'ప్రాజెక్ట్ K' లో భాగం కానున్న కోలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్..?

Update: 2021-11-22 08:35 GMT
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ - 'మహానటి' దర్శకుడు నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో ఓ భారీ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ''ప్రాజెక్ట్ K'' అనే వర్కింగ్ టైటిల్ తో సెట్స్ మీదకు వెళ్ళిన ఈ చిత్రంలో ప్రభాస్ కి జోడీగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే కనిపించనుంది. అలానే సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు నిర్మాత అశ్వినీ దత్. ఈ సినిమాకు మిక్కీ జె. మేయర్ సంగీతం.. డానీ శాంచెజ్ లోపెజ్ సినిమాటోగ్రఫీ అందిస్తారని మేకర్స్ ఇది వరకే ప్రకటించారు. అయితే ఇప్పుడు కొత్తగా మరో మ్యూజిక్ డైరెక్టర్ పేరు వినిపిస్తోంది.

ప్రముఖ కోలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణన్ 'ప్రాజెక్ట్ కె' సినిమాలో భాగం అవుతున్నారని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం తమిళంలో క్రేజీ మ్యూజిక్ డైరెక్టర్ గా కొనసాగుతున్న సంతోష్.. సాంగ్స్ తో పాటుగా బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా ఓ రేంజ్ లో అందిస్తారనే పేరు తెచ్చుకున్నారు. ‘కబాలి’ ‘కాలా’ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులు ఆయన సంగీతాన్ని విన్నారు. ఇప్పుడు నాని నటిస్తోన్న ‘దసరా’ సినిమాతో డైరెక్ట్ టాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఇంతలోనే ప్రభాస్ నటించే పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ కు మ్యూజిక్ కంపోజ్ చేసే అవకాశం అందుకున్నారని టాక్ నడుస్తోంది. ఇటీవల 'ప్రాజెక్ట్ K' కు సంబంధించిన ట్వీట్ ని సంతోష్ రీట్వీట్ చేయడం ఈ వార్తలకు బలం చేకూరింది.

అయితే మిక్కీ జె మేయర్ ను తప్పించి సంతోష్ నారాయణన్ ను తీసుకున్నారా? లేదా కేవలం తమిళ వెర్షన్ కోసం కేవలం మాత్రమే ఆయన్ను తీసుకుంటున్నారా? అనే విషయం మీద క్లారిటీ రావాల్సివుంది. ఎందుకంటే ప్రస్తుతం ప్రభాస్ నటించే పాన్ ఇండియా సినిమాలకు ఇద్దరు ముగ్గురు సంగీత దర్శకులు వర్క్ చేస్తున్నారు. 'సాహో' సినిమాలో ఒక్కో పాటను ఒక్కో మ్యూజిక్ డైరెక్టర్ కంపోజ్ చేసిన సంగతి తెలిసిందే. అలానే 'రాధే శ్యామ్' దక్షిణాది భాషలకు జస్టిన్ ప్రభాకర్.. హిందీ వెర్షన్ కు మిథున్-మనస్ భరద్వాజ్ సంగీతం సమకూరుస్తున్నారు. ఇప్పుడు 'ప్రాజెక్ట్ K' విషయంలో కూడా ఇదే ఫాలో అవుతున్నారేమో అనే సందేహాలు కలుగుతున్నాయి.

'ప్రాజెక్ట్-K' చిత్రాన్ని పాన్ వరల్డ్ స్థాయిలో భారతీయ భాషలతో పాటుగా పలు విదేశీ భాషల్లో కూడా రూపొందించనున్నారు. స్టార్ కాస్టింగ్ - టాప్ టెక్నిషియన్స్ ఇందులో భాగం కానున్నారు. అందులోను సైన్స్ ఫిక్షన్ & సోషియో ఫాంటసీ జోనర్ లో తెరకెక్కనున్న సూపర్ హీరో మూవీ అంటున్నారు. అందుకే ఈ సినిమాకి వివిధ బాషల్లో వేర్వేరు సంగీత దర్శకులను తీసుకునే అవకాశం ఉందని ఫ్యాన్స్ అభిప్రాయ పడుతున్నారు. 'మహానటి' సినిమాకు మంచి సంగీతం అందించిన మిక్కీ జె మేయర్ తో పాటుగా సంతోష్ నారాయణన్ కూడా తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు. మరి దీనిపై చిత్రబృందం త్వరలోనే స్పష్టత ఇస్తుందేమో చూడాలి.

కాగా, 'ప్రాజెక్ట్ కె' చిత్రాన్ని భారతీయ సిల్వర్ స్క్రీన్ మీదనే అత్యధిక బడ్జెట్ తో సరికొత్త సాంకేతిక పరిజ్ఞానంతో విజువల్ వండర్ గా రూపొందించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. దీని కోసం ప్రభాస్ 200 రోజుల కాల్షీట్స్ కేటాయించారని టాక్. ఇప్పటికే అమితాబ్ బచ్చన్ తో పది రోజుల షెడ్యూల్ షూటింగ్ పూర్తి చేసారు. వెండితెర మీద కొత్త ప్రపంచాన్ని సృష్టించనున్న నాగ్ అశ్విన్.. ప్రస్తుతం విఎఫ్ఎక్స్ వర్క్స్ చూసుకుంటున్నారు. ఏడాది కాలంపాటు నిర్విరామంగా చిత్రీకరణ జరిపేలా ప్లాన్ చేస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ సంబంధించిన వివరాలు వెల్లడికానున్నాయి.
Tags:    

Similar News