మూవీ రివ్యూ: 'మహర్షి'

Update: 2019-05-09 08:39 GMT
చిత్రం : 'మహర్షి'

నటీనటులు: మహేష్ బాబు - పూజా హెగ్డే - అల్లరి నరేష్ - జగపతిబాబు - ప్రకాష్ రాజ్ - జయసుధ - వెన్నెల కిషోర్ తదితరులు
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్
ఛాయాగ్రహణం: కె.యు.మోహనన్
రచన: వంశీ పైడిపల్లి - హరి - సాల్మన్
నిర్మాతలు: దిల్ రాజు - అశ్వినీదత్ -  ప్రసాద్ వి.పొట్లూరి - పరమ్ వి.పొట్లూరి
స్క్రీన్ ప్లే - దర్శకత్వం: వంశీ పైడిపల్లి

సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రం ‘మహర్షి’. హీరోగా అతడికిది 25వ సినిమా. ఈ సినిమాలో ఆకర్షణలకు లోటే లేదు. దీనిపై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో చెప్పాల్సిన పని లేదు. ఈ రోజే ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘మహర్షి’ ఆ అంచనాలు అందుకుందా? చిత్ర బృందం చెబుతున్నట్లు మహేష్ కెరీర్లో ఇది నిజంగానే మైలురాయిలా నిలిచిపోయేలా ఉందా? చూద్దాం పదండి.

కథ:

రిషి కుమార్ (మహేష్ బాబు) హైదరాబాద్ లో ఒక మధ్య తరగతి కుటుంబంలో పుట్టిన కుర్రాడు. తన తండ్రికి ఎదురైన వైఫల్యాలు - అవమానాలు చూసి.. తాను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ అలా బతక్కూడదని.. గొప్ప స్థాయికి ఎదగాలని ఆశపడే రిషి.. ఎంటెక్ చదవడం కోసం వైజాగ్ వెళ్తాడు. అక్కడ అతడికి పూజ (పూజా హెగ్డే), రవి (అల్లరి నరేష్) పరిచయమై స్నేహితులుగా మారతారు. వీరితో బంధం బలపడుతుంది. కానీ కొన్ని కారణాలతో ఆ ఇద్దరితోనూ రిషి బంధం తెంచుకుంటాడు. చదువు పూర్తయ్యాక తన లక్ష్యం కోసం అమెరికాకు వెళ్లిన రిషి.. అక్కడ గొప్ప స్థాయికి ఎదుగుతాడు. ప్రపంచంలోనే అతి పెద్దదైన కంపెనీకి సీఈవో అవుతాడు. ఆ స్థాయిలో ఉన్నవాడు.. ఉన్నట్లుండి గోదావరి జిల్లాలోని రామవరం గ్రామానికి వచ్చి.. ఓ సమస్య మీద పోరాడాల్సి వస్తుంది. మరి రిషి అక్కడికి రావడానికి కారణాలేంటి? తన పోరాటంలో అతను గెలిచాడా లేదా? అన్నది మిగతా కథ.

కథనం - విశ్లేషణ:

‘మహర్షి’ మహేష్ బాబుకు 25వ సినిమా. ఇలాంటి ల్యాండ్ మార్క్ ఫిలిం అనేసరికి ప్రేక్షకులకు చాలా పెద్ద సందేశం ఇవ్వాలని చాలా గట్టిగా ఫిక్సయినట్లున్నారు. హీరో పాత్రను ఒక రోల్ మోడల్ లాగా తీర్చిదిద్దారు. ఒక మామూలు కుటుంబంలో పుట్టిన హీరో ప్రపంచంలోనే అతి పెద్ద కార్పొరేట్ కంపెనీకి సీఈవో అవుతాడు. ఇదో పెద్ద సక్సెస్ స్టోరీ. ఈ క్రమంలో మనకు లెెక్కలేనన్ని సందేశాలు కనిపిస్తాయి. వినిపిస్తాయి. ఇక హీరోకు కుచేలుడి లాంటి ఫ్రెండుంటాడు. వీళ్ల మధ్య బంధాన్ని ఎస్టాబ్లిష్ చేసే క్రమంలో స్నేహం గురించి పెద్ద సందేశం ఉంటుంది. హీరో అమెరికాలో కంపెనీ బాధ్యతలు పక్కన పెట్టి ఆంధ్రాలోని ఒక పల్లెటూరికి వస్తాడు. అక్కడి రైతు సమస్యల మీద పోరాడతాడు. ఇందులోనూ ఒక పెద్ద సందేశం ఉంటుంది. దాదాపు మూడు గంటల నిడివి ఉన్న సినిమాలో ఇలా లెక్కలేనన్ని సందేశాలు.. కావాల్సినన్ని క్లాసులన్నమాట. ఏదైనా కూడా ఒక దశ వరకు బాగానే ఉంటుంది. డోస్ మరీ ఎక్కువైపోతోనే వస్తుంది సమస్య. ‘మహర్షి’లో ఎంటర్ టైన్ మెంట్ ఉంది. సెంటిమెంటు పండింది. ఫ్యాన్ మూమెంట్స్ ఉన్నాయి. ఇలా ఆకట్టుకునే అంశాలు చాలానే ఉన్నప్పటికీ.. సినిమా అంతటా కూడా ఏదో ఒక ‘మెసేజ్’ ఇవ్వాలన్న ప్రయత్నమే ప్రేక్షకుడిని అలసి సొలసిపోయేలా చేస్తుంది. ఎక్కడికక్కడ ఎంగేజింగ్‌ గా అనిపించినప్పటికీ ఈ క్లాసుల డోస్ ఎక్కువైపోవడం.. సుదీర్ఘమైన నిడివి.. అనేక పాత సినిమాల్ని తలపించే కథాకథనాలు - సన్నివేశాల కారణంగా.. ‘మహర్షి’ జస్ట్ వాచబుల్ అనిపిస్తుంది తప్ప.. చిత్ర బృందం చెప్పుకున్నట్లు ‘ల్యాండ్ మార్క్ ఫిలింగా మాత్రం నిలవలేకపోయింది.

