‘మా’ ఎన్నికలకు ముహుర్తం.. సెప్టెంబరులోనే ఎందుకంటే?

Update: 2021-07-25 04:30 GMT
ఎంతైనా సినిమా వాళ్లు కదా.. సాఫీగా సాగిపోతే పెద్ద నచ్చదన్నట్లుగా.. ట్విస్టుల మీద ట్విస్టులతో సాగుతున్న మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ‘మా’ ఎన్నికల వ్యవహారం ఒక కొలిక్కి వచ్చినట్లుగా తెలుస్తోంది. ఎన్నికలు నిర్వహించటానికి కీలకమైన ‘మా’ ఎగ్జిక్యూటివ్ సమావేశాన్ని అయితే బుధవారం లేదంటే గురువారం నిర్వహించాలని డిసైడ్ చేశారు. అయితే.. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన ఏమీ వెలువడలేదు. చిత్రపరిశ్రమకు చెందిన విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు తాజా పరిణామాలు తెలిశాయి.

గడువు తీరిన తర్వాత  ‘మా’ ఎన్నికల్ని నిర్వహించటానికి ఎగ్జిక్యుటివ్ కమిటీ సమావేశం చాలా కీలకం. అందుకే దీన్ని వెంటనే చేపట్టాలని భావిస్తున్నారు. కోవిడ్ నేపథ్యంలో ఈ సమావేశాన్ని వర్చువల్ గా నిర్వహించాలని భావిస్తున్నారు. ‘మా’ ఏర్పడిన తర్వాత వర్చువల్ గా జరుగుతున్న మొదటి సమావేశంగా దీన్ని చెప్పాలి. ఈ మీటింగ్ ఎజెండాగా ఏజీఎంను ఎప్పుడు నిర్వహించాలి? ఎన్నికల్ని ఎప్పుడు చేపట్టాలి? సభ్యుల బీమాకు సంబంధించి చెల్లించాల్సిన ప్రీమియంతో పాటు కొందరికి సభ్యత్వాలు ఇవ్వటానికి సంబంధించిన అంశాల్ని ఈసీలో చర్చించి నిర్ణయం తీసుకుంటున్నారని చెబుతున్నారు.

ఈ వారంలో నిర్వహించే ఈ ఎగ్జిక్యూటివ్ సమావేశానికి ప్రస్తుతం ఉన్న  ఈసీ సభ్యులతో పాటు క్రమశిక్షణా సంఘ ఛైర్మన్ కృష్ణంరాజుతో పాటు.. న్యాయ సలహాదారు.. ఆడిటర్ కూడా పాల్గొంటారని తెలుస్తోంది. ‘మా’ బైలా ప్రకారం.. ఈసీ సమావేశానికి.. ఏజీఎంకు మధ్య 21 రోజుల వ్యవధి తప్పనిసరి. బుధవారం కానీ గురువారం కానీ ఎగ్జిక్యూటివ్ సమావేశం జరిగితే.. దానికి 21 రోజుల లోపు సర్వసభ్య సమావేశం జరిగే వీలుంది. అందులో మా ఎన్నికల డేట్ ను డిసైడ్ చేసే వీలున్నట్లు చెబుతున్నారు.

ఇప్పటివరకు అందుతున్న సమాచారం ప్రకారం.. ‘మా’ ఎన్నికల్ని సెప్టెంబరులో నిర్వహించాలని భావిస్తున్నట్లుగా చెబుతున్నారు. అయితే.. కొవిడ్ థర్డ్ వేవ్ అప్పటికి ప్రారంభం కాకపోతే మాత్రమే ఎన్నికలు ఇప్పుడు అనుకున్నట్లుగా జరిగే వీలుంది. అనుకోని రీతిలో ఆగస్టులో కొవిడ్ కేసులు పెద్ద ఎత్తున నమోదైతే మాత్రం.. ఎన్నికల ప్రక్రియకు మరింత ఆలస్యమయ్యే వీలుంది. ఇప్పటివరకు ఉన్న అంచనా ప్రకారం చూస్తే.. సెప్టెంబరు రెండో వారం లోపు నిర్వహించే అవకాశాలే ఎక్కువన్న మాట వినిపిస్తోంది

ఈసారి ‘మా’ ఎన్నికల్లో అధ్యక్ష స్థానానికి ప్రకాశ్ రాజ్ పోటీ చేస్తానని ప్రకటించటం.. ఆ వెంటనే మంచు విష్ణు రంగంలోకి దిగటం.. లోకల్.. నాన్ లోకల్ ఇష్యూ తెర మీదకు రావటం.. దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరగటం.. ప్రకాశ్ రాజ్ తో పాటు ఆయన ప్యానల్ సభ్యులతో కూడిన టీంను ప్రకటించటంతో పాటు.. ఏకంగా ఫిలింఛాంబర్ లో విలేకరుల సమావేశాన్ని నిర్వహించటం లాంటి పరిణామాలు వరుస పెట్టి జరిగాయి. అదే సమయంలో.. జీవిత.. హేమ.. ఇలా పలువురు ‘మా’ ఎన్నికల బరిలోకి దిగుతామన్న ప్రకటనలతో వాతావరణం వేడెక్కింది. ప్రకాశ్ రాజ్ టీం నిర్వహించిన విలేకరుల సమావేశానికి ధీటుగా నరేశ్ మరో మీడియా సమావేశాన్ని నిర్వహించటంతో  900 మంది సభ్యులున్న ‘మా’ ఎన్నికలపై విపరీతమైన హైప్ క్రియేట్ అయ్యింది.

సినీ తారల మధ్య జరిగే ఎన్నికల ఫైట్ కావటంతో అందరిలోనూ ఆసక్తి వ్యక్తమైంది. ఈ క్రమంలో ఒకరిపై ఒకరు చేసుకున్న వ్యాఖ్యలు.. ఎన్నికలపై మరింత ఆసక్తి వ్యక్తమైంది. రెండు.. మూడు రోజుల క్రితం మంచు విష్ణు ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో ‘మా’ ఎన్నికల మీద చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారటం తెలిసిందే. ‘మా’ ఎన్నికలపై విపరీతమైన చర్చ జరుగుతున్న వేళ.. అసలు ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయన్న దానిపై స్పష్టత లేని పరిస్థితి. ఇలాంటివేళ.. ఎన్నికల నిర్వహణపై ప్రస్తుత కమిటీ కీలక నిర్ణయాన్ని తీసుకొని.. ఎన్నికల్ని మరింత ఆలస్యం చేయకుండా వీలైనంత త్వరగా పూర్తి చేయాలన్న యోచనలో ఉన్నట్లుగా చెబుతున్నారు. మరి.. ఇప్పుడు అనుకున్నట్లే ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం.. ఏజీఎంలు అనుకున్నట్లు జరిగితే.. ‘మా’ ఎన్నికలకు వేళాయనట్లేనని చెబుతున్నారు.
Tags:    

Similar News