మూవీ రివ్యూ: 'ఖైదీ'

Update: 2019-10-25 09:46 GMT
‘ఖైదీ’ మూవీ రివ్యూ

నటీనటులు: కార్తి - నరేన్ కుమార్ - హరీష్ ఉత్తమన్ - హరీష్ పేరడి తదితరులు
సంగీతం: సామ్ సి.ఎస్
ఛాయాగ్రహణం: సత్యన్ సూర్యన్
నిర్మాతలు: ఎస్.ఆర్.ప్రభు - రాధామోహన్
రచన - దర్శకత్వం: లోకేష్ కనకరాజ్

తెలుగులో ఒకప్పుడు మంచి క్రేజ్ సంపాదించుకున్న తమిళ హీరో కార్తి.. తర్వాత తన స్థాయికి తగని సినిమాలతో మార్కెట్ కోల్పోయాడు. మధ్యలో ‘ఊపిరి’; ‘ఖాకి’ లాంటి సినిమాలతో మెప్పించిన అతను.. మళ్లీ ట్రాక్ తప్పాడు. ఇప్పుడతను ‘ఖైదీ’ అనే యాక్షన్ థ్రిల్లర్ తో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ప్రోమోల్లో భిన్నమైన సినిమాలా కనిపించిన ‘ఖైదీ’ తెరపై ఎలా ఉందో తెలుసుకుందాం పదండి.

కథ:

డిల్లీ బాబు (కార్తి) ఒక కేసులో యావజ్జీవ కారాగార శిక్ష పడ్డ ఖైదీ. పదేళ్ల శిక్ష పూర్తయ్యాక.. సత్ ప్రవర్తన  కారణంగా మిగతా నాలుగేళ్ల శిక్ష తగ్గించి అతణ్ని విడుదల చేస్తారు. అప్పటిదాకా ఒక్కసారీ చూడని తన కూతురిని చూడాలని అతను తహతహలాడుతుండగా.. ఒక పెద్ద ప్రమాదం  నుంచి 40 మంది పోలీసుల్ని కాపాడాల్సిన  బాధ్యత అతడిపై పడుతుంది. అంతమంది పోలీసులు అతడిపై ఆధారపడాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది.. వాళ్లను అతను కాపాడాడా లేదా.. తన కూతురిని కలిశాడా లేదా అన్నది మిగతా కథ.

కథనం - విశ్లేషణ:

‘ఖైదీ’ సినిమా నిడివి దాదాపు రెండున్నర గంటలు. ఈ రెండున్నర గంటల కథ రాత్రి వేళ కొన్ని గంటల్లోనే ముగిసిపోతుంది. ఐతే ఇంత నిడివిలో ఒక్కటంటే ఒక్క పాట  కూడా లేదు. హీరో పక్కన కథానాయిక కూడా కనిపించదు. రొమాన్సుకి ఛాన్సే లేదు. ఒక సన్నివేశంలో హీరో తనను తక్కువ అంచనా వేసిన పోలీస్ అధికారికి తన గురించి హింట్ ఇస్తూ.. ‘‘నేను పదేళ్లు జైల్లో ఉన్నానని మాత్రమే మీకు తెలుసు. అంతకుముందు ఏం చేశానో తెలియదు కదా’’ అంటాడు. దీన్ని బట్టి ఒక భారీ ఫ్లాష్ బ్యాక్ ఊహించుకుంటాం. మరో సన్నివేశంలోో హీరో గతమేంటో తెలుసుకోవాలనే ఉద్దేశంతో పక్కనున్న కుర్రాడు భార్య గురించి గుచ్చి గుచ్చి అడుగుతుంటే... హీరోో ఆ కథ చెప్పనారంభిస్తాడు. ఈ రెండు సందర్భాల్లో గతంలోకి వెళ్లి కొంత కథను నడిపించడానికి.. హీరోయిన్‌ తో హీరో రొమాంటిక్ ట్రాక్ పెట్టి రొమాన్స్,.. పాటలతో కాలక్షేపం చేయడానికి అవకాశముంది. కానీ దర్శకుడు లోకేష్ కనకరాజ్ మాత్రం అలా రాజీ పడలేదు. కేవలం రెండు నిమషాల సంభాషణలతో హీరో గతం తాలూకు గాఢతనంతా చెప్పిస్తూ తన ప్రతిభను చాటుకున్నాడు. ఎక్కడా బిగి సడలని రేసీ స్క్రీన్ ప్లే తో.. స్ట్రెయిట్ నరేషన్ తో రెండున్నర గంటలు ప్రేక్షకుల్ని కదలకుండా కూర్చోబెట్టి ‘ఖైదీ’ని ప్రత్యేకమైన సినిమాగా నిలబెట్టాడు.

