భీమ్ భావోద్వేగాలను ఎలివేట్ చేసే గీతం.. 'కొమురం భీముడో'..!

Update: 2021-12-24 14:18 GMT
మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ 'ఆర్.ఆర్.ఆర్' నుంచి మరో పాట వచ్చేసింది. ఇప్పటికే విడుదలైన 'దోస్తీ' 'నాటు నాటు' 'జనని' పాటలు విశేష స్పందన తెచ్చుకోగా.. తాజాగా 'కొమురం భీముడో' అనే నాల్గవ పాటను చిత్ర బృందం చేసింది. 'రివోల్ట్‌ ఆఫ్‌ భీమ్‌' పేరుతో వచ్చిన సాంగ్ ఉద్వేగభరితంగా సాగింది.

దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన RRR చిత్రంలో కొమురం భీమ్ గా ఎన్టీఆర్.. అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ కనిపించనున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు లేటెస్టుగా వచ్చిన 'కొమురం భీముడో' గీతం సినిమాలో భీమ్ స్వభావాన్ని, ఆశలు ఆశయాలను, భావోద్వేగాలను ఎలివేట్ చేస్తోంది.

'భీమా.. నినుగన్న నేలతల్లి.. ఊపిరి పోసిన సెట్టూ సేమ.. పేరు పెట్టిన గోండు జాతి నీతో మాట్లాడుతుండ్రురా.. వినబడుతుందా?' అని ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ తో ఈ పాట ప్రారంభమైంది. 'కొమురం భీముడో.. కొమురం భీముడో.. కొర్రాసులెవడోలే మండాలి కొడుకో.. మండాలి కొడుకో' అంటూ సాగిన ఈ గీతం భావోద్వేగానికి గురి చేస్తోంది. ఇందులో తారక్ ఇంటెన్స్ గా కనిపించారు.

ఈ ఉద్వేగభరిత గీతానికి ఎంఎం కీరవాణి అద్భుతమైన బాణీలు సమకూర్చారు. ప్రముఖ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ సాహిత్యం అందించారు. కీరవాణి తనయుడు కాలభైరవ ఈ పాటను అన్ని భాషల్లోనూ ఆలపించడం విశేషం. తాజాగా విడుదలైన 'కొమురం భీముడో' మ్యూజికల్ వీడియోను తారక్ - కాలభైరవల మీద చిత్రీకరించారు.

తెలుగుతో పాటుగా తమిళ మలయాళ కన్నడ హిందీ భాషల్లో ఈ సాంగ్ విడుదలైంది. ప్రేమ్ రక్షిత్ మాస్టర్ ఈ పాటకు విజువలైజేషన్ మరియు కాన్సెప్ట్ ను డిజైన్ చేశారు. రిషి పంజాబీ డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీగా వ్యవహరించగా.. సాబు సిరిల్ ప్రొడక్షన్ డిజైనింగ్ చేశారు. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ వర్క్ చేశారు. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య భారీ బడ్జెట్ తో RRR చిత్రాన్ని నిర్మించారు.

కాగా, విప్లవవీరులు అల్లూరి సీతారామరాజు - కొమురం భీమ్ నిజ జీవితం ఆధారంగా కల్పిత కథతో 'ఆర్.ఆర్.ఆర్' చిత్రాన్ని రూపొందించారు. ఇందులో రామ్ చరణ్ కు జోడీగా ఆలియాభట్‌.. ఎన్టీఆర్ సరసన ఒలివియా మోరిస్‌ కథానాయికలుగా నటించారు. అజయ్‌ దేవ్‌గణ్‌ - శ్రియ - సముద్రఖని తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ బిగ్గెస్ట్ యాక్షన్ డ్రామాని 2022 జనవరి 7న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు.



Full View
Tags:    

Similar News