ క్రమంలో ఆమెకు ఎదురైన సవాళ్లేంటి.. వాటిని ఎలా అధిగమించింది.. అనుకున్న లక్ష్యాన్ని సాధించింది అన్నది మిగతా కథ.

కథనం-విశ్లేషణ: మన హీరోయిన్ గారికి టీ అంటే మహా ఇష్టం. ఎంతిష్టం అంటే.. ఆమెకు జబ్బు చేస్తే మాత్ర వేసుకోదు. టీనే తాగుతుంది. తర్వాత హీరోయిన్ అమెరికాకు వెళ్లి అక్కడ టీ దొరకలేదని విలవిలలాడిపోతుంది. ఒక అబ్బాయితో డిన్నర్ కు వెళ్లి ఫుల్లుగా బువ్వ తిన్నాక కూడా మళ్లీ టీనే అడుగుతుంది. వ్యాపారం చేయాలన్న తన ఆలోచనను ఇంట్లో వాళ్లు అర్థం చేసుకోలేదని బయటికి వచ్చేశాక ఆమెకు అప్పుడు కూడా టీనే గుర్తుకొస్తుంది. పెద్ద రేంజిలో టీ వ్యాపారం చేసెయ్యాలని ఫిక్సయిపోతుంది. అందుకోసం ఒక పెద్ద కాఫీ బ్రాండును నడిపించే మల్టీ మిలియనీర్ ను కలుస్తుంది. అతను కాదంటే సవాలు చేస్తుంది. సొంతంగా టీ బిజినెస్ పెట్టేస్తుంది. ఆమె ధాటికి వేల కోట్ల అధిపతి అయిన కాఫీ బ్రాండోడు కుప్పకూలిపోతాడు. అమెరికన్లందరూ డ్రగ్స్ కు బానిసలైపోయినట్లు మనమ్మాయి గారి టీ మత్తులో పడి కొట్టుకుంటారు. ఒకట్రెండు సార్లు టీ తాగిన పుణ్యానికి ఆమె టీ బిజినెస్ ప్రమాదంలో ఉందంటే నోట్ల కట్టలు పట్టుకుని ఆమె షాపులోకి పొలోమని వచ్చేస్తారు. ఆన్ లైన్లోనూ డాలర్లు కుమ్మరించేస్తారు. అంతా చదువుతుంటే.. ‘ఏమిటి ఈ టీ గోల’ అనిపిస్తోందా? నాలుగు వాక్యాలు చదువుతున్నందుకే అంత అసహనం కలిగితే.. తెరపై రెండుంబావు గంటల పాటు ఈ ‘టీ’ గోలను భరించే వాళ్ల పరిస్థితేంటో ఊహించుకోండి.

‘మిస్ ఇండియా’లో ఒక సన్నివేశంలో విలన్ గురించి పక్కనుండే అసిస్టెంట్ అమెరికాలోనే అతి పెద్ద ఇండియన్ బిజినెస్ మ్యాన్ అని ఉపోద్ఘాతం ఇస్తాడు. ఐతే ఇంట్లోంచి బయటికొచ్చేసి, చేతిలో చిల్లిగవ్వ లేని హీరోయిన్ అలాంటోడిని నేరుగా ఆయన ఆఫీసులో కలిసి బిజినెస్ ప్రపోజల్ పెట్టేద్దామని వెళ్తుంది. రిసెప్షన్లో ఆయన కోసం అడిగితే అపాయింట్మెంట్ లేకపోతే ఆయన్ని కలవడానికి వీల్లేదంటారు. హీరోయిన్ ‘‘నన్ను కలవకపోతే పెద్ద అవకాశం కోల్పోతారని మీ ఎండీకి చెప్పు అంటుంది’’. ఆ మాట విని ఆ వేల కోట్ల అధిపతి అనామకురాలైన హీరోయిన్ రిసెప్షన్లో కూర్చున్న చోట ప్రత్యక్షం అయిపోతాడు. ఆమెతో తాపీగా ముచ్చట్లు పెడతాడు. బిజినెస్ ప్లాన్ వింటాడు. నీ ఐడియా బాలేదు కానీ, ప్రెజెంటేషన్ బాగుంది నాతో చేతులు కలిపేయ్ అంటాడు. కానీ ఆ వేల కోట్ల అధిపతి ఆఫర్ నచ్చని హీరోయిన్ ‘‘మీదాకా వస్తానో.. మిమ్మల్నే దాటేస్తానో విధి నిర్ణయిస్తుంది’’ అంటూ  పంచ్ డైలాగ్ పేల్చి స్లోమోషన్లో నడుస్తుంటే ఒక పేద్ద మాస్ హీరోకు ఎలివేషన్ ఇస్తున్నట్లుగా మోతెక్కిపోయే బ్యాగ్రౌండ్ స్కోర్. ఈ సన్నివేశాన్ని ఒకసారి విజువలైజ్ చేసుకుని చూస్తే ‘మిస్ ఇండియా’ మేకర్స్ ఎలా గాలిమేడలు కట్టేశారో అర్థమైపోతుంది.

