ఇండస్ట్రీకి వచ్చి 50 ఏళ్లు.. టికెట్ల ధర పై ఏమన్నాడంటే?

Update: 2022-01-01 05:30 GMT
తన స్వరంతో హీరోలకు హీరోయిజం తెచ్చి పెట్టిన నటుడు కమ్ డబ్బింగ్ ఆర్టిస్ట్ సాయికుమార్. కొత్త సంవత్సరం వేళ.. పలువురు తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం ఒక అలవాటుగా ఉంటుంది. ఇదే తీరులో కొత్త సంవత్సరం ఆరంభంలో (శనివారం) తిరుమల శ్రీవారి దర్శనం కోసం పలువురు సినీ.. రాజకీయ ప్రముఖులతో పాటు పలు రంగాలకు చెందిన వారు స్వామి వారిని దర్శించుకున్నారు. వారిలో ఒకరు సాయి కుమార్.

స్వామిని దర్శించుకొని బయటకు వచ్చిన ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కుటుంబంతో కలిసి వీఐపీ బ్రేక్ దర్శనంలో స్వామిని దర్శించుకున్న ఆయన.. ఈ ఏడాది తనకు చాలా ప్రత్యేకమని చెప్పారు. తాను సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన ఈ ఏడాదితో యాభై ఏళ్లు పూర్తి అవుతుందని చెప్పారు. ఈ ఏడాది తాను పలు భాషా చిత్రాల్లో నటిస్తున్నట్లు చెప్పారు.

టికెట్ల ధరలపై ప్రభుత్వం కమిటీ వేసిందని.. వర్చువల్ గా జరిగిన కమిటీ సమావేశంలో తాను పాల్గొన్నట్లు చెప్పారు. అందరికి అందుబాటులో ఉండేలా టికెట్ల ధరలు ఉండాలని.. అతి త్వరలోనే ఈ సమస్య పరిష్కారం అవుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఏపీలో కారు చౌకకు సినిమా టికెట్ల ధరలు ఉంటే.. అందుకు భిన్నంగా తెలంగాణలో భారీగా ధరల్ని పెంచేసిన తీరుపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.

ఇలాంటి వేళ.. సాయి కుమార్ నోటి నుంచి అందరికి అందుబాటు ధరల్లో టికెట్ల ధరలు ఉండాలన్న విషయాన్ని ప్రస్తావించటం ద్వారా.. ధరలు ఎక్కువగా ఉన్నాయన్న విషయాన్ని చెప్పకనే చెప్పినట్లైంది.



Tags:    

Similar News