పాన్ ఇండియాని శాసించిన 4 తెలుగు సినిమాలు..!
పాన్ ఇండియా ట్రెండ్ మొదలైన తర్వాత ప్రతి ఒక్క ఫిలిం మేకర్.. అన్ని భాషల ప్రేక్షకులను అలరించే యూనివర్సల్ అప్పీల్ ఉన్న కథలను తెర మీదకు తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నారు
పాన్ ఇండియా ట్రెండ్ మొదలైన తర్వాత ప్రతి ఒక్క ఫిలిం మేకర్.. అన్ని భాషల ప్రేక్షకులను అలరించే యూనివర్సల్ అప్పీల్ ఉన్న కథలను తెర మీదకు తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నారు. హీరోలంతా ఇతర భాషల్లోనూ మార్కెట్ విస్తరించుకోడానికి ట్రై చేస్తున్నారు. అయితే ఈ ట్రెండ్ కు బాటలు వేసింది తెలుగు చిత్ర పరిశ్రమ అనే చెప్పాలి. 'బాహుబలి' తర్వాతే పాన్ ఇండియా సినిమాల సందడి ఎక్కువైంది. కాకపోతే కేవలం భారీ హంగులనే నమ్ముకోకుండా, ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేసే ఒరిజినల్ కంటెంట్ ను బిగ్ స్క్రీన్ మీదకు తీసుకురావడంలో టాలీవుడ్ దర్శక నిర్మాతలు సక్సెస్ అయ్యారు. అందుకే ఇప్పుడు బాలీవుడ్ జనాలు సైతం మన సినిమాల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూసే పరిస్థితి వచ్చింది.
2024లోనూ ఇండియన్ సినిమాపై టాలీవుడ్ డామినేషన్ స్పష్టంగా కనిపించింది. మన దర్శక హీరోలు తీసిన సినిమాలే పాన్ ఇండియా మార్కెట్‌ని శాసించాయి. ఈ ఏడాది ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక కలెక్షన్స్ సాధించిన టాప్-10 సినిమాల లిస్టు తీసుకుంటే, అందులో నాలుగు తెలుగు చిత్రాలే ఉన్నాయి. వాటిల్లోనూ 1000 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు రాబట్టిన తెలుగు సినిమాలు రెండు ఉండటం విశేషం. బాలీవుడ్ టాప్ గ్రాసర్ గా 'పుష్ప 2' లాంటి తెలుగు డబ్బింగ్ మూవీ నిలిచిందటే, ఉత్తరాదిలో మన ఆధిపత్యం ఎలా కొనసాగిందనేది స్పష్టం అవుతుంది. సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ మాటల్లో చెప్పాలంటే ఇది పాన్ ఇండియా కాదు.. 'తెలుగు ఇండియా'.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో తెరెక్కిన ''పుష్ప 2: ది రూల్'' సినిమా ఈ ఏడాది బాక్సాఫీస్ ను రూల్ చేసింది. ఇంకా ఈ మూవీ ర్యాంపేజ్ కొనసాగుతూనే ఉంది. 11 రోజుల్లోనే 1400 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసిన ఈ చిత్రం.. తాజాగా 1500 కోట్ల క్లబ్ లో చేరినట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇక నార్త్ సర్క్యూట్స్ లో పుష్పరాజ్ హిస్టరీ క్రియేట్ చేస్తున్నాడు. సక్సెస్ ఫుల్ గా థర్డ్ వీక్ లో ఎంటర్ అయిన ఈ సినిమా.. హిందీలో 700 కోట్ల నెట్ కలెక్షన్స్ దిశగా దూసుకుపోతోంది. ఫైనల్ రన్ ముగిసే నాటికి 'పుష్ప 2' సినిమా 'బాహుబలి 2' రికార్డ్స్ ను బ్రేక్ చేసే అవకాశాలు లేకపోలేదని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ''కల్కి 28988 AD'' సినిమా ఈ ఏడాది బ్లాక్ బస్టర్ సినిమాల్లో రెండో స్థానంలో నిలిచింది. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ సోషియో ఫాంటసీ సైన్స్ ఫిక్షన్ మూవీ.. వరల్డ్ వైడ్ గా 1200 కోట్ల వరకూ కలెక్షన్స్ సాధించింది. ఈ సినిమా విజయంలో ప్రభాస్ తో పాటుగా అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె లాంటి స్టార్స్ భాగం పంచుకున్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ''దేవర పార్ట్-1'' సినిమాతో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. కొరటాల శివ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ యాక్షన్ డ్రామా.. 520 కోట్లకుపైగా కలెక్షన్స్ సాధించి బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటింది. స్టార్ క్యాస్టింగ్ లేకుండా 40 కోట్ల బడ్జెట్ తో తీసిన 'హను-మాన్' చిత్రం 350 కోట్లు వసూళ్లు సాధించి పాన్ ఇండియా వైడ్ గా సంచలనం సృష్టించింది.
పాన్ ఇండియా మార్కెట్ లో వసూళ్ల వర్షం కురిపించిన తెలుగు చిత్రాలతో పాటుగా, బాక్సాఫీస్ దగ్గర బొక్కబోర్లా పడ్డ సినిమాలు కూడా ఈ ఏడాదిలో కొన్ని ఉన్నాయి. మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన 'ఆపరేషన్ వాలెంటైన్', 'మట్కా' లాంటి రెండు పాన్ ఇండియా సినిమాలు డిజాస్టర్లుగా మారాయి. పెద్ద ఎత్తున ప్రమోట్ చేసిన రామ్ పోతినేని 'డబుల్ ఇస్మార్ట్' మూవీని ఆడియన్స్ రిజెక్ట్ చేసారు. అయినా సరే వెనక్కి తగ్గే పరిస్థితి లేదు. వచ్చే ఏడాది కూడా టాలీవుడ్ నుంచి అనేక పాన్ ఇండియా సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. 'గేమ్ ఛేంజర్', 'తండేల్', 'హరి హర వీరమల్లు', 'ది రాజాసాబ్', 'మిరాయ్', 'ఘాటీ', 'కన్నప్ప', 'విశ్వంభర', 'హిట్ 3', 'అఖండ 2', 'VD 12', 'SYG - సంబరాల ఏటిగట్టు', OG లాంటి మరికొన్ని పాన్ ఇండియా చిత్రాలు విడుదల కానున్నాయి. మరి వీటిల్లో ఏవేవి సంచలనాలు సృష్టిస్తాయో చూడాలి.