‘మహర్షి’ ప్రోమోలు ఏవి చూసినా ఏదో ఒక సినిమా స్ఫూర్తి ఉన్న భావన కలిగింది. మహేష్ నటించిన పాత సినిమాల ఛాయలు కొట్టొచ్చినట్లు కనిపించాయి. ఇక సినిమా చూస్తున్నపుడైతే.. వెతికి వెతికి ఫలానా సినిమాలో మాదిరి అంటూ పోల్చుకోవడానికే సరిపోతుంది. ఫ్రేమ్స్ ఫ్రేమ్స్ అలాగే వేరే సినిమాల్ని గుర్తుకు తెస్తుంటాయి. కాలేజ్ ఎపిసోడ్ లో చాలా వరకు ‘3 ఇడియట్స్’ స్ఫూర్తి కనిపిస్తే.. హీరో పల్లెటూరికి వచ్చి అక్కడి వాళ్ల కోసం పోరాడే వైనం ‘శ్రీమంతుడు’ను గుర్తుకు తెస్తుంది. రైతు సమస్యలపై మీడియా ముందు స్పీచ్ ఇస్తుంటే ‘ఖైదీ నంబర్ 150’ ఛాయలు కనిపిస్తాయి. ఇవి చాలవన్నట్లు చాలా చోట్ల మహేష్ బాబు లుక్స్.. అతడి హావభావాలు సైతం వేరే సినిమాల్ని గుర్తుకు తెస్తాయి. దేవిశ్రీ ప్రసాద్ పాటలు - నేపథ్య సంగీతం సైతం అతడి గత సినిమాల్ని తలపిస్తుంటాయి. దర్శకుడు వంశీ పైడిపల్లి స్క్రిప్టు దశలో ఒక్కో ఎపిసోడ్ రాసుకుంటున్నపుడు ఒక్కో సినిమాను రెఫరెన్సుగా తీసుకున్నాడేమో అనిపిస్తుంది. కాకపోతే ప్రతి ఎపిసోడ్లోనూ ఏదో ఒక ఆకర్షణ అయితే ఉండేలా చూసుకున్నాడు. సినిమా మొత్తంలో ఎక్కడా కూడా ఫ్రస్టేట్ చేసే సన్నివేశాలైతే లేవు. కొత్తగా అనిపించకపోయినా.. ఎంగేజింగ్ గా అనిపించే సన్నివేశాలు సినిమాను అలా అలా నడిపించేస్తాయి.

‘మహర్షి’లో ఎక్కువ ఎంటర్ టైనింగ్‌ గా - ఎంగేజింగ్‌ గా - రిఫ్రెషింగ్‌ గా అనిపించేది కాలేజ్ ఎపిసోడే. మహేష్ లుక్‌ తో పాటు బాడీ లాంగ్వేజ్ కూడా మార్చుకుని నటించిన ఈ ఎపిసోడ్ ఎంటర్ టైన్ చేస్తుంది. కాలేజీ నేపథ్యం అనగానే ఎంటర్ టైన్ మెంట్‌ కు స్కోప్ దక్కింది. ఉన్నంతలో ప్రతి సన్నివేశాన్ని సరదాగా నడిపించేశాడు వంశీ. యూత్ బాగా కనెక్టయ్యే ఈ ఎపిసోడ్ వేగంగా సాగిపోతుంది. ఇక్కడి వరకు మహేష్ కొత్తగా కనిపిస్తాడు. అతడిని అలా చూస్తూ ఉండాలనిపిస్తుంది. కానీ దానికి ముందు తర్వాత చాలా వరకు సూట్లలో.. ఫార్మల్ డ్రెస్సుల్లో చాలా మొనాటనీ తెప్పించేస్తాడు మహేష్. ప్రథమార్ధంలో కాలేజీ ఎపిసోడ్‌ ను మినహా వ్యవహారమంతా బోరింగ్‌ గా అనిపిస్తుంది. చాలా వరకు ఫ్లాష్ బ్యాకే అక్రమించిన ఫస్టాఫ్ లో కథేమీ ముందుకు కదలదు. ‘మహర్షి’లో అసలు కథంతా ద్వితీయార్ధంలోనే ఉంది. కానీ కథను చెప్పాల్సిన చోట వంశీ చాలా బలహీనంగా కనిపించాడు. ఓ కార్పొరేట్ కంపెనీకి వ్యతిరేకంగా పోరాడుతున్న తన ఫ్రెండుకు హీరో అండగా నిలిచి అతడి పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లే ఎపిసోడ్ నాటకీయంగా - కొంచెం కృత్రిమంగా కూడా అనిపిస్తుంది. ఇక్కడ హీరో కార్య క్షేత్రంలోకి దిగడానికి చాలా సమయం పడుతుంది.