ఎలాంటి కథలో అయినా సరే.. కమర్షియల్ హంగుల పేరుతో మసాలాలు అద్దేయడం మన దర్శకులకు అలవాటు. దాన్ని తప్పుబట్టలేం కూడా. అన్ని రకాల ప్రేక్షకులనూ అలరించడానికి.. మాస్‌ ను మెప్పించడానికి ఇలాంటి ప్రయత్నాలు సహజం. కానీ కథలో విషయం ఉండి.. కథనాన్ని ఆసక్తికరంగా తీర్చిదిద్దుకుంటే.. ఇలాంటి హంగులేమీ అవసరం లేకుండానే ప్రేక్షకుల్ని ఎంగేజ్ చేయొచ్చని చాటి చెబుతుంది ‘ఖైదీ’. ఇంత సిన్సియర్ గా ఓ కథను చెప్పే సినిమాలు అరుదుగా వస్తుంటాయి. తెరపై బొమ్మ పడ్డప్పటి నుంచి ముగింపు వరకు కథతోనే సాగుతుంది ‘ఖైదీ’. అలాగని ఇందులో హీరో ఎలివేషన్లేమీ తక్కువగా లేవు. కానీ అవన్నీ కథ భాగంగా ఉండటమే దీని ప్రత్యేకత. అక్కడక్కడా సినిమాటిక్ లిబర్టీస్ తీసుకుని కొంత లాజిక్ కు దూరంగా కథను నడిపించినప్పటికీ ఓవరాల్ గా ‘ఖైదీ’ ప్రేక్షకుల్ని కన్విన్స్ చేస్తుంది.

‘ఖైదీ’లో పాత్రల పరిచయం కోసం కూడా పెద్దగా సమయం తీసుకోకుండా నేరుగా కథను మొదలుపెట్టిన దర్శకుడు.. హీరో పాత్ర తెరపైకి వచ్చేటప్పటికీ కథను విప్పేశాడు. పావు గంటకే హీరో టాస్క్ ఏంటి అన్నది వెల్లడైపోతుంది. మత్తు మందు కలిపిన మద్యం తాగిన పోలీసుల్ని ఎవరికీ తెలియకుండా ఆసుపత్రికి తీసుకెళ్లడం.. ఆ తర్వాత భారీగా డ్రగ్స్ నిల్వ ఉన్న పోలీస్ కార్యాలయానికి చేరుకుని అక్కడున్న వాళ్లను కాపాడి సరకు బయటికి వెళ్లకుండా చూడటం అతడి బాధ్యతలు. ఈ ప్రయాణంలో అతడికి ఎదురైన అడ్డంకుల్ని ఎలా అధిగమిస్తూ తన బాధ్యతల్ని పూర్తి చేశాడన్నదే ‘ఖైదీ’ కథ. ఐతే హీరోకు ఇక్కడ అడ్డంకులంటే ఏం ఉంటాయి.. రౌడీలు అతడి మీద దాడి చేస్తారు. అలాంటి ఎపిసోడ్ ఒకటి పెట్టి ఓ పది నిమిషాల సమయం ఖర్చు చేయొచ్చు. ఇలాంటి ఎపిసోడ్లే మళ్లీ మళ్లీ చూపించి కూడా బోర్ కొట్టించకుండా చేయగలిగాడు దర్శకుడు. సినిమా అంతా బోలెడంత యాక్షన్ ఉండటంతో ఆ వర్గం ప్రేక్షకులు పూర్తి సంతృప్తి చెందుతారు. ఇక హీరో-కూతురు మధ్య నడిచే ఎమోషనల్ థ్రెడ్ హృదయాల్ని తాకుతుంది.

