కొరటాల ఆ తప్పు చేయట్లేదు

Update: 2015-08-04 17:40 GMT
టీజర్, ట్రైలర్ విషయంలో ఒక్కొక్కరిది ఒక్కో స్టయిల్. కొందరు ఊరికే ఒక ఫైట్ బిట్టో, సాంగ్ బిట్టో కట్ చేసి టీజర్ వదులుతారు. ఆ తర్వాత ట్రైలర్లోనూ కథ చెప్పడానికి ఇష్టపడరు. ఐతే ఇంకొందరు దర్శకులు మాత్రం టీజర్ తోనే కథేంటో ఓ ఐడియా వచ్చేసేలా చూసుకుంటారు. ట్రైలర్లో ఇంకా విడమరిచి చెప్పడానికి ప్రయత్నిస్తారు. ఐతే ఈ మధ్య టాలీవుడ్ దర్శకులు ఎక్కువగా తొలి దారిలోనే వెళ్తున్నారు. ప్రేక్షకుల్ని థియేటర్లలో సర్ ప్రైజ్ చేయడం దీని ఉద్దేశం కావచ్చు. ఐతే ప్రేక్షకులు ఓ అంచనాతో సినిమాకు వచ్చి.. అక్కడ ఇంకోటి చూపిస్తే అలాంటి సినిమాలు దారుణమైన ఫలితాలు చూసిన సందర్భాలు కూడా లేకపోలేదు. ఇందుకు సరైన ఉదాహరణ ‘1 నేనొక్కడినే’ అని చెప్పొచ్చు. ఇదో సైకలాజికల్ థ్రిల్లర్ అన్న అంచనా ఎవరికీ లేదు. ఒక స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ అన్న అభిప్రాయంతో సినిమాకు వచ్చారు. కానీ సినిమా ఆ అంచనాకు భిన్నంగా ఉండటం పెద్ద దెబ్బ కొట్టింది. డివైడ్ టాక్ తో సినిమా మొదలై.. చివరికి డిజాస్టర్ అయిపోయింది.

అందుకే ఏదైనా ప్రయోగం చేసేటపుడు.. ప్రేక్షకులకు ముందే ఓ హింట్ ఇవ్వడం బెటర్. మహేష్ కొత్త సినిమా ‘శ్రీమంతుడు’ కమర్షియల్ సినిమానే కానీ.. అందులో కొంచెం మెసేజ్ కూడా మిళితమైందన్న విషయం ట్రైలర్ తోనే అర్థమైపోయింది. మరీ ఎక్కువ హీరోయిజం ఆశించొద్దని.. ఒక ఉదాత్తమైన కథాంశాన్ని కమర్షియల్ యాంగిల్లో చూడటానికి రెడీగా ఉండాలని టీజర్ తోనే చెప్పేశాడు కొరటాల. ఇక ట్రైలర్ చూశాక ఆ విషయం ఇంకా బాగా అర్థమైంది. మొత్తానికి తాము ఎలాంటి సినిమా చూడబోతున్నామన్న దాంట్లో ప్రేక్షకులు ఫుల్ క్లారిటీతో ఉన్నారు ప్రేక్షకులు. మహేష్ చెప్పాడో లేదంటే తనే అలా ఫీలయ్యాడో కానీ.. కొరటాల ఎంచుకున్న మార్గం సరైందే. సినిమా బాగుంటుందా లేదా అన్నది తర్వాత విషయం.. ప్రేక్షకులు ఓ క్లారిటీతో సినిమాకు రావడం అన్నది రిస్క్ ను కొంచెం తగ్గిస్తుందన్నది మాత్రం వాస్తవం.
Tags:    

Similar News