తన దగ్గర పైసా పెట్టుబడి లేదు. పైగా తాను అమ్మాలనుకున్న ఉత్పత్తికి ఆ దేశంలో ఉనికే లేదు. దానికి ప్రత్యామ్నాయంగా ఉన్న మరో ఉత్పత్తికి అక్కడి జనాలు అడిక్ట్ అయి ఉన్నారు. అలాంటపుడు వాళ్ల ఆలోచన మార్చి.. తన ఉత్పత్తి వైపు ఆకర్షితుల్ని చేసి తన వ్యాపారాన్ని ఒక స్థాయికి తీసుకురావడానికి హీరోయిన్ ఎంతగా స్ట్రగుల్ అవ్వాలి. దీన్నెంత బలంగా చూపించాలి. కానీ ‘మిస్ ఇండియా’లో మాత్రం హీరోయిన్ గట్టిగా ఒక కొటేషన్ చెబితే చాలు.. మూడు కోట్ల పెట్టుబడి రెడీ. అనుకోకుండా తన షాపులోకి వచ్చిన కుక్కపిల్లను ఆడించి, దాని యజమానికి ఒక టీ చేసి ఇస్తే చాలు.. బిజినెస్ సూపర్ హిట్.. దేశమంతా బ్రాంచులు. ఇన్వెస్టర్లు ‘ఇట్స్ ఎ ప్రివిలేజ్ టు జాయిన్ విత్ యు’ అంటూ పొంగిపోతారు. రెండు నెలలు తిరిగేలోపు హీరోయిన్ బిజినెస్ చూసి విలన్ షాక్. బ్లాంక్ చెక్ తీసి ఆమె ముందు పెట్టేసి ఆమె వ్యాపారాన్ని తనకు రాసిచ్చేయమంటాడు. ఆమె నో అందని పరమ రొటీన్ గా తన పక్కనున్న స్నేహితురాలిని కొనేసి వ్యాపారాన్ని దెబ్బ తీసేస్తాడు. కూలిపోయిన ఆమె సామ్రాజ్యాన్ని చూసి కామెడీ చేస్తాడు. అయినా హీరోయిన్ తగ్గుతుందా..? ఛాన్సే లేదు. ‘‘నువ్వు గ్రాముల్లో కలిగించిన ఈ కష్టాన్ని టన్నుల్లో తీసుకోవడానికి రెడీగా ఉండు మిస్టర్ కైలాష్’’ అంటూ ‘జల్సా’లో పవన్ కళ్యాణ్ స్టైల్లో పంచ్ డైలాగ్ పేల్చి స్లో మోషన్లో ముందుకు కదులుతుంది. మళ్లీ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ స్టార్ట్.

టీకి చోటు లేని అమెరికాలో ఆ టీ వ్యాపారాన్ని విస్తరించడం అనే ‘మిస్ ఇండియా’ పాయింట్ వినడానికి బాగానే అనిపిస్తుంది. కానీ ఆ ఐడియాను ఎంత పేలవంగా ఎగ్జిక్యూట్ చేయాలో అంత పేలవంగా చేశారు. పూర్తి నాటకీయంగా.. ఏమాత్రం ఎమోషనల్ కనెక్ట్ లేకుండా.. కృత్రిమమైన పాత్రలు.. సన్నివేశాలతో నింపేసి.. ఆద్యంతం ప్రేక్షకులను విసిగించేలా ‘మిస్ ఇండియా’ను తయారు చేసి పెట్టారు. ఇలాంటి కథల్ని వాస్తవికంగా.. మనసుకు హత్తుకునేలా చెప్పాలన్న అవగాహన లేకపోయింది. తెరపై ఒక్కటంటే ఒక్క పాత్రతోనూ ప్రేక్షకులు కనెక్టయ్యే అవకాశమే లేదు. అన్నీ కృత్రిమమే. కనీస స్థాయిలో కూడా కసరత్తు లేకుండా వ్యక్తిత్వ వికాస పుస్తకాల్లోని డైలాగులన్నీ తీసి పాత్రలతో చెప్పించేసి.. ఇలాంటి కథలో ఏమాత్రం అతకని విధంగా మాస్ హీరోల స్టయిల్లో హీరోయిన్ పాత్రను ప్రెజెంట్ చేసి ప్రేక్షకులను తీవ్రమైన అసహనానికి గురి చేశాడు కొత్త దర్శకుడు నరేంద్రనాథ్. ఈ సినిమాకున్న ఏకైక సానుకూలత.. ఇది ఓటీటీలో రిలీజ్ కావడం. టికెట్ కొనుక్కుని థియేటర్ లోపలికెళ్లాక మధ్యలో వచ్చేయబుద్ధి కాదు. కానీ ఓటీటీలో కాబట్టి ఫాస్ట్ ఫార్వార్డ్ కొట్టుకుంటూ వెళ్లొచ్చు. లేదంటే సినిమాను మధ్యలోనే ఆపేయొచ్చు. అలా చేయకుండా ‘మిస్ ఇండియా’ను పూర్తిగా చూడగిలిగితే మాత్రం అది గొప్ప సాహసమే. ఓటీటీల్లో నేరుగా విడుదలైన తెలుగు చిత్రాల్లో అత్యంత పేలవమైనది నిలవడానికి ‘మిస్ ఇండియా’ గట్టి పోటీదారు అనడంలో మరో మాట లేదు.

