ల‌క్ష్మీపార్వ‌తిని కేతిరెడ్డి వ‌దిలేలా లేరే!

Update: 2017-11-19 07:59 GMT
తెలుగు ప్ర‌జ‌ల ఆరాధ్య న‌టుడు - తెలుగు దేశం పార్టీ వ్య‌వ‌స్థాప‌కుడు, దివంగ‌త సీఎం నంద‌మూరి తార‌క‌రామారావు జీవిత చ‌రిత్ర ఆధారంగా తెర‌కెక్కుతున్న సినిమాలు తెలుగు నేల‌లో పెను అల‌జ‌డినే రేపుతున్నాయి. త‌న తండ్రి జీవిత చ‌రిత్ర ఆధారంగా సినిమా తీయాల‌నుంద‌ని ప్ర‌క‌టించిన ఎన్టీఆర్ కుమారుడు - టీడీపీ ఎమ్మెల్యే నంద‌మూరి బాల‌కృష్ణ‌... ఆ బాధ్య‌త‌ల‌ను ద‌ర్శ‌కుడు తేజ‌కు అప్ప‌గించేశారు. చాలా సైలెంట్‌గానే తేజ ఆ ప‌నిలో ప‌డిపోయారు. ఈలోగానే తాను కూడా ఎన్టీఆర్ జీవిత చ‌రిత్ర‌పై సినిమా తీస్తానంటూ రంగంలోకి దిగేసిన బాలీవుడ్ సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ రాంగోపాల్ వ‌ర్మ‌... *లక్ష్మీస్ ఎన్టీఆర్‌* పేరిట ఏకంగా సినిమా పేరును కూడా ప్ర‌క‌టించేసి సంచ‌ల‌నం రేపారు. ఈ చిత్రానికి నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న వ్య‌క్తి వైసీపీకి చెందిన నేత కావ‌డంతో వివాదం రాజుకుంది. ఈ వివాదం స‌ద్దుమ‌ణ‌గక‌ముందే... చెన్నైలో తెలుగు ప్ర‌జ‌ల హ‌క్కుల ప‌రిర‌క్ష‌ణ కోసం కృషి చేస్తున్న కేతిరెడ్డి జ‌గ‌దీశ్వ‌ర‌రెడ్డి కూడా రంగంలోకి దిగిపోయారు. *ల‌క్ష్మీస్ వీర‌గ్రంథం* పేరిట తాను ఎన్టీఆర్ జీవిత చ‌రిత్ర‌పై సినిమా తీస్తున్నాన‌ని ఆయ‌న ప్ర‌క‌టించారు. మొద‌టి రెండు చిత్రాల‌కు పెద్ద‌గా అభ్యంత‌రం చెప్ప‌ని ఎన్టీఆర్ రెండో భార్య, ప్ర‌స్తుతం వైసీపీలో కొన‌సాగుతున్న ల‌క్ష్మీపార్వ‌తి... కేతిరెడ్డి సినిమాపై మాత్రం అభ్యంత‌రం చెప్పారు. త‌న ప‌రువుకు భంగం క‌లిగించేందుకే కేతిరెడ్డి కంక‌ణం క‌ట్టుకున్నార‌ని, అందుకు తాను స‌మ్మ‌తించేది లేదని బ‌హిరంగంగానే ప్ర‌క‌టించారు.

