MAA క్ర‌మ‌శిక్ష‌ణా క‌మిటీ నోటీస్ తో చిక్కుల్లో హేమ‌

Update: 2021-08-10 17:07 GMT
మూవీ ఆర్టిస్టుల సంఘం (మా) ఎన్నిక‌లు ర‌స‌వ‌త్త‌రంగా మారాయి. సెప్టెంబ‌ర్ లో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో ఇప్ప‌టికే వ‌ర్గ‌పోరు ప‌రాకాష్ఠ‌కు చేరుకుంటోంది. తాజాగా హేమ వాయిస్ మెసేజ్ క‌ల‌క‌లం రేపిన సంగ‌తి తెలిసిందే. సంఘంలో 950 మంది స‌భ్యులు ఉండ‌గా అందులో చాలా మంది సభ్యులకు క్యారెక్టర్ ఆర్టిస్ట్ హేమ వాయిస్ మెసేజ్ టాలీవుడ్ సర్కిల్స్ లో పెను తుఫాన్ సృష్టించింది. ప్రస్తుత MAA అధ్యక్షుడు నరేష్ నిధుల దుర్వినియోగానికి పాల్ప‌డ్డార‌ని తీవ్రమైన ఆరోపణలు చేసింది. అయితే అది త‌ప్పుడు ప్ర‌చారం అంటూ ప్రతిఘటిస్తూ నరేష్ ఆవేద‌న చెందారు. తాను నిజాయితీగా పనిచేస్తున్నానని స్పష్టం చేశారు. హేమ వాయిస్ మెసేజ్ MAA ఇమేజ్ ని దెబ్బతీసిందని ఆమెపై తగిన చర్యలు తీసుకోవాలని నరేశ్ హేమపై క్రమశిక్షణ కమిటీకి ఫిర్యాదు చేశారు. నరేశ్ ఫిర్యాదుపై క్రమశిక్షణ కమిటీ చైర్మన్ యువి కృష్ణం రాజు స్పందించారు. హేమకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. నోటీసులపై మూడు రోజుల్లోగా స్పందించాలని క్రమశిక్షణ కమిటీ హేమను కోరింది. లేకుంటే కమిటీ ఆమెపై కఠిన చర్యలు తీసుకుంటుంది.

చూస్తుంటే ఎన్నిక‌ల ముందు హేమ అన‌వ‌స‌రంగా చిక్కుల్లో ప‌డ్డార‌ని అర్థ‌మ‌వుతోంది. అస‌లే తాను అధ్య‌క్ష ప‌ద‌వికి పోటీప‌డేందుకు సిద్ధ‌మ‌య్యారు. దీంతో స్వయంగా ఇబ్బందిని ఆహ్వానించినట్లు కనిపిస్తోంది. ఆమె తదుపరి ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం వరకు వేచి ఉండాల్సి ఉంటుంది. MAA ఎన్నికల షెడ్యూల్ నిర్ణయించబడకపోతే ఆమె MAA సభ్యుల నుండి మద్దతును సేకరించేందుకు ఆస్కారం ఉంటుంది. ఇప్ప‌టివ‌ర‌కూ ఈ నోటీసుల‌పై హేమ స్పందించ‌లేదు.

ఇక సెప్టెంబ‌ర్ 12న ఎన్నిక‌లు నిర్వ‌హించాల‌ని మా స‌భ్యుల్లో మెజారిటీ మెంబ‌ర్స్ కోరుతుండ‌గా.. దానికి క్ర‌మ‌శిక్ష‌ణా సంఘం సిద్ధంగా ఉంద‌ని తెలుస్తోంది. అయితే అధికారికంగా ప్ర‌క‌ట‌న వెలువ‌డాల్సి ఉంది. అలాగే ఈసారి ఎన్నిక‌లు నిర్వ‌హించాల్సిందిగా క‌మిటీ అధ్య‌క్షులు కృష్ణంరాజుకు మెగాస్టార్ చిరంజీవి స్వ‌యంగా లేఖ రాయ‌డంతో తాజా ప‌రిణామాల‌ను బ‌ట్టి ఎన్నిక‌లు ఖ‌రారైన‌ట్టేన‌ని అంతా భావిస్తున్నారు. ప్ర‌స్తుతం ప్ర‌కాష్ రాజ్ వ‌ర్గం.. న‌రేష్ వ‌ర్గం.. మంచు విష్ణు వ‌ర్గం.. జీవిత వ‌ర్గం ఎవ‌రికి వారు ఇంట‌ర్న‌ల్ పాలిటిక్స్ తో హీటెక్కించే ప్ర‌య‌త్నాల్లో ఉన్నారు. 2021-24 సీజ‌న్ కి ఈ ఎన్నిక‌లు జ‌రుగుతాయ‌ని తెలుస్తోంది.

క‌చ్ఛితంగా మా సొంత భ‌వంతి నిర్మిస్తారా?

మూవీ ఆర్టిస్టుల సంఘం (మా) భ‌వంతి నిర్మాణం జ‌ర‌గ‌డ‌మే ఈసారి అంద‌రి ధ్యేయం కావాలని కోరుకుంటున్నారు. టాలీవుడ్ 90ఏళ్ల హిస్ట‌రీలో మునుపెన్న‌డూ లేనిది ఈసారి జ‌ర‌గాలి. ఎక‌రం స్థ‌లం ద‌క్కాలి. 30 కోట్ల‌తో భ‌వంతి నిర్మాణం పూర్త‌వ్వాలి. అప్పుడే టాలీవుడ్ ఆత్మ శాంతిస్తుంది! కేవ‌లం భ‌వంతి నిర్మిస్తే స‌రిపోదు.. న‌డిగ‌ర సంఘం భ‌వంతిని కొట్టేలా ఇంటీరియ‌ర్ భారీగా డిజైన్ చేయించాలి. టాలీవుడ్ గౌర‌వాన్ని అంత‌ర్జాతీయ సినీవేదిక‌పై నిల‌బెట్టేంత‌గా బాలీవుడ్ ని కొట్టేస్తాం అనిపించేలా ఈ భ‌వంతిని తీర్చిదిద్దాలి.. దీనికోసం కోట్లు ఖ‌ర్చ‌వుతుంది గ‌నుక సినీపెద్ద‌లంతా త‌లో చెయ్యేస్తే డ‌బ్బు పోగవ్వ‌డం ఏమంత క‌ష్టం కాదు. ఇక న‌ట‌సింహా నంద‌మూరి బాల‌కృష్ణ వంటి వారు విరివిగా భూరి విరాళాలు ఇచ్చేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉన్నారు. క‌మిటీ పెద్ద‌ల విరాళాలు స‌హా మా ఆర్టిస్టుల్లో ధ‌నికులంతా త‌లో చెయ్యి వేస్తే ఆ రేంజులో మా అసోసియేష‌న్ భ‌వంతి రెడీ అవుతుంద‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు. ఎవ‌రి సాయ‌మూ లేకుండా కేవ‌లం ఇండివిడ్యువ‌ల్ గా భ‌వంతి తానే నిర్మిస్తాన‌ని ప్ర‌క‌టించిన మంచు విష్ణు ఆ మాట నిల‌బెట్టుకోవాలి. అలాగే ప్ర‌భుత్వం నుంచి ఎక‌రం స్థ‌లాన్ని ప్ర‌కాష్ రాజ్ ఎలా తేవాలో ఆలోచించాల‌ని అంతా కోరుతున్నారు...!!




Tags:    

Similar News