శరత్ కుమార్ కు ఖుష్బూ షాక్

Update: 2015-08-27 08:22 GMT
తమిళ నడిగర్ సంఘం ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అక్కడ జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే.. ఆ మధ్య మన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికల సందర్భంగా సాగిన రాజకీయాలు, డ్రామా కూడా దిగదుడుపే అనిపిస్తున్నాయి. ఆ స్థాయిలో అక్కడ రసవత్తర డ్రామా నడుస్తోంది. సీనియర్ నటుడు శరత్ కుమార్ నేతృత్వంలో పాతుకుపోయిన కార్యవర్గాన్ని పెకలించేందుకు మన తెలుగు తేజం విశాల్ చేస్తున్న ప్రయత్నాలు బాగానే ఫలిస్తున్నాయి. శరత్ వర్గం చేసిన అన్యాయాలు, అక్రమాలపై గళమెత్తి... అనుకోని పరిస్థితుల్లో అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న విశాల్ కు నెమ్మదిగా మద్దతు పెరుగుతోంది.

ఇప్పటికే సీనియర్ నటుడు నాజర్, సూర్య, కార్తి బ్రదర్స్ లతో చాలా మంది విశాల్ కు మద్దతుగా నిలిచారు. ఐతే తన తరం నటీనటులంతా తనకే మద్దతిస్తారని శరత్ కుమార్ ఎంతో కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. ఐతే ఒకప్పటి హీరోయిన్, ప్రస్తుత కాంగ్రెస్ నేత ఖుష్బూ సడెన్ గా విశాల్ కు మద్దతిచ్చి శరత్ కుమార్ కు షాకిచ్చారు. శరత్ తో ఖుష్బూకు మంచి స్నేహం ఉంది. ఐతే ఆ స్నేహం పక్కనబెట్టేసి నడిగర్ సంఘంలోకి కొత్త రక్తం రావాలంటూ విశాల్ కు మద్దతిచ్చింది ఖుష్బూ. ఐతే జయలలితను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఖుష్బూ మద్దతు తీసుకోవడం విశాల్ కు మంచి చేస్తుందో, చెడు చేస్తుందో చెప్పలేం. ఆ సంగతి పక్కనబెడితే.. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో చాలా అగ్రెసివ్ గా ముందుకెళ్తున్నాడు విశాల్. నడిగర్ సంఘం నిధుల్ని దుర్వినియోగం చేయడం.. శివాజీ గణేశన్ విగ్రహం కోసం ప్రభుత్వం దశాబ్దంన్నర కిందటే భూమి ఇచ్చినా పనులు మొదలుపెట్టకపోవడంపై ఈ మధ్యే ప్రెస్ మీట్ పెట్టి శరత్ వర్గాన్ని వాయించేశాడు విశాల్.
Tags:    

Similar News