ఎన్టీఆర్ వేణుమాధవ్‌కు దోసె పెట్టిన వేళ..

Update: 2016-12-11 06:33 GMT
ఎన్టీఆర్ అంటే చిన్న ఎన్టీఆర్ కాదులెండి. పెద్ద ఎన్టీఆరే. పెద్దాయన ఓ సందర్భంలో వేణుమాధవ్ ను తిట్టేసి.. ఆ తర్వాత తాను తింటున్న దోసెను ప్రేమగా వేణుమాధవ్ కు అందించాడట. ఇదంతా పాతికేళ్ల కిందటి సంగతి. వేణుమాధవ్ టీడీపీ ఆఫీసులో పని చేస్తున్న టైంలో ఈ సంఘటన జరిగిందట. ఎన్టీఆర్ తో తన అనుబంధం ఎలా మొదలైంది.. ఆయనతో ఎలాంటి అనుభవాలున్నది తాజాగా ఒక ఇంటర్వ్యూలో వెల్లడించాడు వేణు.

‘‘నల్గొండలో నేను చేసిన మిమిక్రీ కమ్ టాకింగ్ డాల్ ప్రోగ్రాం చూసి చంద్రబాబు నాయుడు గారు మహానాడు కార్యక్రమానికి తీసుకెళ్లారు. ఆ రోజు మధ్యాహ్నమే నన్ను వేదిక దగ్గరికి తీసుకెళ్లారు. కానీ ఎంతసేపటికీ నాకు అవకాశమివ్వలేదు. అతిథులందరి ప్రసంగాలైపోయాయి. ఇక ఎన్టీఆర్ గారు మాత్రమే మాట్లాడాల్సి ఉంది. కాబట్టి నా ప్రోగ్రాం ఉండదని సర్దుకోబోతుండగా.. చంద్రబాబు గారు పిలిచి నన్ను ప్రోగ్రాం చేయమన్నారు. నేను చేసిన ప్రోగ్రాం చూసి అన్నగారు లేచి నిలబడి చప్పట్లు చరిచి.. నన్ను కౌగిలించుకున్నారు. పార్టీకి నా అవసరం ఉందన్నారు. తర్వాత నాకు పార్టీ ఆఫీసులో ఉద్యోగం టెలిఫోన్ ఆపరేటర్ గా ఉద్యోగం వేయించారు. అప్పుడప్పుడూ నాకు అన్నగారి ఇంటిదగ్గర డ్యూటీ పడేది. ప్రెస్ మీట్ పెట్టాల్సి ఉన్నపుడు నాకే చెప్పేవాళ్లు. అలా ఓ రోజు ప్రెస్ కు సమాచారం ఇవ్వమన్నారు. ఆ సంగతి అందరికీ చెప్పాను. కానీ అందరూ ప్రెస్ మీట్ కోసం రెడీగా ఉంటే.. నా దగ్గరికి వచ్చి ప్రెస్ మీట్ క్యాన్సిల్ అన్నారు. వెళ్లి ప్రెస్ వాళ్లకు చెబితే అందరూ తిట్టారు. అక్కడి నుంచి తిరిగి వస్తుంటే అన్నగారు పిలిచి.. అక్కడ వెలుగుతున్న లైట్ చూపించారు. అలా లైట్ ఆఫ్ చేయకుండా వదిలేస్తే ఎంత కరెంటు వేస్టవుతుంది.. అని తిట్టారు. అప్సెట్ అయ్యాను. కానీ కాసేపటి తర్వాత ఆయనే మళ్లీ పిలిచారు. మళ్లీ తిడతారేమో అనుకున్నా. కానీ ఇలా తప్పులు చేయకూడదు అంటూ ప్రేమగా మాట్లాడారు. ఆయన తింటున్న దోసెలో సగం తీసి నాకిచ్చారు’’ అని వేణుమాధవ్ తెలిపాడు.
Tags:    

Similar News