స్టార్ హీరోల‌తో బ‌రిలోకి దిగేస్తున్న తాప్సీ

Update: 2022-02-28 10:35 GMT
`భీమ్లానాయ‌క్‌` మూవీ నుంచి మే వ‌ర‌కు భారీ చిత్రాల రిలీజ్ ల‌తో థియేట‌ర్లు ఫుల్ కాబోతున్నాయి. దీంతో చాలా వ‌ర‌కు చిన్న చిత్రాలు బ‌రిలో నిల‌వ‌డానికి జంకుతున్న వేళ స్టార్ హీరోల‌తో పోటీప‌డేందుకు క్రేజీ హీరోయిన్ తాప్సీ బ‌రిలోకి దిగుతుండ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది.

వివ‌రాల్లోకి వెళితే.. తెలుగు చిత్రాల్లో క‌నిపించ‌డం మానేసి బాలీవుడ్ కే ప‌రిమితమైన తాప్సీ కాన్సెప్ట్ ఓరియెంటెడ్ చిత్రాల్లో న‌టించే అవ‌కాశం వ‌స్తే ఖ‌చ్చితంగా చేయ‌డానికి ముందుకొస్తోంది. అలా తాప్సీ తెలుగులో న‌టిస్తున్న చిత్రం `మిష‌న్ ఇంపాజిబుల్‌`.  

మ్యాటినీ ఎంట‌ర్ టైన్ మెంట్స్ బ్యాన‌ర్ పై స్టార్ మేక‌ర్స్ నిరంజ‌న్ రెడ్డి , అవినాష్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్ప‌టికే ప‌లు భారీ చిత్రాల‌ని నిర్మిస్తున్న ఈ మేక‌ర్స్ క‌థాబ‌ల‌మున్న చిన్న చిత్రాల‌ని కూడా నిర్మిస్తోంది. ప్ర‌స్తుతం మ్యాట్ని ఎంట‌ర్ టైన్‌మెంట్స్ వారు మెగాస్టార్ తో `ఆచార్య‌` చిత్రాన్ని నిర్మిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ మూవీతో పాటు ఓ విభిన్న‌మైన కాన్సెప్ట్ తో రూపొందుతున్న `మిష‌న్ ఇంపాజిబుల్‌` చిత్రాన్ని కూడా నిర్మిస్తున్నారు. తాప్సీ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్న ఈ చిత్రానికి `ఏజెంట్ సాయి శ్రీ‌నివాస ఆత్రేయ‌` ఫేమ్ స్వ‌రూప్ ఆర్ ఎస్ జె ద‌ర్శ‌కుడు.

ఈ చిత్రం అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకుని రిలీజ్ కి రెడీగా వుంది. ఇటీవ‌లే చిత్ర బృందం ఈ మూవీ ప్ర‌మోష‌న్స్ ని కూడా ప్రారంభించారు. ఇటీవ‌ల `యేద్దాం గాలం...` అంటూ సాగే లిరిక‌ల్ వీడియోని విడుద‌ల చేశారు. దీనికి అనూహ్య స్పంద‌న ల‌భించింది. దీంతో సోమ‌వారం చిత్ర బృందం మ‌రింత జోష్ తో సినిమా రిలీజ్ డేట్ ని ప్ర‌క‌టించేసింది. కొత్త త‌ర‌హా క‌థ‌, క‌థ‌నాల‌తో రూపొందించిన ఈ చిత్రాన్ని ఏప్రిల్ 1న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల చేస్తున్న‌ట్టు చిత్ర బృందం ప్ర‌క‌టించింది.  

తిరుప‌తిలోని ఓ విలేజ్ నేప‌థ్యంలో సాగే క‌థ‌తో ఈ చిత్రాన్ని దర్శ‌కుడు తెర‌కెక్కించాడు. స‌మ్మ‌ర్ లో ప్రేక్ష‌కుల‌కు ఫుల్ ఎంట‌ర్ టైన్ మెంట్ ని అందించే ఉద్దేశంగా ఆద్యంతం వినోదాత్మ‌కంగా ఈ మూవీని రూపొందించారు. చాలా కాలం త‌రువాత తాప్సీ న‌టిస్తున్న సినిమా కావ‌డంతో.. ఫ‌స్ట్ లుక్, లిరిక‌ల్ వీడియోల‌కు మంచి ఆద‌ర‌ణ ల‌భించ‌డంతో సినిమాపై కూడా మంచి హైప్ క్రియేట్ అయింది.

టాలీవుడ్ లో ఈ సినిమా తాప్సీకి మ‌రో బ్రేక్ ని అందించ‌డం ఖాయంగా చెబుతున్నారు. దీప‌క్ యెర‌గార సినిమాటోగ్ర‌ఫీ, మార్క్ కె. రాబిన్ సంగీతం, ర‌వితేజ గిరిజాల ఎడిటింగ్ అందిస్తున్న ఈ చిత్రంలో తాప్సీతో పాటు ర‌వీంద‌ర్ విజ‌య్‌, హ‌రీష్ ప‌రేడి కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. 
Tags:    

Similar News