మినీ రివ్యూ : స్పైడ‌ర్ + రాక్ష‌సుడు = విక్రాంత్ రోణ‌

Update: 2022-07-28 11:53 GMT
బాహుబ‌లి ఆ త‌రువాత వ‌చ్చిన క‌న్న‌డ సినిమా `కేజీఎఫ్‌` సిరీస్ సినిమాలు బాక్సాఫీస్ వ‌ద్ద రికార్డులు సృష్టించ‌డంతో చాలా మంది స్టార్ హీరోలు పాన్ ఇండియా సినిమాల‌పై క‌న్నేశారు. క‌థ ఏదైనా టార్గెట్ పాన్ ఇండియా అన్న‌ట్టుగా ద‌క్షిణాదిలో ప్ర‌తీ స్టార్ ఇదే ఫార్ములాతో ప్రేక్ష‌కుల‌ని ఆక‌ట్టుకోవాల‌ని ప్ర‌య‌త్నంలో ప్రేక్ష‌కుల ముందుకొస్తున్నారు. అలా వ‌చ్చిన సినిమానే `విక్రాంత్ రోణ‌`. రాజ‌మౌళి తెర‌కెక్కించిన `ఈగ‌`, రామ్ గోపాల్ వ‌ర్మ `ర‌క్త‌చ‌రిత్ర‌` చిత్రాల‌తో తెలుగులో మంచి గుర్తింపుని సొంతం చేసుకున్నారు క‌న్న‌డ హీరో కిచ్చా సుదీప్‌.

ఆయ‌న హీరోగా పాన్ ఇండియా లెవెల్లో రూపొందిన సినిమా ఇది. క‌న్న‌డ‌తో రూపొందిన ఈ మూవీని తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ‌, హిందీ భాష‌ల్లోనూ ఈ గురువారం జూలై 28న విడుద‌ల చేశారు. దాదాపు 95 కోట్ల భారీ బ‌డ్జెట్ తో రూపొందిన ఈ మూవీ ఆశించిన‌ స్థాయిలో ఆక‌ట్టుకోలేక‌పోయింది. పాన్ ఇండియా మూవీగా మొద‌టి నుంచి ప్ర‌చారం చేస్తూ వ‌చ్చిన మేక‌ర్స్ ఈ మూవీకి అనుకున్న స్థాయిలో బ‌జ్ ని క్రియేట్ చేయ‌డంలో విఫ‌ల‌మ‌య్యారు.

శ్రీ‌లంక‌న్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ పై చిత్రీక‌రించిన `రా రా ర‌క్క‌మ్మ‌` పాట త‌ప్ప ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి చ‌ర్చ వినిపించ‌లేదు. ఈ పాటే కాస్త సినిమాకు సంబధించి అన్ని భాష‌ల్లో హ‌డావిడి చేసింది కానీ మేక‌ర్స్ ఎలాంటి బ‌జ్ ని క్రియేట్ చేయ‌లేక‌పోయారు. ఇంత‌కీ పాన్ ఇండియా రేంజ్ సినిమా అంటూ మేక‌ర్స్ హ‌డావిడి చేసిన సినిమా క‌థేంటే అంటే .. కోమ‌ర‌ట్టు అనే గ్రామంలో కొత్త‌గా వ‌చ్చిన ఇన్స్‌స్పెక్ట‌ర్ హ‌త్య‌కు గుర‌వుతాడు. అత‌ని ప్లేస్ లో వ‌చ్చిన వ్య‌క్తే విక్రాంత్ రోణ (కిచ్చా సుదీప్‌).  

కోమ‌క‌ట్టు గ్రామంలో వున్న ఓ పాడుబ‌డిన భ‌వ‌నంలో బ్ర‌హ్మ‌రాక్ష‌సుడు వున్న‌డ‌న్న‌ది గ్రామ ప్ర‌జ‌ల న‌మ్మ‌కం. ఆ ఇంటి ఆవ‌ర‌ణ‌లో వున్న పాడుబ‌డిన బావిలో త‌ల‌లేని బాడీ ల‌భిస్తుంది. అదే కొత్త‌గా వ‌చ్చిన  ఇన్స్‌స్పెక్ట‌ర్ బాడీ. అత‌న్ని చంపిన నేర‌స్తుడిని ప‌ట్టుకోవ‌డం కోసం విక్రాంత్ రోణ అన్వేష‌ణ మొద‌లు పెడ‌తాడు. ఇదే క్ర‌మంలో అంత‌కు ముందే ప‌దుల సంఖ్య‌లో పిల్ల‌లు హ‌త్య‌కు గురైన‌ట్టుగా తెలుసుకుంటాడు. వాళ్ల మ‌ర‌ణాల‌కు, పోలీస్ ఆఫీస‌ర్ హ‌త్య‌కు వున్న లింకేంటీ?

విక్రాంత్ రోణ ఇదే గ్రామానికి ఎందుకొచ్చాడు?.. కొత్త‌గా వ‌చ్చిన సంజుకు ఈ హ‌త్య‌ల‌కు ఉన్న సంబంధం ఏంటీ? అస‌లు హ‌త్య‌వెన‌కున్న బ్ర‌హ్మ‌రాక్ష‌సుడు ఎవ‌రు? అన్న‌దే ఈ చిత్ర‌క‌థ‌, సీరియ‌ల్ మ‌ర్డ‌ర్స్ నేప‌థ్యంలో మ‌ర్డ‌ర్స్ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్స్ ఈ త‌ర‌హాలో చాలానే వ‌చ్చాయి. మ‌హేష్ బాబు న‌టించిన స్పైడ‌ర్‌, బెల్లంకొండ శ్రీ‌నివాస్ న‌టించిన `రాక్ష‌సుడు` వంటి చాలా సినిమాలు ఇదే కోవ‌లో సైకో కిల్ల‌ర్ క‌థ‌ల‌తో వ‌చ్చిన‌వే. కాక‌పోతే ఈ మ‌ర్డ‌ర్స్ మిస్ట‌రీకి అబ్బుర ప‌రిచే విజువ‌ల్స్ ని, గ్రాఫిక్స్ ని జోడించారంతే.  

అంత‌కు మించి సినిమాలో చెప్పుకోవ‌డానికి ఏమీ లేదు. పాన్ ఇండియా అంటూ ప్ర‌చారం చేశారు. ఆ స్థాయి సినిమానే కాద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. మ‌రి ఇలాంటి క‌థ‌ని ప‌ట్టుకుని `బాహుబలి`, ట్రిపుల్ ఆర్‌, కేజీఎఫ్ ల‌తో ఎలా పోల్చార‌నుకున్నారో అర్థం కాదు. ఫైన‌ల్ గా ఈ సైకో మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ తో పాన్ ఇండియా వైడ్ గా బ్లాక్ బ‌స్ట‌ర్ ని సొంతం చేసుకోవాల‌ని ఆశ‌ప‌డిన కిచ్చా సుదీప్ ప్ర‌య‌త్నం వృధా ప్ర‌యాస‌గా మారింది. ఒక్క ముక్క‌లో చెప్పాలంటే స్పైడ‌ర్ + రాక్ష‌సుడు = విక్రాంత్ రోణ‌.
Tags:    

Similar News