నటీనటులు: ‘మహానటి’తో అంతెత్తు ఎదిగిన కీర్తి సురేష్‌ ఆ తర్వాత ఎంచుకుంటున్న పాత్రలు చూస్తే జాలి పడాల్సిందే. ‘పెంగ్విన్’ చూసి ఇదేం సినిమా, ఇదేం పాత్ర అనుకున్న వాళ్లు.. ‘మిస్ ఇండియా’ చూశాక అది చాలా బెటర్ అంటే ఆశ్చర్యమేమీ లేదు. ‘మహానటి’లో నటించాక ఇలాంటి పాత్రను నమ్మి దర్శకుడు చెప్పిందంతా ఎలా చేసుకుపోయిందో తల బద్దలు కొట్టుకున్నా అర్థం కాదు. కీర్తిని వ్యక్తిగతంగా తప్పుబట్టడం కాదు కానీ.. ఈ సినిమాలో ఆమె బాడీ లాంగ్వేజ్.. హావభావాలు.. డైలాగులు అన్నీ చాలా సిల్లీగా కామెడీగా ఉన్నాయి. సీరియస్ సన్నివేశాలు.. డైలాగులకు ‘అబ్బా ఛా’ అని వెటకారంగా నవ్వాల్సిన పరిస్థితి వస్తే ఏమనాలి? సినిమాలో మిగతా నటీనటుల పాత్రలూ అలాగే తయారయ్యాయి. జగపతిబాబు.. నరేష్.. రాజేంద్ర ప్రసాద్.. నదియా లాంటి సీనియర్ ఆర్టిస్టులకు ఇచ్చిన పాత్రలు.. వాళ్లు చాలా మొక్కుబడిగా పలికించిన హావభావాల గురించి వర్ణించడం కష్టం. నవీన్ చంద్ర అసలు సినిమాలోకి ఎందుకొచ్చాడో.. ఎందుకు వెళ్లిపోయాడో అర్థం కాదు. ‘సెకండ్ హీరో’గా కనిపించిన ‘బ్రాండ్ బాబు’ సుమంత్ శైలేంద్ర పాత్ర.. నటన గురించి మాటల్లో చెప్పలేం.

సాంకేతిక వర్గం: ‘మిస్ ఇండియా’లో తమన్ బ్యాగ్రౌండ్ స్కోర్ వింటుంటే.. ఏదైనా మాస్ సినిమా రీ రికార్డింగ్ పూర్తయ్యాక అది విడుదలకు నోచుకోకుండా ఆగిపోతే.. ఆ స్కోర్ అంతా తీసి దీనికి వాడేశాడేమో అనిపిస్తుంది. ఒక హీరోయిన్ ఓరియెంటెడ్ కథలో నేపథ్య సంగీతంతో ఆ ఎలివేషన్లేంటో.. ఆ హమ్మింగ్స్ ఏంటో అర్థం కాదు. అయినా హీరోయిన్ పాత్రను.. సన్నివేశాలను అలా ప్రెజెంట్ చేసినపుడు అతను మాత్రం ఏం చేయగలడు? తమన్ పాటల్లో ఒక మెలోడీ మాత్రం బాగుంది. కెమెరామన్ సుజీత్ వాసుదేవ్ ఉన్నంతలో కలర్ ఫుల్ విజువల్సే ఇచ్చాడు. నిర్మాణ విలువల విషయంలో ఏమీ ఢోకా లేదు. బాగానే ఖర్చు పెట్టినట్లు అనిపిస్తుంది. కానీ కథా కథనాల్లో విషయం లేనపుడు ఎన్ని హంగులుండి ఏం లాభం? ఇలాంటి కథకు ప్రేక్షకులతో ఎమోషనల్ కనెక్ట్ ఏర్పడేలా చేయడం అత్యంత ముఖ్యమైన విషయం అన్నది రైటర్ కమ్ డైరెక్టర్ నరేంద్రనాథ్ గుర్తించలేకపోయాడు. ఇటు రచన, అటు దర్శకత్వంలో అతను పూర్తిగా తేలిపోయాడు. ఇలాంటి స్క్రిప్టుతో కీర్తి సహా అందరినీ అతనెలా ఒప్పించగలిగాడన్నది ఆశ్చర్యం కలిగించే విషయం. మాస్ హీరోలను పెట్టి లాజిక్ తో సంబంధం లేకుండా లార్జర్ దన్ లైఫ్ క్యారెక్టర్లతో సినిమాలు చేసినపుడు ఎన్ని విన్యాసాలు చేసినా సరిపోతుంది కానీ ఇలాంటి కథలకు ఈ తరహా నరేషన్ ఎంతమాత్రం పనికి రాదు.

చివరగా: మిస్ ఇండియా.. ఏమి‘టీ’ గోల?

రేటింగ్: 1.5/5
Tags:    

Similar News