ఆ వ్యాఖ్య‌ల‌కు నిర‌స‌న‌గా `మా` ప్రెస్ మీట్!

Update: 2018-03-27 17:49 GMT
ప్ర‌త్యేక హోదా కోసం టాలీవుడ్ సినీ ప‌రిశ్ర‌మ నుంచి ఎవరూ స్పందించ‌డం లేదంటూ టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్ర‌ప్ర‌సాద్ చేసిన వ్యాఖ్య‌లు పెను దుమారం రేపిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో నేప‌థ్యంలో ఓ తెలుగు న్యూస్ చానెల్ లైవ్ డిబేట్ లో పాల్గొన్న‌ పోసాని కృష్ణ ముర‌ళికి - ఆ డిబేట్ నిర్వ‌హిస్తోన్న యాంక‌ర్ కు మ‌ధ్య వాడీవేడీ చ‌ర్చ జ‌రిగిన విష‌యం విదిత‌మే. ఓ ద‌శ‌లో సంయ‌వ‌నం కోల్పోయిన ఆ వ్యాఖ్యాత‌.....సినీ ఇండ‌స్ట్రీని - ఇండ‌స్ట్రీలోని మ‌హిళలు - న‌టీమ‌ణుల‌ను - మ‌హిళా ఆర్టిస్టుల‌ను ఉద్దేశించి తీవ్ర అస‌భ్య ప‌ద‌జాలాన్ని ఉప‌యోగించారు. ఆ త‌ర్వాత అర్ధ‌రాత్రి స‌ద‌రు వ్యాఖ్యాత‌...త‌న వ్యాఖ్య‌ల‌కు క్ష‌మాప‌ణ చెప్పిన‌ట్లు స‌ద‌రు చానెల్ లో స్క్రోలింగ్ వేశారు. అయితే, ఆ క్ష‌మాప‌ణ‌తో సంతృప్తి చెంద‌ని `మా` స‌భ్యులు....ఆ వ్యాఖ్యాత‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. తాజాగా, ఇదే విష‌యంపై `మా` ఆధ్వ‌ర్యంలో ఇండ‌స్ట్రీకి చెందిన ప్ర‌ముఖులంద‌రూ ప్రెస్ మీట్ ను ఏర్పాటు చేశారు. ఆ వ్యాఖ్యాత చేసిన వ్యాఖ్య‌లు త‌మ‌ను ఎంతో క‌ల‌చి వేశాయ‌ని, అత‌డిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని, భ‌విష్య‌త్తులో మ‌రోసారి ఇటువంటివి జ‌ర‌గ‌కుండా చూడాల‌ని మీడియాను కోరారు. తాము, మీడియాకు వ్య‌తిరేకం కాద‌ని, కేవలం త‌ప్పు చేసిన ఆ వ్యాఖ్యాత‌ను శిక్షించాల‌ని మాత్ర‌మే తాము కోరుతున్నామ‌ని అన్నారు.

టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్ర‌ప్ర‌సాద్ - ఆ చానెల్ వ్యాఖ్యాత‌పై మా అధ్య‌క్షుడు శివాజీ మండిప‌డ్డారు. ఇండ‌స్ట్రీకి చెందిన వాని ప‌చ్చి బూతులు తిట్టార‌ని - బాధ్య‌త గ‌ల ప‌దవిలో ఉన్న‌వారు అటువంటి వ్యాఖ్య‌లు చేయ‌డం సిగ్గుచేట‌ని అన్నారు. త‌క్ష‌ణ‌మే వారు త‌మ ప‌ద‌వుల నుంచి త‌ప్పుకోవాల‌ని డిమాండ్ చేశారు. లైవ్ లో టాలీవుడ్ లోని మ‌హిళ‌ల‌ను ప‌చ్చి బూతులు తిట్టి....స్క్రోలింగ్ లో సారీ చెప్ప‌డం ఏమిట‌ని డైరెక్ట‌ర్ హ‌రీశ్ శంక‌ర్ ప్ర‌శ్నించారు. మొద‌టిసారి ఈ త‌ర‌హా వ్యాఖ్య‌ల‌ను లైవ్ లో విన్నాన‌ని - అవి త‌న‌ను ఆశ్చ‌ర్య‌ప‌రిచాయ‌ని అన్నారు. ఆ వ్యాఖ్యాత‌పై స‌ద‌రు చానెల్ క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరారు. తాము ఆ వ్య‌క్తికి మాత్ర‌మే వ్య‌తిరేకం అని - ఆ చానెల్ కు - మిగ‌తా మీడియాకు తాము వ్య‌తిరేకం కాద‌ని స్ప‌ష్టం చేశారు. ఈ మ‌ధ్య కాలంలో టాలీవుడ్ పై కొన్ని యూట్యూబ్ చానెళ్లు - వెబ్ సైట్లు ఇష్ట‌మొచ్చిన‌ట్లుగా ఉన్న‌వీ లేనివీ క‌ల్పించి రాస్తున్నాయ‌ని - త‌మ‌ను అడిగితే వాస్త‌వాల‌ను చెబుతామ‌ని హీరో శ్రీ‌కాంత్ అన్నారు.

