కేజీఎఫ్-2.. బద్దలైపోతున్న రికార్డులు.. వరల్డ్ నెం1!

Update: 2021-01-08 12:09 GMT
దేశవ్యాప్తంగా ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న కేజీఎఫ్ చాప్టర్-2.. విడుదలకు ముందే రికార్డులు బద్దలు కొడుతోంది! శుక్రవారం హీరో యశ్ పుట్టిన రోజు సందర్భంగా విడుదలైన టీజర్ ప్రపంచ రికార్డు సృష్టించింది. విడుదలైన గంటల్లోనే కోట్లాది వ్యూస్ రాబట్టి చరిత్ర తిరిగరాసింది.

వాస్తవానికి యశ్ బర్తడే రోజైన జనవరి 8వ తేదీన టీజర్ రిలీజ్ చేస్తామని ప్రకటించింది యూనిట్. ఉదయం 10.18 నిమిషాలకు విడుదల చేస్తామని చెప్పింది. కానీ.. ఆలోపే టీజర్ లీక్ కావడంతో అనుకున్న సమయం కన్నా.. 12 గంటల ముందే టీజర్‌‌ను రిలీజ్ చేశారు.  

అయితే.. ఇలా అనుకోకుండా టీజర్ వచ్చినా సరే.. అది సోషల్ మీడియాను షేక్ చేసేసింది. టీజర్ రిలీజైన కేవలం 12 గంటల్లోనే వివిధ భాషల్లో కలిపి 25 మిలియన్ల (2.5 కోట్లు) మంది చూసేశారు. ఈ వ్యూయర్ షిప్ తో ప్రపంచ రికార్డు సృష్టించి విశ్లేషకులను సైతం విస్మయ పరుస్తోంది.

శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల సమయానికి యూట్యూబ్‌లో 'కేజీఎఫ్-2' టీజర్ అన్ని భాషల్లో కలిపి 3 కోట్లకు పైగా వ్యూస్ సాధించడం విశేషం. ఇక ఈ టీజర్ లైక్స్ విషయంలోనూ ప్రపంచ రికార్డులు బద్దలు కొడుతూ దూసుకెళ్తోంది. అత్యంత వేగంగా 1 మిలియన్ లైక్స్, 2 మిలియన్ లైక్స్ సంపాదించిన టీజర్‌గా వరల్డ్ రికార్డులు నెలకొల్పింది కేజీఎఫ్ చాప్టర్-2 టీజర్.

రెండేళ్ల కిందట కన్నడలో మంచి అంచనాలతో, ఇతర భాషల్లో ఎలాంటి అంచనాలూ లేకుండా విడుదలైంది 'కేజీఎఫ్' మొదటి పార్ట్. కానీ.. రిలీజ్ అయిన తర్వాత గానీ.. ఆ చిత్రం సత్తా ఏంటో తెలియలేదు ప్రపంచానికి. విడుదలైన అన్ని భాషల్లోనూ సంచలన విజయం నమోదు చేసింది.

ఓ కన్నడ సినిమా కర్ణాటక అవతల విడుదల కావడమే పెద్ద విశేషం అనుకునే పరిస్థితుల్లోంచి.. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో అసాధారణ వసూళ్లతో ట్రేడ్ పండిట్లను విస్మయానికి గురి చేసింది మొదటి చాప్టర్.

నిజానికి.. తొలుత ఈ సినిమాను లైట్ తీసుకున్న వాళ్లు కూడా.. ఆ తర్వాత దీని స్పెషాలిటీ ఏంటో తెలుసుకుందామని చూడడం మొదలు పెట్టారు. థియేటర్లలోనే కాక.. అమేజాన్ ప్రైమ్‌లోనూ వివిధ భాషల ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ఎగబడి చూశారంటే అతిశయోక్తి కాదు.

తొలి పార్ట్ అసంపూర్ణంగా ఎప్పుడైతే ముగిసిందో.. నాటి నుంచి రెండో పార్ట్ కోసం ఎదురు చూస్తున్నారు సినిమా అభిమానులు. ప్రస్తుతం టీజర్ కు వస్తున్న వ్యూస్ చూస్తుంటేనే.. ఈ సినిమాపై ఆడియన్స్ ఎంత ఆసక్తితో ఉన్నారో అర్థమవుతోంది. ప్రేక్షకుల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా టీజర్ కట్ చేశాడు దర్శకుడు ప్రశాంత్ నీల్. మరి, టీజరే ఇలా ఉంటే.. ఇక ఫుల్ మీల్స్ లాంటి సినిమా ఎలా ఉంటుందోనని అంచనాలు వేసుకుంటున్నారు ఫ్యాన్స్.
Tags:    

Similar News