త్రివిక్రమ్ బాటలోనే కొరటాల!

Update: 2021-05-21 11:30 GMT
త్రివిక్రమ్ తన సినిమాలకి సంబంధించిన కథా కథనాల విషయంలో చాలా శ్రద్ధ తీసుకుంటారు.  ఒక కథకు ఏ స్థాయిలో హంగులు అవసరమో ఆ స్థాయిలో పూర్తిగా హంగులు అద్దిన తరువాతనే ఆయన సెట్స్ పైకి వెళతారు. సెట్స్ పైకి వెళ్లేంత వరకూ మాత్రమే ఆయన సమయం తీసుకుంటారు. ఆ తరువాత చకచకా షూటింగ్ కానిచ్చేస్తూ ఉంటారు. ఇక తన ప్రతి సినిమాలోను ఒక కీలకమైన పాత్ర కోసం ఒక సీనియర్ హీరోయిన్ ను తీసుకుంటూ ఉంటారు. ఆయన సినిమాలను పరిశీలిస్తే ఈ విషయం మనకి స్పష్టంగా అర్థమవుతుంది.

ఇక కొరటాల శివ కూడా అదే బాటలో నడుస్తుండటం విశేషం. కథలను ఎంచుకునే విషయంలోను .. పాత్రలను మలిచే విధానంలోను త్రివిక్రమ్ స్టైల్ వేరు .. కొరటాల స్టైల్ వేరు. త్రివిక్రమ్ వినోదానికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తే, కొరటాల ఆ వినోదానికి కాస్త సందేశాన్ని కూడా జోడిస్తూ ఉంటారు. అయితే తమ సినిమాల్లో కీలకమైన పాత్రల కోసం సీనియర్ హీరోయిన్లను ఎంపిక చేసుకునే విషయంలో మాత్రం ఇద్దరి మధ్య పోలిక కనిపిస్తుంది.

 'మిర్చి' సినిమాలో ఒక కీలకమైన పాత్ర కోసం 'నదియా'ను తీసుకొచ్చిన కొరటాల, 'శ్రీమంతుడు' సినిమా కోసం 'సుకన్య'ను రంగంలోకి దింపారు. ఆ తరువాత 'జనతా గ్యారేజ్' కోసం ఆయన 'దేవయాని'ని తీసుకొచ్చారు. 'భరత్ అనే నేను' సినిమాలో 'ఆమని'తో ఒక ముఖ్యమైన పాత్రను చేయించిన ఆయన, తాజాగా రూపొందుతున్న 'ఆచార్య' సినిమాలో 'ఖడ్గం' సంగీతను ఒక కీలకమైన పాత్రలో చూపించనున్నారు. ఇక ఎన్టీఆర్ తో ఆయన రూపొందించనున్న సినిమాలోనూ, మరో సీనియర్ హీరోయిన్ కి చోటు ఖాయమని వేరే చెప్పాలా? 
Tags:    

Similar News