రూల్ ప్రకారం ఆ డేట్ లోపు ‘మా’ ఎన్నికలు జరగవా?

Update: 2021-08-23 04:30 GMT
కేవలం వెయ్యి కంటే తక్కువ మంది సభ్యులు ఉన్న మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేన్.. సింఫుల్ గా ‘మా’ గా వ్యవహరించే అసోసియేషన్ ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయన్న విషయంపై గడిచిన కొంతకాలంగా హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు జరగని పరిస్థితి. దీంతో.. ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలన్న అంశానికి సంబంధించిన కీలక సమావేశం ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఆన్ లైన్ లో మాత్రమే జరిగిన ఈ సమావేశాన్ని చూస్తే.. ఎన్నికల నిర్వహణ అనుకున్న రీతిలో.. అనుకున్న సమయానికి జరిగే అవకాశం లేదన్నట్లుగా ఉంది.

‘మా’ బైలా ప్రకారం.. సర్వసభ్య సమావేశం జరిగిన 21 రోజుల్లో ఎన్నికల్ని నిర్వహించాల్సి ఉంటుంది. అయితే.. అనుకోని రీతిలో ఉన్న ప్రాక్టికల్ సమస్యలు.. బైలాలో చెప్పినట్లు కాకుండా.. కాస్త ఆలస్యంగా ఎన్నికలు జరిగే వీలుందన్న మాట వినిపిస్తోంది. అయితే.. ఈ సమావేశంలో పాల్గొన్న అందరి మాట.. వీలైనంత త్వరగా ‘మా’ ఎన్నికల కార్యక్రమాన్ని పూర్తి చేయాలన్నదే. అందరూ ఎన్నికల్ని నిర్వహించాలని  కోరుకుంటున్నా.. అనుకోని అంశాలు ఎన్నికల నిర్వహణకు అడ్డు తగులుతున్నాయని చెప్పాలి.

బైలా ప్రకారం చూస్తే.. సర్వసభ్య సమావేశం నిర్వహించిన 21 రోజుల్లో ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. అయితే.. దీనికి కొన్ని ఇబ్బందులు ఉన్నాయనిచెబుతున్నారు. సభ్యులు కోరిన డేట్లలో చూస్తే.. సెప్టెంబరు 12న పూర్తి చేయొచ్చు. కానీ.. అంత త్వరగా ఎన్నికలు జరిగే అవకాశం లేదంటున్నారు. అయితే.. దాని తర్వాత ఆప్షన్ సెప్టెంబరు 19గా చెబుతున్నారు. అయితే.. ఆ రోజు గణేశ్ నిమజ్జనం ఉండే అవకాశం ఉందంటున్నారు. అదే నిజమైతే..ఆ రోజు ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదు. ఎందుకంటే.. ఈసారి మా ఎన్నికలకు పోలీసు బందోబస్తు కూడా భారీగానే ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందంటున్నారు.

దీంతో.. మా ఎన్నికల నిర్వహణ.. ముడి మీద ముడి పడుతూ పీటముడిగా మారిందని చెప్పక తప్పదు. బైలా ప్రకారం 21 రోజుల్లో ఎన్నికల్ని నిర్వహించే అవకాశం లేదని.. మరో ప్రత్యామ్నాయం చూడాలంటున్నారు. ఏమైనా.. ఈసారి ప్రత్యేక పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ఎన్నికల నిర్వహణ అనుకున్న తేదీకి పూర్తి అయ్యే అవకాశం లేదంటున్నారు.
Tags:    

Similar News