ఫ్ర‌స్టేష‌న్ లో స్టార్ డైరెక్ట‌ర్.. ఖాళీగా లేమ‌న్నార‌ని..!

Update: 2022-03-16 05:30 GMT
దర్శకుడు కేఎస్‌ రవికుమార్ నోట ఊహించ‌ని మాట వ‌చ్చింది. ఆయ‌న ఫ్ర‌స్టేష‌న్ బ‌య‌ట‌ప‌డింది. ఇంత‌కీ ఆయ‌నేమ‌న్నారు? అంటే.. త‌న సినిమా ప్ర‌మోష‌న్ కి అతిథిగా రమ్మ‌ని అడిగితే హీరోలు ఖాళీగా లేమ‌ని అన్నార‌ట‌. కేఎస్ స‌మ‌ర్ప‌ణ‌లో తెర‌కెక్కిన‌  'కూగ్లే కుట్టప్ప' ట్రైలర్ ను సోమవారం చెన్నై నగరంలోని కమలా సినిమా థియేటర్ లో ప‌లువురు అతిథుల స‌మ‌క్షంలో విడుదల చేశారు. ప్రముఖ దర్శకులు విక్రమన్- ఆర్‌.కె సెల్వమణి- పేరరసు- ఆర్‌.వి ఉదయకుమార్ లు ఈ చిత్రం ట్రైలర్ ను సినిమాలో ముఖ్య పాత్ర పోషిస్తున్న రోబోకు అందించి విడుదల చేశారు.

ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో ప్రముఖ దర్శకుడు కెఎస్ రవికుమార్ మాట్లాడుతూ.. దాదాపు 20 ఏళ్ల తర్వాత తన అసిస్టెంట్ డైరెక్టర్ల కోసం తాను ప్రొడక్షన్ లోకి వస్తున్నానని చెప్పారు. ఈ సినిమాతో ఇప్పుడు దర్శకులుగా మారుతున్న తన అసిస్టెంట్ డైరెక్టర్ లను ప్రశంసించిన రవికుమార్.. తన అసిస్టెంట్ డైరెక్టర్ లుగా పనిచేసిన వారందరూ డబ్బు ఖర్చు చేసే విషయంలో తెలివిగా వ్యవహరించడం నేర్చుకున్నారని సెట్స్ లో ఏమీ వృధా కాకుండా చూసుకున్నారని రవికుమార్ అన్నారు.

రవికుమార్ సహాయ దర్శకులు ఇద్దరు దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రముఖ మలయాళ హిట్ చిత్రం 'ఆండ్రాయిడ్ కుంజప్పన్' వెర్షన్ 5.25కి రీమేక్. జిబ్రాన్ సంగీతం అందించిన ఈ చిత్రానికి అరవింద్ సినిమాటోగ్రఫీ అందించారు.

త‌మిళ చిత్రపరిశ్రమలో మంచి మనసు ఉన్న వ్యక్తి దర్శకుడు కేఎస్‌.రవికుమార్‌ అని పలువురు సినీ ప్రముఖులు ఇదే వేదిక‌పై ప్రశంసల వర్షం కురిపించారు. తనవద్ద పనిచేసే అసిస్టెంట్‌ డైరెక్టర్లను దర్శకులుగా ప్రోత్సహించడమే కాకుండా స్వయంగా ఆయనే సినిమాలు నిర్మించడం చాలా గొప్ప విషయమని కోలీవుడ్ పాపుల‌ర్ దర్శకులు ప్ర‌శంసించారు.

కేఎస్‌. రవికుమార్‌ మాట్లాడుతూ...  "ఈ చిత్రం ఆడియోను పెద్ద హీరోతో రిలీజ్‌ చేయించాలని భావించి అనేక మందిని సంప్రదించాను. కానీ వారంతా బిజీగా ఉన్నామని చెప్పారు. ఇది వారి సీజన్‌... నా సీజన్‌ కాదు. అందుకే నా కుటుంబ (దర్శకుల సంఘం) సభ్యులతో ఈ ఆడియోను రిలీజ్‌ చేయాలని నిర్ణయించి వీరందరినీ ఆహ్వానించాను" అని కేఎస్‌. రవికుమార్‌ కోరారు.

ఈ సినిమాలో రోబో పాత్ర అత్యంత కీలకం. బలమైన సెంటిమెంట్స్‌ ఎమోషన్స్ తో పాటు హాస్యం కూడా పుష్కలంగా ఉన్న చిత్రంలో రోబో పాత్ర‌లో కేఎస్ న‌టించారు. చిన్నారులతో కుటుంబ ప్రేక్షకులను కూడా అమితంగా ఆకట్టుకుంటుందని ఆయ‌న అన్నారు.
Tags:    

Similar News