విజ‌య్ మూవీ కోసం ప్ర‌భాస్ హీరోయిన్

Update: 2022-03-30 14:30 GMT
దక్షిణాదిలో పాన్ ఇండియా చిత్రాల ప‌రంప‌ర కొన‌సాగుతోంది. తెలుగు సినిమా ఇచ్చిన ధైర్యంలో ద‌క్షిణాది భాష‌లైన క‌న్న‌డ‌, త‌మిళ భాష‌ల్లో పాన్ ఇండియా చిత్రాలు ఇండియ‌న్ బాక్సాఫీస్ పై దండ‌యాత్ర‌కు రెడీ అవుతున్నాయి. ఇటీవ‌లే విడుద‌లైన `ట్రిపుల్ ఆర్‌` రికార్డు స్థాయి క‌లెక్ష‌న్ ల‌తో రికార్డుల మోత మోగిస్తోంది. ఈ మూవీ సాధిస్తున్న వ‌సూళ్ల‌కు `బాహుబ‌లి` రికార్డులు స‌మం కావ‌డం తెలిసిందే. ఈ మూవీ త‌రువాత వ‌రుస‌గా తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ ఇండ‌స్ట్రీల నుంచి  పాన్ ఇండియా చిత్రాలు రిలీజ్ కాబోతున్నాయి.

మ‌రి కొన్ని చిత్రాలు సెట్స్ పైకి రాబోతున్నాయి. అందులో త‌మిళ స్టార్ హీరో విజ‌య్ న‌టించ‌నున్న ద్విభాష చిత్రం ఒక‌ట‌. దిల్ రాజు ఈ భారీ చిత్రాన్ని నిర్మించ‌బోతున్నారు. వంశీ పైడిప‌ల్లి డైరెక్ట్ చేయ‌నున్న ఈమూవీ తెలుగు, త‌మిళ భాష‌ల్లో ప్యార‌ల‌ల్ గా తెర‌కెక్క‌నుంది. ఈ ప్రాజెక్ట్ ని దిల్ రాజు, వంశీ పైడిప‌ల్లి ప్ర‌క‌టించి చాలా కాల‌మే అవుతున్నా ఇంత వ‌ర‌కు ఈ మూవీకి సంబంధించి ఎలాంటి ముంద‌డుగు ప‌డ‌లేదు. వ‌చ్చే నెల ఈ మూవీని లాంఛ‌నంగా ప్రారంభిచ‌డానికి వంశీ పైడిప‌ల్లి ఏర్పాట్లు చేస్తున్న‌ట్టుగా వార్త‌లు వినిపిస్తున్నాయి.

ఇప్ప‌టికే స్క్రీప్ట్ వర్క్ ఫినిష్ కావ‌డం తో షూటింగ్ ని లాంఛ‌నంగా ప్రారంభించాల‌ని ద‌ర్శ‌కుడు వంశీ పైడిప‌ల్లి ప్లాన్ చేస్తున్నార‌ట‌. భారీ స్థాయిలో తెర‌పైకి రానున్న ఈ మూవీలో హీరో విజ‌య్ కి జోడీగా ప్ర‌భాస్ హీరోయిన్ క్రితిస‌న‌న్ న‌టించే అవ‌కాశాలు వున్న‌ట్టుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇటీవ‌ల ర‌ష్మిక మంద‌న్న న‌టించే అవ‌కాశం వుంద‌ని వార్త‌లు వినిపించాయి. అయితే ఈ మూవీకి బాలీవుడ్ హీరోయిన్ అయితే మార్కెట్ ప‌రంగా ప్ల‌స్ అవుతుంద‌ని దిల్ రాజు, వంశీ పైడిప‌ల్లి భావించి క్రితి స‌న‌న్‌ని ఫైన‌ల్ చేస్తున్నార‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి.

క్రితిస‌న‌న్  ప్ర‌స్తుతం ప్ర‌భాస్ న‌టిస్తున్న మైథ‌లాజిక‌ల్ మూవీ `ఆదిపురుష్`లో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. చిత్రీక‌ర‌ణ పూర్తి చేసుకున్న ఈ మూవీ వీఎఫ్ ఎక్స్ వ‌ర్క్ జ‌రుపుకుంటోంది. భారీ అంచ‌నాలు నెల‌కొన్న ఈ చిత్రాన్ని వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి 12న సంక్రాంతి కానుకగా విడుద‌ల చేయ‌బోతున్నారు. ఇదిలా వుంటే విజ‌య్ హీరోగా న‌టించిన `బీస్ట్‌` మూవీ ఏప్రిల్ 13న తెలుగు, త‌మిళ భాష‌ల్లో విడుద‌ల కాబోతోంది. తెలుగులో ఈ మూవీని దిల్ రాజు, డి. సురేష్ బాబు, ఏషియ‌న్ సునీల్ రిలీజ్ చేస్తున్నారు.
Tags:    

Similar News