మహిళలకు అండగా నిలిచే 'నారి'.. రిలీజ్ ఎప్పుడంటే?
‘మహిళల్ని గౌరవించాలి, ఆడపిల్లలు అన్ని రంగాలలో ఎదిగేందుకు సహకరించాలి’ అనే కాన్సెప్ట్‌తో రూపొందిన చిత్రం "నారి"
‘మహిళల్ని గౌరవించాలి, ఆడపిల్లలు అన్ని రంగాలలో ఎదిగేందుకు సహకరించాలి’ అనే కాన్సెప్ట్‌తో రూపొందిన చిత్రం "నారి". 'ది ఉమెన్' అనేది దీనికి ట్యాగ్ లైన్. సూర్య వంటిపల్లి దర్శకత్వం వహించిన ఈ సినిమాని శశి వంటిపల్లి నిర్మించారు. ఇందులో సీనియర్ నటి ఆమని ప్రధాన పాత్ర పోషించగా.. వికాస్ వశిష్ఠ, మౌనిక రెడ్డి, ప్రగతి, సునయన, కేదార్ శంకర్, ప్రమోదినీ, నిత్యశ్రీ తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించారు. తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్ ను మేకర్స్ ఖరారు చేశారు.
"నారి" సినిమాని 2025 రిపబ్లిక్ డే స్పెషల్ గా జనవరి 24వ తేదీన గ్రాండ్ గా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ముందుగా ఈ సినిమాని డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావించారు. కానీ ఇప్పుడు కొత్త ఏడాది ప్రారంభంలో రిలీజ్ చేయాలని మేకర్స్ నిర్ణయించుకున్నారు. ఇప్పటి వరకూ ఈ మూవీ నుంచి రిలీజైన ప్రమోషనల్ కంటెంట్ ఆడియన్స్ దృష్టిని ఆకర్షించింది. ఫస్ట్ గ్లింప్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది
ఇటీవలే తెలంగాణ స్త్రీ, శిశు సంక్షేమ శాఖా మంత్రి సీతక్క "నారి" సినిమా టైటిల్ పోస్టర్ అండ్ ఫస్ట్ గ్లింప్స్ ను రిలీజ్ చేశారు. మహిళలను గౌరవించాలనే కాన్సెప్ట్ తో తీసిన ఈ చిత్రం మంచి విజయం సాధించాలని కోరుకుంటూ తన బెస్ట్ విషెస్ అందజేశారు. రీసెంట్ గా ఓ స్కూల్ గర్ల్ తన టీచర్‌తో సమాజంలో అమ్మాయిల కష్టాల గురించి చెబుతూ.. తాను మగవాడిగా మారాలని అనుకుంటున్నానని, ఒక అమ్మాయి లైఫ్ లో కన్నీళ్ళే ఎక్కువగా ఉంటాయని, అమ్మాయిగా పుట్టడం కంటే పెరగడమే కష్టం అంటూ చెప్పిన ఓ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిన విషయం తెలిసిందే. ఆ సన్నివేశం ఈ సినిమాలోనిదే.
"నారి" చిత్రాన్ని అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా మంచి ఫ్యామిలీ డ్రామా కథతో రూపొందించినట్లుగా దర్శకుడు సూర్య వంటిపల్లి చెబుతున్నారు. మహిళల పట్ల మనం ఎలా వ్యవహరించాలి.. వారికి ఎలా సపోర్ట్ చేయాలనే అంశాలు ప్రతి ఒక్క ప్రేక్షకుడినీ ఆకట్టుకుంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు. వచ్చే ఏడాది జనవరి 24న థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమా, తప్పకుండా ఘన విజయాన్ని సాధిస్తుందనే నమ్మకంతో ఉన్నామని చెప్పుకొచ్చారు.
హైదరాబాద్ స్టూడియోస్, షి ఫిలిమ్స్ బ్యానర్స్ లో 'నారి' చిత్రాన్ని రూపొందించారు. దీనికి వినోద్ కుమార్ సంగీతం సమకూర్చారు. ప్రముఖ సంగీత దర్శకులు రమణ గోగుల, ఆర్పీ పట్నాయక్ ఈ సినిమాకు తమ వాయిస్ అందించారు. మహిళా సాధికారత మీద రూపకల్పన చేసిన పాటను పాపులర్ సింగర్ చిన్మయి శ్రీపాద ఆలపించారు. సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉన్న సీషోర్ కూడా ఒక పాట పాడినట్లు తెలుస్తోంది. రవికుమార్, భీమ్ సాంబ సినిమాటోగ్రఫీ నిర్వహించిన ఈ చిత్రానికి మాధవ్ కుమార్ ఎడిటింగ్ చేశారు.
నేటి సమాజంలో స్త్రీలు ఎదుర్కొనే సమస్యలు, మహిళా సాధికారత, అభ్యున్నతి మీద గతంలో వచ్చిన అనేక ఫీమేల్ ఓరియంటెడ్ సినిమాలు మంచి విజయం సాధించాయి. సమాజ నిర్మాతలైన మహిళలకు రెస్పెక్ట్ ఇవ్వాలని, వారికి ప్రతి ఒక్కరూ సపోర్ట్ గా నిలవాలని, స్త్రీల గొప్పదనాన్ని చాటిచెప్పే సందేశాత్మక కథాంశంతో ఇప్పుడు "నారి" సినిమాని తెరకెక్కించినట్లు తెలుస్తోంది. మరి ఈ చిత్రం ఎలాంటి విజయం సాధిస్తుందో చూడాలి.