డాకు మహారాజ్ 'చిన్ని'.. హార్ట్ టచింగ్!
సంక్రాంతి సీజన్ అంటేనే తెలుగు చిత్ర పరిశ్రమకు పెద్ద పండగ. ఇక అందులో క్లాస్ మాస్ ఆడియెన్స్ ను ఆకట్టుకునే హీరోలలో కొందరు మాత్రమే ఉంటారు
సంక్రాంతి సీజన్ అంటేనే తెలుగు చిత్ర పరిశ్రమకు పెద్ద పండగ. ఇక అందులో క్లాస్ మాస్ ఆడియెన్స్ ను ఆకట్టుకునే హీరోలలో కొందరు మాత్రమే ఉంటారు. ఇక అలాంటి వారిలో బాలయ్య ఒకరు. గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ హీరోగా ‘డాకు మహారాజ్’ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాకు బాబీ కొల్లి దర్శకత్వంలో వస్తుండగా, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై నాగవంశీ, సాయి సౌజన్య అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.
ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. టీజర్, గ్లింప్స్‌తోనే సినిమాపై హైప్ క్రియేట్ చేయగా, తమన్ మ్యూజిక్‌తో మరోసారి ప్రేక్షకులను అలరించబోతున్నారు. ఇటీవల విడుదలైన తొలి గీతం ‘ది రేజ్ ఆఫ్ డాకు’కి విశేషమైన స్పందన వచ్చింది. ఇక ఇప్పుడు రెండవ పాట ‘చిన్ని’ విడుదలై మరో సూపర్ హిట్‌గా నిలిచింది.
తమన్ అందించిన సంగీతం, అనంత శ్రీరామ్ రాసిన సాహిత్యం ‘చిన్ని’ పాటకు అసలు జీవం పోశాయి. "నువ్వు తే అంటే నీ ముందు తారా తీరాలే" వంటి భావోద్వేగపూరితమైన లైన్స్ ప్రేక్షకుల మనసులను హత్తుకునేలా ఉన్నాయి. విశాల్ మిశ్రా తన మధుర గాత్రంతో పాటకు మరింత అందాన్ని జోడించాడు. లిరికల్ వీడియోలో చూపించిన విజువల్స్ ఊటీ నేపథ్యానికి కొత్త ఒరవడిని తెచ్చాయి. బాలయ్య, చిన్నారి మధ్య కనిపించే బంధం ప్రేక్షకుల గుండెల్ని తాకేలా ఉంది.
‘డాకు మహారాజ్’లో బాలకృష్ణ పాత్ర పెద్దలకు, పిల్లలకు, ప్రతి వర్గానికి ఆసక్తిని రేకెత్తించేలా ఉంది. ఈ పాట ద్వారా ఆయన రక్షకుడి పాత్రలో కనిపిస్తున్నారు. కుటుంబం, ప్రేమ, బాధ్యత వంటి అంశాలను తనదైన శైలిలో అద్భుతంగా ప్రదర్శించబోతున్నారు. ‘చిన్ని’ పాట బాలయ్య పాత్రకు మరో కొత్త కోణాన్ని జోడించిందని చెప్పుకోవచ్చు. బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ ఈ చిత్రంలో ప్రధాన ప్రతినాయకుడిగా కనిపించబోతుండగా, ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, చాందిని చౌదరి, ఊర్వశి రౌతేలా వంటి తారాగణం ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణలుగా నిలుస్తున్నాయి.
లిరికల్ వీడియోలో ఊర్వశి, చాందిని చౌదరి తళుక్కున మెరిసి అందరినీ ఆకట్టుకున్నారు. డైరెక్టర్ బాబీ కొల్లి మేకింగ్ తో పాటు, ఛాయాగ్రాహకుడు విజయ్ కార్తీక్ కన్నన్, కళాదర్శకుడు అవినాష్ కొల్లా వర్క్ చేసిన విధానం మరింత హైలెట్ అని మేకర్స్ చెబుతున్నారు. ఎడిటింగ్ బాధ్యతలను నిరంజన్ దేవరమానే నిర్వహిస్తున్నారు.
ఈ చిత్రానికి సంబంధించిన ప్రతి ఫ్రేమ్‌లోనూ హైక్వాలిటీ టెక్నికల్ వర్క్ కనిపించనుందని తెలుస్తోంది. ‘డాకు మహారాజ్’ 2025 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. జనవరి 12న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కానుంది. సంక్రాంతి బరిలో ఈ చిత్రం రికార్డుల మోత మోగించనుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. పాటలు, టీజర్‌తో ఇప్పటికే మంచి క్రేజ్ తెచ్చుకున్న ఈ చిత్రం, విడుదలకు ముందు మరిన్ని సంచలనాలు సృష్టించడం ఖాయం.