తాండ్ర‌ పాపారాయుడు గుర్తొచ్చి భ‌య‌ప‌డ్డా

Update: 2015-09-19 22:30 GMT
ప్ర‌స్తుతం ఇండ‌స్ర్టీ క‌ళ్ల‌న్నీ రుద్ర‌మ‌దేవి 3డి పైనే. ఈ సినిమా అక్టోబ‌ర్ 9 రిలీజ్ అన‌గానే... జ‌నాల్లో ఎగ్జ‌యిట్‌ మెంట్ పెరిగింది. సినీప్రియులంతా ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. దేశంలోనే తొలి హిస్టారిక‌ల్ 3 డి  సినిమా థియేట‌ర్ల‌లోకి వ‌చ్చేస్తోంది. ముందుంది విజువ‌ల్ పండుగ అని అంతా సంబ‌రాలు చేసుకుంటున్నారు. బాహుబ‌లి త‌ర్వాత మ‌ళ్లీ అలాంటి విజువ‌ల్ ఫీస్ట్ ఈ సినిమా అవుతుంద‌ని భావిస్తున్నారంతా. ముఖ్యంగా  త‌న సినిమా ఎన్నో ఒడిదుడుకుల్ని ఎదుర్కొని రిలీజ‌వుతున్నందుకు అంద‌రి కంటే ఎక్కువ‌గా గుణ‌శేఖ‌రునికి టెన్ష‌న్‌ గా ఉంది. త‌న జీవితాన్నే ఒక ఛాలెంజ్‌ గా తీసుకుని ఈ సినిమా తీశారాయ‌న. అక్టోబ‌ర్ 9 రిలీజ్ చేస్తున్నాం. ముహూర్తం ఫిక్స్ అని ఆయ‌న ఎగ్జ‌యిటింగ్‌ గా ఉన్నారు.

ఈ సినిమా ప్ర‌మోష‌న్‌లో పాల్గొన్న రెబ‌ల్‌ స్టార్ కృష్ణంరాజు షూటింగ్ గురించి కొన్ని ఆస‌క్తిక‌ర సంగ‌తులు చెప్పారు. ఈ చిత్రంలో  కృష్ణంరాజు గ‌ణ‌ప‌తిదేవ చ‌క్ర‌వ‌ర్తిగా న‌టించారు. రుద్ర‌మ‌దేవిలో న‌టించ‌డం ఎలాంటి అనుభ‌వాన్ని ఇచ్చింది? అన్న ప్ర‌శ్న‌కు రెబ‌ల్‌ స్టార్ ఏమ‌న్నారంటే.. ఈ సినిమా ప్రారంభం అయ్యేప్పుడు గుణ‌శేఖ‌ర్ ఎంతో ధైర్యంగా ప‌ని మొద‌లెట్టారు. అయితే ఆన్‌సెట్స్ ద‌ర్శ‌క‌నిర్మాత‌గా ఆయ‌న క‌ష్టం చూశాక .. నాకు తాండ్ర పాపారాయుడు గుర్తొచ్చింది. తీసేప్పుడు బావుంటుంది. త‌ర్వాత దానిని థియేట‌ర్ ల‌లో చూసేప్పుడు చాలా క‌ష్టం అని కూడా అనిపిస్తుంది. 5వేల మంది జ‌నాల్ని పోగేసి, గుర్రాల్ని రెడీ చేసుకుని ప‌నిచేశాం తాండ్ర పాపారాయుడు కోసం... అందుకే ఇప్పుడు అంత ఖ‌ర్చు చేయ‌గ‌ల‌మా? అనిపిస్తుంది.                 

రుద్ర‌మ‌దేవి సెట్స్‌ లో ఉన్న‌పుడు పాత స‌న్నివేశాలు గుర్తొచ్చేవి. ఇప్పుడు ట్రెండ్ మారింది. అర‌వ‌డాలు - క‌ర‌వ‌డాలు - కొట్ట‌డాలు.. ఇవే సినిమాల్లో క‌నిపిస్తున్నాయి. ఇలాంటి టైమ్‌ లో  రుద్ర‌మ‌దేవి 3డి ఓ సాహ‌స‌మే అయినా గుణ‌శేఖ‌ర్ ధైర్యంగా ముందుకొచ్చారు. ఇలాంటి సినిమాకి వ‌చ్చే ఆడియెన్ స్పాన్ పెద్ద‌ది. పెద్ద విజ‌యం సాధించాల‌ని కోరుకుంటున్నా..అని రెబ‌ల్‌ స్టార్ అన్నారు. ఒక‌రి క‌ష్టం అలాంటి క‌ష్టం అనుభ‌వించిన ఇంకొక‌రికే తెలుస్తుంది. కాబ‌ట్టి గుణ‌శేఖ‌రుని క‌ష్టం ఫ‌లించాల‌ని రుద్ర‌మ‌దేవి టాలీవుడ్‌ లో మ‌రో బాహుబ‌లి కావాల‌ని ఆకాంక్షిద్దాం.
Tags:    

Similar News