ప్రథమార్ధంలో కథనం కొంత నెమ్మదిగా సాగినా.. ద్వితీయార్ధంలో మాత్రం రయ్యిన పరుగులు పెడుతుంది. ప్రేక్షకులతో చప్పట్లు కొట్టించే కొన్ని మెరుపు సన్నివేశాలు ద్వితీయార్ధానికి హైలైట్‌ గా నిలిచాయి. ముఖ్యంగా క్లైమాక్స్ లో మెషీన్ గన్ సీన్ సినిమాకే హైలైట్. వావ్ అనిపించే ఆ సీన్ కు తోడు హీరో-కూతురు మధ్య భావోద్వేగ సన్నివేశంలో సినిమాకు అదిరిపోయే ముగింపునిచ్చాయి. ఐతే కథకు కట్టుబడి సిన్సియర్ గా.. ఎంగేజింగ్ గా సాగే ‘ఖైదీ’లో లాజిక్ కు అందని.. కొంచెం గందరగోళంగా అనిపించే సన్నివేశాలు లేకపోలేదు. దీనికి తోడు రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకు అలవాటు పడ్డ వాళ్లు దీన్ని ఎలా ఎంజాయ్ చేస్తారన్నది కూడా ప్రశ్నార్థకమే. కథకు కట్టుబడి.. స్క్రీన్ ప్లే ప్రధానంగా సాగే యాక్షన్ థ్రిల్లర్లను ఇష్టపడేవాళ్లు ‘ఖైదీ’ సినిమా కచ్చితంగా చూడొచ్చు.

నటీనటులు:

కార్తి ఎంత మంచి నటుడో ఇప్పటికే చాలా సినిమాల్లో చూశాం. ‘ఖైదీ’ అతడిని మరిన్ని మెట్లు ఎక్కించింది. తన కుటుంబానికి జరిగిన అన్యాయం గురించి ఉద్వేగంతో చెప్పే సన్నివేశంలో అతడి నటనను ఎంత పొగిడినా తక్కువే. ఒక అరగంట ఎపిసోడ్ నడిపితేే వచ్చే ఫీల్ ను తన హావభావలు.. డైలాగులతో అతను తీసుకురాగలిగాడు. ఇంకా కూతురిని తలుచుకునే ప్రతి సన్నివేశంలోనూ కార్తి నటన కట్టిపడేస్తుంది. వీరత్వం చూపించే ఘట్టాల్లోనూ అతను ఆకట్టుకున్నాడు. కార్తి కెరీర్లో ‘ఖైదీ’ పాత్ర ఓ మైలురాయి అనడంలో సందేహం లేదు. హీరోతో పాటు ట్రావెల్ అయ్యే పోలీస్ అధికారిగా నరేన్ కూడా బాగా చేశాడు. వీళ్లిద్దరి వెంట ఉండే కుర్రాడు చక్కగా నటించాడు. హరీష్ ఉత్తమన్‌ కు చిన్న పాత్రే దక్కింది. మిగతా నటీనటులుందరూ బాగానే చేశారు.

సాంకేతిక వర్గం:

‘ఖైదీ’కి సాంకేతిక నిపుణులు బలాన్నిచ్చారు. సామ్ సి.ఎస్ నేపథ్య సంగీతం సన్నివేశాల్ని ఎలివేట్ చేయడంలో.. ప్రేక్షకుల్లో భావోద్వేగాల్ని రేకెత్తించడంలో కీలక పాత్ర పోషించింది. సత్యన్ సూర్యన్ ఛాయాగ్రహణం గురించి చెప్పడానికి చాలా ఉంది. పూర్తిగా రాత్రి పూట సాగే సినిమాలో ప్రతి సన్నివేశంలోనూ ఛాయాగ్రాహకుడి కష్టం.. ప్రతిభ కనిపిస్తాయి. ఇలాంటి కథతో సినిమా చేయడానికి ముందుకొచ్చి రాజీ లేకుండా నిర్మించిన నిర్మాత ఎస్.ఆర్.ప్రభును అభినందించాలి. ‘మా నగరం’ (తెలుగులో నగరం)తో సత్తా చాటిన లోకేష్ కనకరాజ్.. ఈసారి అనేక పరిమితులున్న - సాహసోపేత కథను నెత్తికెత్తుకుని తనకు తానే సవాల్ విసురుకున్నాడు. బిగి సడలని స్క్రీన్ ప్లేతో సినిమాను ఆసక్తికరంగా నడిపించి దర్శకుడిగా మంచి మార్కులు కొట్టేశాడు.

చివరగా: ఖైదీ.. థ్రిల్లింగ్ జర్నీ

రేటింగ్-3/5

Disclaimer : This Review is An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre


Full View

Tags:    

Similar News