గర్ల్ ఫ్రెండ్ నుంచి శ్రీమంతుడు వరకు

Update: 2015-07-28 23:24 GMT
వేలమైళ్ల ప్రయాణమైనా ఒక్క అడుగుతోనే మొదలవుతుందంటారు నెహ్రూ గారు. ఇవ్వాళ టాలీవుడ్లో స్టార్ దర్శకులుగా వెలుగొందుతున్న చాలామంది దర్శకుల్లో చాలామంది ఒక్కో అడుగు వేసుకుంటూ అనేక కష్టాలు పడి ఈ స్థాయికి చేరుకున్నవారే. రాజమౌళి, త్రివిక్రమ్ శ్రీనివాస్, పూరి జగన్నాథ్, వి.వి.వినాయక్, శ్రీను వైట్ల.. వీళ్లందరూ ఇండస్ట్రీలో అనేక కష్టాలు పడి ఎదిగినవారే. వాళ్ల నేపథ్యం, సినీ రంగంలో తొలి అడుగులు గుర్తు చేసుకుంటే.. ఇప్పుడు వాళ్లున్న స్థాయి చూసి షాకవ్వాల్సిందే. రెండో సినిమాతోనే మహేష్ బాబు లాంటి సూపర్ స్టార్ తో పని చేసే మహద్భాగ్యం దక్కించుకున్న కొరటాల శివ నేపథ్యం కూడా చాలా ఆసక్తికరం.

పోసాని కృష్ణ మురళి గారి దగ్గర అసిస్టెంట్ రైటర్ గా చేరి దర్శకుడిగా ఎదిగిన చాలామందిలో కొరటాల శివ కూడా ఒకడు. అతడు తొలుత కథ అందించిన సినిమా గురించి చాలామందికి తెలియదు. దాదాపు పుష్కరం కిందట జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ‘గర్ల్ ఫ్రెండ్’ సినిమాకు కథ అందించాడు కొరటాల. తెరపై తొలిసారి అతడి పేరు పడింది అప్పుడే. అందులో కథ క్రెడిట్స్ లో 'రవి-శివ' అని పడింది. ఐతే ఆ సినిమాతో కొరటాలకు పెద్దగా పేరేమీ రాలేదు. 2005 లో వచ్చిన భద్ర సినిమాకు రచయితగా పని చేసి మంచి పేరు సంపాదించాడు. ఆ తర్వాత వరుసగా మున్నా, బృందావనం, ఊసరవెల్లి సినిమాలకు రచయితగా పని చేసి ఫేమస్ అయ్యాడు. దర్శకుడిగా తొలి సినిమా ‘మిర్చి’ సూపర్ హిట్ కావడంతో కొరటాల వెనుదిరిగి చూసుకోవాల్సిన పని లేకపోయింది. మహేష్ లాంటి హీరోతో ‘శ్రీమంతుడు’ తీశాడు. ఈ సినిమా హిట్టయితే కొరటాల పైన చెప్పుకున్న పెద్ద డైరెక్టర్ల జాబితాలోకి చేరిపోవడం ఖాయం.
Tags:    

Similar News