హీరోలంతా హీరోయిన్లు అయితే ఇలా!
సీనియర్ హీరోల నుంచి తర్వాత తరం హీరోల వరకూ అంతా ఎలాంటి పాత్రకైనా సిద్దం అంటూ పనిచేస్తున్నారు.
సన్నివేశం డిమాండ్ చేసిందంటే? పాత్ర విషయంలో స్టార్ హీరోలు ఎక్కడా వెనక్కి తగ్గరు. హీరోలంతా దర్శకులు హీరోలే. లేడీ గెటప్ విషయంలో సైతం హీరోలెక్కడా ఆలోంచించరు. దర్శకుడు ఏ వేషం వెయ్యమంటే? ఆ వేషం వేసి ప్రేక్షుకులను మెప్పించడం అన్నది ఎప్పటి నుంచో ఉంది. సీనియర్ హీరోల నుంచి తర్వాత తరం హీరోల వరకూ అంతా ఎలాంటి పాత్రకైనా సిద్దం అంటూ పనిచేస్తున్నారు. చిరంజీవి 'చంటబ్బాయ్' సినిమాలో ఓ పాటలో లేడీ గెటప్ వేసారు. ఆ తర్వాత 'పట్నం వచ్చిన పతివ్రతలు' చిత్రంలో చిరంజీవితో పాటుగా మోహన్ బాబు కూడా మహిళల మేకప్ లో అలరించారు.
అలాగే నందమూరి బాలకృష్ణ 'పాండు రంగడు' చిత్రలో లేడీ గెటప్ వేసారు. 'టాప్ హీరో' చిత్రంలోనూ ఓ సీన్ కోసం చీర కడతారు. విక్టరీ వెంకటేష్ 'వాసు', 'బాడీగార్డ్' చిత్రాల్లో మీసాలు తీసేయకుండానే లేడీ గెటప్ తో అలరించారు. 'మేడమ్', 'వివాహ భోజనంబు' , 'ఆల్ రౌండర్', 'చిత్రమ్ భళారే విచిత్రమ్', 'జంబలకడి పంబ' చిత్రాల్లో వీకే నరేష్ కూడా లేడీ గెటప్ లో మెప్పించారు. అల్లు అర్జున్ 'గంగోత్రి'లో లేడీ వేషం వేసాడు. అలాగే 'కితకితలు' లో అల్లరి నరేష్ కూడా లేడీ వేషం వేస్తాడు. 'పాండవులు పాండవులు తుమ్మెద' చిత్రంలో మంచు మనోజ్ మోహినిగా మెప్పిస్తాడు.
విశ్వ నటుడు కమల్ హాసన్ సైతం ఎన్నో చిత్రాల్లో లేడీ గెటప్ వేసారు. అన్నింటికంటే 'భామనే సత్యభామనే' చిత్రంలో కమల్ లేడీ గెటప్ అప్పట్లో ఓ సంచలనం. 'మల్లన్న' చిత్రం కోసం విక్రమ్ కూడా అలాంటి గెటప్ లోనే మెప్పించారు. యంగ్ హీరో శ్రీవిష్ణు కూడా 'స్వాగ్' చిత్రంలో లేడీ గెటప్ లో అలరించాడు. తాజాగా యంగ్ హీరో విశ్వక్ సేన్ కూడా 'లైలా' కోసం లేడీగా మారిన సంగతి తెలిసిందే. ఇప్పటికే పోస్టర్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి. లేడీ గెటప్ లో అచ్చంగా అమ్మాయినే తలపిస్తున్నాడు. అలాగే అల్లు అర్జున్ కూడా ఇటీవల రిలీజ్ అయిన 'పుష్ప-2' లో 'జాతర' సాంగ్ లేడీ గెటప్ తో అలరించిన సంగతి తెలిసిందే. అచ్చంగా గంగమ్మ తల్లినే తలపించాడు. ఈ పాటకు జాతీయ అవార్డు వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అంత గొప్పగా పాట సన్నివేశాల్లో పెర్పార్మెన్స్ చేసాడు.