'ఆర్ ఆర్ ఆర్' చిట్ చాట్ లో బాలు ముచ్చట!

Update: 2022-03-21 09:32 GMT
కీరవాణి పాటలకు తీయదనం ఎక్కువ .. ఆయన పాటలు వింటే తేనెటీగలు తేనె తీయడం మరిచిపోతాయి. రాఘవేంద్రరావు .. బాలసుబ్రహ్మణ్యంతో కలిసి ఆయన చేసిన ప్రయోగాలు ఎన్నో. కీరవాణి స్వరాలకు సుకుమారం ఎక్కువ .. ఆయన బాణీలకు మాధుర్యం ఎక్కువ. ఆయన పాటలు పాడేటప్పుడు కలిగే ఆనందం వేరు .. అనుబంధం వేరు. ఆయనతో నాకున్న అనుబంధం వేరు అని  చాలా సందర్భాల్లో బాలు చెప్పారు. అలాంటి బాలు గురించిన ప్రస్తావన 'ఆర్ ఆర్ ఆర్' సినిమా ప్రమోషన్స్ లో వచ్చింది.

రాజమౌళి దర్శకత్వం వహించిన 'ఆర్ ఆర్ ఆర్' ఈ నెల 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఎన్టీఆర్ .. చరణ్ ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమాకి కీరవాణి సంగీతాన్ని సమకూర్చారు. తాజాగా ఈ ముగ్గురి మధ్య సరదాగా చిట్ చాట్ జరిగింది.

చిరంజీవి కెరియర్లో మ్యూజికల్ హిట్ గా నిలిచిన సినిమాల్లో 'ఘరానా మొగుడు' ఒకటిగా కనిపిస్తుంది. ఈ సినిమాలో 'బంగారు కోడిపెట్ట' అంటూ బాలు పాడిన పాట ఇప్పటికీ జనం నాల్కులపై నాట్యం చేస్తూనే ఉంటుంది. ఆ పాటను 'మగధీర' కోసం వేరే సింగర్ తో పాడించిన సంగతి తెలిసిందే.

ఆ విషయాన్ని గురించి ఈ చిట్ చాట్ లో కీరవాణి మాట్లాడుతూ .. 'ఘరానా మొగుడు' సినిమాలో బాలుగారు పాడిన 'బంగారు కోడిపెట్ట' సాంగ్ అప్పట్లో యూత్ ను .. మాస్ ను ఒక ఊపు ఊపేసింది. ఆ సాంగ్ ను 'మగధీర' కోసం వేరే సింగర్ తో పాడించాము. అయితే ఆ పాట ఆరంభంలో బాలుగారు 'అప్ అప్ హ్యాండ్సప్' అని అంటారు. అంత షార్ప్ గా .. పెర్ఫెక్ట్ గా ..  అంత ఎనర్జీతో ఎవరూ కూడా అలా అనలేకపోయారు. చాలామంది సింగర్స్ ను పిలిపించినా, ఎవరూ కూడా ఆయన పాడినదానికి దగ్గరగా కూడా వెళ్లలేకపోయారు.

అప్పుడు ఇక లాభం లేదనుకుని .. బాలు పాడిన ఒరిజినల్ సాంగ్ నుంచి ఆ బిట్ తీసుకుని .. మిగతా లైన్లు వేరే సింగర్ తో పాడించడం జరిగింది. అయితే ఈ పాట విన్న బాలు గారు .. "అరే ఇది అచ్చం నేను పాడినట్టుగానే ఉందే" అన్నారు.

మీరు పాడినట్టుగా ఉండటం కాదు సార్ .. మీరు పాడిందే. మీకు చెప్పకుండా ఒరిజినల్ లో ఉన్న వాయిస్ ను వాడేయవలసి వచ్చింది" అన్నాను అంటూ కీరవాణి చెప్పుకొచ్చారు. బాలు మాదిరిగా మరొకరు పాడితే ఇక బాలు గొప్పతనం ఏవుంటుంది? ఆయన కృషిని అనుసరించవచ్చునుగానీ, ఆయన స్వరాన్ని అనుకరించాలంటే మాత్రం అది అసాధ్యమేనేమో!
Tags:    

Similar News