అయినా మొద‌టి రెండు సినిమాల‌కు అభ్యంత‌రం లేనిది... త‌న చిత్రంపై మాత్రం అభ్యంత‌రం ఎందుక‌ని కేతిరెడ్ది కూడా కాస్తంత ఘాటుగానే బ‌దులిచ్చారు. ఆరోప‌ణ‌లు - ప్ర‌త్యారోప‌ణ‌ల మ‌ధ్యే కేతిరెడ్డి త‌న చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకెళ్లే య‌త్నం చేశారు. ఈ క్ర‌మంలో హైద‌రాబాదులోని ఎన్టీఆర్ ఘాట్ వ‌ద్ద మొన్నామ‌ధ్య ఆయ‌న చేప‌ట్టిన చిత్ర షూటింగ్ ప్రారంభోత్స‌వాన్ని పోలీసులు అడ్డుకున్నారు. ఆ త‌ర్వాత ఎన్టీఆర్ సొంతూరు నిమ్మ‌కూరులోనూ ఆయ‌న య‌త్నం బెడిసికొట్టింది. ఈ క్ర‌మంలోనే కేతిరెడ్డి ఓ కొత్త ఆరోప‌ణ చేశారు. ల‌క్ష్మీస్ వీర‌గ్రంథం చిత్రాన్ని తెర‌కెక్కించే య‌త్నాన్ని విర‌మించుకోక‌పోతే... చంపేస్తామంటూ కొంద‌రు గుర్తు తెలియ‌ని వ్య‌క్తుల నుంచి ఆయ‌న‌కు బెదిరింపులు ఎదుర‌య్యాయ‌ట‌. ఇదే వాద‌న‌ను బ‌య‌ట‌పెట్టిన కేతిరెడ్డి... మొన్న హైద‌రాబాదు వేదిక‌గా ఓ వీడియోను విడుద‌ల చేసి క‌ల‌కలం రేపారు. త‌న‌కు ఎదుర‌వుతున్న బెదిరింపుల వెనుక ల‌క్ష్మీపార్వ‌తి హ‌స్త‌ముంద‌ని కూడా ఆయ‌న ఆరోపించారు. అయినా బెదిరింపులు ఏమాత్రం ఆగ‌లేద‌ని వాపోయిన కేతిరెడ్డి... మొన్న విజ‌య‌వాడ‌లో ఏపీ డీజీపీని క‌లిశారు. త‌న‌కు ల‌క్ష్మీపార్వ‌తి నుంచి ప్రాణ‌హానీ ఉంద‌ని, త‌న‌కు భ‌ద్ర‌త క‌ల్పించాల‌ని లిఖిత పూర్వ‌కంగా ఫిర్యాదు చేశారు.

అప్ప‌టికీ త‌న భ‌ద్ర‌త‌పై ఆందోళ‌న వీడ‌ని కేతిరెడ్డి నిన్న నేరుగా టీడీపీ అధినేత‌, ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడిని క‌లిశారు. ల‌క్ష్మీపార్వ‌తి నుంచి త‌న‌కు ప్రాణ హానీ ఉంద‌ని, ల‌క్ష్మీస్ వీర‌గ్రంథం సినిమా తీస్తే చంపేస్తామ‌ని బెదిరిస్తున్నార‌ని ఆయ‌న చంద్ర‌బాబుకు ఫిర్యాదు చేశారు. ఈ క్ర‌మంలో త‌న‌తో పాటు  సినిమా యూనిట్‌కు రక్షణ కల్పించాలని కోరారు.ఈ మేరకు చంద్రబాబునాయుడు నుండి సానుకూల సంకేతాలు వచ్చాయని ఆయన చెప్పారు. అయినా మొద‌టి రెండు చిత్రాల‌ను వ‌దిలేసిన ల‌క్ష్మీపార్వ‌తి... మూడో సినిమాపైనే ఎందుకు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నార‌న్న విష‌యంపైనా కేతిరెడ్డి త‌న‌దైన వాద‌న‌ను వినిపిస్తున్నారు. ఎన్టీఆర్ జీవితంలోకి ప్రవేశించడానికి ముందు లక్ష్మీపార్వతి జీవిత చరిత్రపై ఈ సినిమా ఉంటుందని తాను ప్ర‌క‌టించాన‌ని, ఎన్టీఆర్ ను లక్ష్మీపార్వతి వివాహం చేసుకోవడానికి దారి తీసిన‌ పరిస్థితులను ఈ సినిమాలో చూపించనున్నట్టు కేతిరెడ్డి ప్రకటించారు. ఈ ఒక్క కార‌ణంతోనే తనను కించపర్చేందుకు ఈ సినిమాను తీస్తున్నారని ల‌క్ష్మీపార్వ‌తి ఆరోపిస్తున్నార‌న్న‌ది కేతిరెడ్డి వాద‌న‌. మ‌రి ల‌క్ష్మీపార్వ‌తిపై త‌న‌కు అందిన ఫిర్యాదుపై చంద్ర‌బాబు ఎలా స్పందిస్తార‌న్న విష‌యం ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింద‌ని చెప్పాలి.
Tags:    

Similar News