'గాన గాంధర్వుడు' ఎస్పీబీకి అశ్రు నివాళి...!

Update: 2020-09-25 11:30 GMT
లెజండరీ సింగర్ 'గాన గాంధర్వుడు' ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం(74) కన్నుమూశారు. నిన్న రాత్రి నుంచి శ్వాస తీసుకోవ‌డానికి తీవ్రంగా ఇబ్బంది ప‌డ్డ ఆయ‌న శుక్రవారం మధ్యాహ్నం గం.1. 04 నిమిషాలకు వెంటిలేట‌ర్‌ పై తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆయన కుమారుడు చరణ్‌ మీడియా ముందు ధృవీకరించారు. ఇటీవల ఎస్పీబీ క‌రోనా బారిన పడటంతో ఆగ‌స్టు 5న చెన్నైలోని ఎంజీఎమ్ హాస్పిటల్ లో చేరారు. అయితే కరోనా నుంచి కోలుకున్న ఎస్పీబీకి ఇతర అనారోగ్య సమస్యలు తిరగబెట్టినట్టు తెలిసింది. 50 రోజులుగా చికిత్స తీసుకుంటున్న ఆయ‌న తనువు చాలించారు. పూర్తి ఆరోగ్యంతో తిరిగి వ‌స్తాడ‌నుకున్న సినీ ప్రముఖులు గాయకులు అభిమానుల‌ను శోక‌సంద్రంలో ముంచేసి తిరిగిరాని లోకాల‌కు బాలు వెళ్లిపోయారు. కొన్నేళ్ల పాటు తన గాత్రంతో ప్రేక్షకులను అలరించిన గాన గాంధర్వుడి మరణం యావత్ చిత్ర ప‌రిశ్ర‌మను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది.

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం 1946 జూన్ 4న నెల్లూరులోని కోనేట‌మ్మ పేట గ్రామంలో జ‌న్మించారు. ఆయన పూర్తి పేరు శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం. ఆయన తండ్రి శ్రీపతి పండితారాధ్యుల సాంబమూర్తి.. తల్లి శకుంతలమ్మ. బాలసుబ్రహ్మణ్యం - సావిత్రి దంపతులకు చరణ్ - పల్లవి అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. బాలుకు ఇష్ట‌మైన గాయ‌కుడు మ‌హమ్మ‌ద్ ర‌ఫీ. 'శ్రీశ్రీశ్రీ మ‌ర్యాద రామ‌న్న'(1966) చిత్రంలో తొలిసారి పాట పాడిన బాలు.. నాలుగు ద‌శాబ్దాల‌ సినీ ప్ర‌స్థానంలో న‌ల‌భై ఒక్క వేల పైచిలుకు పాట‌లు పాడారు. తన గాత్రంతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఎస్పీబీ ఎన్నో అవార్డులు అందుకొని.. అన్ని భాషల్లో కలిపి అత్యధిక పాటలు పాడిన గాయకుడిగా గిన్నిస్ రికార్డును సాధించారు. గాయకుడిగానే కాకుండా నటుడిగా డబ్బింగ్ ఆర్టిస్టుగా ప్రొడ్యూసర్ గా సినీ ఇండస్ట్రీకి తన సేవలు అందించారు. సినిమాలతో పాటు టీవీ సీరియల్స్ లో నటించారు.

బాలసుబ్రహ్మణ్యం తన గొంతు తోనే కాకుండా న‌ట‌న‌తోనూ ప్రేక్ష‌కుల‌ను ఆకట్టుకున్నాడు. 1969లో 'పెళ్ళంటే నూరేళ్ళ పంట' అనే చిత్రంలో మొదటిసారి కనిపించిన బాలు.. 'ప్రేమ' 'కళ్ళు' 'చెన్నపట్నం చిన్నోడు' 'రాజహంస' 'మైనా' 'ప‌విత్ర బంధం' 'పెళ్లి వారమండి' 'ఊయల' 'పెళ్ళాడి చూపిస్తా' 'ఆరో ప్రాణం' 'పెద్ద మనుషులు' 'పాడుతా తీయగా' 'గొప్పింటి అల్లుడు' 'రక్షకుడు' 'దేవుళ్లు' 'చిరుజల్లు' 'మిథునం' చిత్రాల్లో నటించారు. చివరిగా నాగార్జున - నాని నటించిన 'దేవదాస్' (2018) చిత్రంలో నటించారు. ఇక క‌మ‌ల్ హాస‌న్‌ - ర‌జ‌నీకాంత్‌ - స‌ల్మాన్ ఖాన్‌ - జెమిని గ‌ణేష‌న్ - అనిల్ కపూర్ - మోహన్ లాల్ - సుమన్ వంటి ప‌లువురు హీరోల‌కు డబ్బింగ్ చెప్పారు. 'శ్రీరామరాజ్యం' తమిళ్ వర్షన్ కోసం బాలకృష్ణకు గాత్రదానం చేశారు.

తెలుగు హిందీ తమిళం కన్నడ భాషల్లో కలిపి మొత్తం ఆరు సార్లు జాతీయ ఉత్తమగాయకుడిగా నిలవడం ఒక్క బాలు కే చెల్లింది. సంగీతంలోని అన్ని రకాల రాగాలలో సాంగ్స్ పాడిన బాలసుబ్రహ్మణ్యం.. భక్తి పాటలకు ప్రాణం పోశారు. 'అన్నమయ్య' 'శ్రీరామదాసు' 'శ్రీరామరాజ్యం' 'శిరిడీ సాయి' చిత్రాలలో బాలు ఆలపించిన భక్తి గీతాలు ప్రతి రోజూ గుడిలో దేవాలయాల్లో ఇళ్లలో వినిపిస్తూనే ఉంటాయి. ఇక బాలు ఉత్తమ గాయకుడిగా, ఉత్తమ సంగీత దర్శకుడిగా, ఉత్తమ డబ్బింగ్ ఆర్టిస్టుగా, ఉత్తమ సహాయ నటుడిగా నంది పురస్కారాలు అందుకున్నాడు. కేంద్ర ప్రభుత్వం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పద్మశ్రీ (2001), పద్మభూషణ్(2011) పురష్కారాలతో సత్కరించింది. 1999లో పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం డాక్టరేట్‌ ఇచ్చి గౌరవించింది. నాలుగు దశాబ్దాలకు పైగా సినీ ఇండస్ట్రీకి సేవలు అందించి అనంత లోకాలకు వెళ్ళిపోయిన 'గాన గాంధర్వుడు' ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ.. 'తుపాకీ డాట్ కామ్' ఆయ‌న‌కు అశ్రు నివాళి అర్పిస్తోంది.
Tags:    

Similar News