'కొండ పొలం' ఇంత గొప్పగా రావడానికి కారణం ఆ ఒక్కరే: క్రిష్

Update: 2021-10-06 03:36 GMT
వైష్ణవ్ తేజ్ కథానాయకుడిగా దర్శకుడు క్రిష్ 'కొండ పొలం' సినిమాను రూపొందించాడు. సాయిబాబు - రాజీవ్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాకి కీరవాణి సంగీతాన్ని అందించారు. రకుల్ కథానాయికగా నటించిన ఈ సినిమాలో, కోట - సాయిచంద్ ముఖ్యమైన పాత్రలను పోషించారు. అడవి ప్రాంతంలో గిరిజనుల పోరాటం నేపథ్యంలో అల్లిన కథ ఇది. ఈ నెల 8వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో నిన్న రాత్రి ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరిగింది. హరీశ్ శంకర్ .. బుచ్చిబాబు ఈ వేడుకకు హాజరయ్యారు. ఈ వేదికపై దర్శకుడు క్రిష్ మాట్లాడాడు.

'కొండ పొలం' చదివినప్పుడు నాకు మొదటిగా అనిపించింది ఇది కొత్త కథా వస్తువు అని. ఒక సాహసయాత్రగా అనిపించి చదువుతున్నంత సేపు నాలో ఉత్కంఠ రేగింది. హీరో ఇప్పుడేం చేస్తాడు? ఏం చేస్తాడు? అనే ఆసక్తి పెరిగిపోతూ వచ్చింది. గొర్రెలు కాసుకోవడానికి అడవికి వెళ్లిన ఒక కుర్రాడు, అదే అడవిని సంరక్షించే అధికారిగా తిరిగి వస్తాడన్న మాట. ఈ కథలోని రవీంద్ర అనే పాత్రకి అంత గొప్ప బేస్ ఉంటుంది. అలాంటి కుర్రాడికి తోడుగా ఈ కథలో స్త్రీ పాత్ర లేదు. అందువలన 'ఓబులమ్మ' అనే ఒక ఇక అమ్మాయి పాత్రని క్రియేట్ చేసి, అందమైన ప్రేమకథను అల్లితే బాగుటుందని అనిపించింది.

ఈ సినిమాలోని ప్రతి సన్నివేశం .. ప్రతి సంభాషణ సన్నపురెడ్డి వెంకటరామి రెడ్డి రాసిందే. నేను చేసింది స్క్రీన్ ప్లేనే.

వైష్ణవ్ తేజ్ విషయంలో ముందుగా బుచ్చిబాబును అభినందించాలి. ఎందుకంటే ఇండస్ట్రీకి ఒక గొప్ప హీరోను ఇచ్చాడు. బొడ్డు కోయడం చాలా కష్టమైనా పని .. ఆ మంత్రసాని పని తను చేసి ఆ బిడ్డను బయటికి ఇచ్చాడు. వైష్ణవ్ తేజ్ ను నేను 'ఉప్పెన' సినిమాకి ముందే కలవడం జరిగింది. ఆయనను చూడగానే ఎందుకో తెలియదు .. ఆప్యాయత తన్నుకొచ్చింది. చాలామంది అందరితో మంచిగా ఉండటానికి ట్రై చేస్తుంటారు. కానీ అది వైష్ణవ్ లో సహజంగానే ఉంది. మరో 100 సినిమాలు చేసినా ఆయన అలాగే ఉంటాడని నేను అనుకుంటున్నాను.

బుచ్చిబాబు 'ఉప్పెన'తో వైష్ణవ్ తేజ్ ను ఒక మెట్టు ఎక్కించాడు. నేను ఈ సినిమాతో అంతకంటే పై మెట్టుకు ఎక్కిస్తున్నాను. అందుకు తగిన కథ .. క్యారెక్టరైజేషన్ ఈ సినిమాలో ఉన్నాయి. రకుల్ విషయానికి వస్తే .. ఆమె ఎప్పుడూ వర్కౌట్లు చేస్తూ, చాలా మోడ్రన్ గా ఉంటుంది. ప్రతి రోజు సెట్లో నేను ఆమెను చూశాను. ఆమె ప్లానింగ్ .. డిసిప్లిన్ ఎలా ఉంటాయనేది గమనించాను. రాయలసీమ యాసలో మాట్లాడటానికి ఆమె ఎంతలా హోమ్ వర్క్ చేసిందనేది ఈ సినిమా చూస్తే అర్థమవుతుంది. ఆమెకి 'ఓబులమ్మ' పాత్రను చెప్పకముందు, నేను అనుకున్న ఓబులమ్మ ఈమెనేనా? అని అనుకున్నాను. ఆ తరువాత ఆ పాత్రకి ఆమెనే కరెక్ట్ అనే విషయం అర్థమైంది.

నేను ఆమెను 'ఓబూ .. ఓబూ' అని పిస్తున్నానంటే ఆ పాత్ర ద్వారా ఆమె ఎంతలా కనెక్ట్ అయిందో చూడండి. కొంతమంది రకుల్ ని ఇంకాస్త నల్లగా చూపిస్తే బాగుండేది .. విలేజ్ అమ్మాయి .. గొల్లమ్మాయి కదా" అన్నారు. గొల్లభామలు ఎంత అందంగా ఉంటారు? గొల్లభామలపై ఎంత మంది కవిత్వాలు రాశారు. బొమ్మకర్రలా ఉందంటే అంటే ఎర్రచందనంలా ఉందని  అర్థం. కీరవాణిగారు తను పాటలో అదే మాట రాశారు. ఓబు .. అడవంతా గొప్పది అని నేను రాసుకున్నాను .. ఈ పాత్ర గురించి నేను చెప్పేది కూడా ఇదే.

సాయిచంద్ గురించి .. ఆయన పోషించిన పాత్రను గురించి నేను ఇప్పుడు మాట్లాడను. ఆ తరువాత ఆయన ఇంటర్వ్యూ తీసుకుంటాను. నేను కలలు కన్న 'కొండ పొలం' చూపించడానికి ప్రతి ఒక్కరూ ఎంతో కష్టపడ్డారు. సినిమా మొత్తం మళ్లీ చూసుకున్న తరువాత వాళ్లలో ప్రధానమైన కారకులుగా నాకు కీరవాణిగారు కనిపించారు. ఈ సినిమా ఇంత గొప్పగా రావడానికి ప్రధానమైన కారణం ఆయనే. కీరవాణిగారు అందించిన సహకారాన్ని నేను ఎప్పటికీ మరిచిపోలేను. ఆయనకు నేను మరోసారి మనసారా థ్యాంక్స్ చెబుప్పుకుంటున్నాను" అంటూ ముగించారు.          
Tags:    

Similar News