మీడియా - సినీ ఇండ‌స్ట్రీ వేరు కాద‌ని - మ‌నమంతా ఒక కుటుంబం అని సీనియ‌ర్ నిర్మాత‌ - ద‌ర్శ‌కుడు త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ అన్నారు. అటువంటి ఇండ‌స్ట్రీ పై అనుచిత వ్యాఖ్య‌లు చేసిన ఆ వ్యాఖ్యాత‌పై ఆ చానెల్ క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని - క్ష‌మాప‌ణ‌లు చెబితే స‌రిపోద‌ని అన్నారు. లైవ్ డిబేట్ల‌లో ఇండ‌స్ట్రీకి చెందిన వారు త‌ప్పుగా మాట్లాడినా, వారిని ఖండించాల‌ని - త‌మ‌లోనూ త‌ప్పులు మాట్లాడేవారున్నార‌ని ఆయ‌న చెప్పారు. మనంద‌రం ఒక‌రి ప‌రువును ఒక‌రు కాపాడుకోవాని, ఇక‌పై స‌భ్య‌త లేకుండా మాట్లాడేవారిని లైవ్ డిబేట్ల‌లో కూర్చోనివ్వ‌వ‌ద్ద‌ని అన్నారు. ఎవ‌రో ఒక‌ యాంక‌ర్, ఒక చానెల్...కొన్ని వెబ్ సైట్లు - కొన్ని చానెళ్లు...రాసిన రాత‌లు - వ్యాఖ్య‌ల వ‌ల్ల సినీ ఇండ‌స్ట్రీలో ప‌నిచేసేవారంతా చెడ్డ‌వార‌నే భావ‌న ప్ర‌జ‌ల్లోకి వెళుతోంద‌ని, ఇకపై అటువంటి బాధ్య‌తార‌హిత‌మైన వ్యాఖ్య‌లు చేయ‌వ‌ద్ద‌ని ద‌ర్శ‌కుడు ఎన్.శంక‌ర్ కోరారు. ఆ చానెల్ వ్యాఖ్యాత బ‌హిరంగ క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు.

ఆరోగ్యాన్ని కూడా లెక్క‌చేయ‌కుండా, అన్ని ర‌కాల ప‌రిస్థితుల‌లో షూటింగ్ కు వెళ‌తామ‌ని, త‌మ వ‌ల్ల వంద‌మందికి ఉపాధి ల‌భిస్తుంద‌నే చిన్న ఆశ‌తోనే ప‌నిచేస్తామ‌ని మంచు ల‌క్ష్మి అన్నారు. అటువంటి ఇండ‌స్ట్రీపై అనుచిత వ్యాఖ్య‌లు చేసిన ఆ వ్యాఖ్యాత పేరు ప‌ల‌క‌డం కూడా త‌న‌కు ఇష్టం లేద‌ని ఆమె ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఇంటికి వెళ్లిన త‌ర్వాత మేము కూడా ఒక‌రికి చెల్లిగా, త‌ల్లిగా, భార్య‌గా ఉంటామ‌ని....ఆ వ్యాఖ్య‌లు త‌మ కుటుంబాల‌ను బాధిస్తాయ‌న్న విష‌యాన్ని గుర్తించాల‌ని కోరారు. ఇటువంటి వ్యాఖ్య‌ల‌ను తీవ్రంగా ఖండిస్తున్నాన‌ని, భ‌విష్య‌త్తులో ఇటువంటివి రిపీట్ అయితే, త‌మ నిర‌స‌న తీవ్ర‌త‌రం చేస్తామ‌ని నిర్మాత సీ.క‌ల్యాణ్ అన్నారు. అటువంటి వ్యాఖ్య‌ల‌ను ఖండించాల్సిన బాధ్య‌త మీడియాకు కూడా ఉంద‌ని, ఆ వ్యాఖ్యాత‌పై ఎటువంటి చ‌ర్య‌లు తీసుకోవాలో మీడియా మిత్రుల‌కు తెలుస‌ని హీరో సుమన్ అన్నారు. ప్ర‌స్తుతం కొన్ని వెబ్ సైట్స‌ - యూట్యూబ్ చానెళ్లు -చానల్లు  రేటింగ్ ల కోసం నీచ‌మైన హెడ్డింగ్స్ పెడుతున్నార‌ని, అటువంటివి మానుకోవాల‌ని సుమ‌న్ కోరారు. జ‌ర్న‌లిస్టులంటే త‌మ‌కు చాలా గౌర‌వ‌మ‌ని, గ‌తంలో మాదిరిగా జ‌ర్న‌లిజం విలువల‌ను పెంపొందించేలా అంద‌రూ కృషి చేయాల‌ని కోరారు. ఇటువంటి ప్రెస్ మీట్ లు నిర్వ‌హించ‌డం ఇదే చివ‌రిసారి కావాల‌ని అంతా కోరారు. చివ‌ర‌గా `మా` స‌భ్యులంద‌రూ క్యాండిల్ మార్చిలో పాల్గొని ఆ వ్యాఖ్యాత వ్యాఖ్య‌ల‌కు నిర‌స‌న తెలిపారు.

Tags:    

Similar News