స్పీల్బర్గ్ కు రెబెల్ స్టార్ సలహా!!

Update: 2017-03-26 15:22 GMT
ఒకానొకప్పుడు ఇండియన్ సినిమా వారు ఒకే ఒక్క కథతో ఇన్ని సంవత్సరాలు ఇన్ని వేల సినిమాలు ఎలా తీశారు అంటూ స్పీల్బర్గ్ కామెంట్ చేశాడట. అయితే ఆయన్ను ఒక్కసారి బాహుబలి సినిమాను చూసి కామెంట్ చేయమని మనవాళ్ళు అంటున్నారని సెలవిచ్చారు సీనియర్ నటుడు కృష్ణంరాజు. తన తమ్ముడు కొడుకు ప్రభాస్ హీరోగా రూపొందిన ''బాహుబలి 2'' ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడిన ఆయన .. చాలా ఆసక్తికరమైన విషయాలు చెప్పారు.

''రాజమౌళి స్పీల్బర్గ్ అంతటి గొప్పవాడా అని అనను.. అంతకంటే గొప్పవాడు అవుతాడేమో.. కాని ఇండియన్ మరియు తెలుగు సినిమాలో చాలా గొప్ప ఫిలింమేకర్లు ఉన్నారని రాజమౌళి ప్రూవ్ చేయడం నాకు గర్వంగా ఉంది. దయచేసి ఎవరైనా స్పీల్బర్గ్ కు చెప్పి  ఈ సినిమాను చూడమనండి'' అంటూ సెలవిచ్చారు. ఇకపోతే రాజకీయ నాయకుల ఫీలింగ్స్ గురించి కూడా ఆయన ప్రస్తావించారు. ''రాజకీయ నాయకులు ఎవరైనా కూడా సినిమా ఇండస్ర్టీ గురించి లోకువగా మాట్లాడతారు. ఎంతయ్యా మీ సినిమా ఇండస్ర్టీ.. మా ట్యాక్స్ అంత ఉండదు అనేవారు. కాని ఇప్పుడు మాత్రం ఢిల్లీ నుండి మద్రాస్ వరకు అందరూ బాహుబలి అంటున్నారు. కట్టప్ప అంటున్నారు'' అని సెలవిచ్చారు.

''సాక్షాత్తూ మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడి సైతం బాహుబలి గురించి ప్రస్తావించారు. బాహుబలి చూశారా? అందులో కట్టప్పను చూశారా? అని మోడి అడిగారు. ఈ దేశంలోని ప్రధాన మంత్రి కుర్చీని కాపాడే కట్టప్ప నేను అన్నారు. దీంట్లో మనం గుర్తించాల్సింది ఏంటంటే.. బాహుబలి మాస్ లోకి అలా వెళ్ళిపోయింది. మన సినిమాల స్థాయిని పెంచింది'' అన్నారు కృష్ణంరాజు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News