ఒక సంకల్పంతో ఊరికి వచ్చే హీరో వెంటనే రంగంలోకి దిగి ఏమీ చేయకుండా కాలక్షేపం చేస్తున్నట్లుగా అనిపిస్తుంది. అతడి పాత్ర ప్యాసివ్‌ గా తయారవుతుంది.  ఏదో కథ దానికదే తోచినట్లు ముందుకెళ్లిపోతున్నట్లుగా అనిపిస్తుంది. హీరో రంగంలోకి దిగి ఏదో చేసే వరకకు వచ్చే సన్నివేశాలు ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెడతాయి. అలాగని అల్లరి నరేష్ పాత్ర అయినా మెరిసిందా అంటే అదీ లేదు. చాలా సేపు చోద్యం చూసిన హీరో ప్రి క్లైమాక్స్ దగ్గర కొంచెం చైతన్యం తెచ్చుకుంటాడు. సినిమా ముగింపు దశకు వచ్చింది ఇక మనం ఏదో ఒకటి చేయాలన్నట్లుగా పైకి లేస్తాడు. అక్కడి నుంచి కథనం కాస్త పరుగులు పెడుతుంది. రైతు సమస్యల మీద హీరో ప్రెస్ మీట్ సీన్ ఆకట్టుకుంటుంది. ఉద్వేగాలు రేకెత్తిస్తుంది. విలన్ పాత్రను తేల్చిపడేయడంతో ముగింపు ఆశించిన స్థాయిలో లేదు. ‘ఇదే కదా ఇదే కదా నీ కథ’ పాట పడకపోయి ఉంటే.. క్లైమాక్స్ తేలిపోయేదే. ఎమోషనల్‌ గా సాగే ఆ పాటతో ముగింపు దగ్గర మంచి ఫీలింగ్ కలుగుతుంది. సినిమా చివరికొచ్చేసరికి.. ఈ కథ ఎక్కడ మొదలైంది.. ఎలా ముందుకు సాగింది.. ఎలా ముగిసింది అన్నది తలుచుకుంటే చాలా సుదీర్ఘమైన ప్రయాణం చేసిన భావన కలుగుతుంది. సినిమా కాకుండా.. ‘సినిమాలు’ చూసిన భావన కలుగుతుంది. ‘మహర్షి’లో అన్ని వర్గాల ప్రేక్షకులకూ ఆకట్టుకునే అంశాల్ని ప్యాకేజీల తరహాలో ప్రెజెంట్ చేసినట్లు అనిపిస్తుంది. అలా కాకుండా ఒక వ్యక్తి ప్రయాణాన్ని సూటిగా మనసుకు తాకేలా.. బిగితో - ఎమోషన్‌ తో చెప్పడంలో మాత్రం వంశీ పైడిపల్లి విఫలమయ్యాడు.

నటీనటులు:

మహేష్ బాబు మూడు వేరియేషన్లు ఉన్న పాత్ర చేశాడు ‘మహర్షి’లో. ఐతే ఒక్క కాలేజీ ఎపిసోడ్ లో మాత్రమే అతను వైవిధ్యం చూపగలిగాడు. అభిమానుల్ని ఆద్యంతం అలరించాడు. కానీ పెర్ఫామెన్స్ పరంగా అతడికి పరీక్ష పెట్టే సినిమా ఏమీ కాదిది. అతను బాగా చేయలేదని కాదు. పాత్రకు న్యాయం చేయలేదని కాదు.. కానీ చాలా చోట్ల మహేష్ కొత్తగా చేసిందేమీ లేదనిపిస్తుంది. చాలాచోట్ల మహేష్ లుక్స్ - హావభావాలు - స్క్రీన్ ప్రెజెన్స్ అతడి గత సినిమాల్ని గుర్తుకు తెస్తాయి. ఒక మొనాటనస్ ఫీలింగ్ తెప్పిస్తాయి. హీరోయిన్ పూజా హెగ్డే గురించి అంత ప్రత్యేకంగా చెప్పడానికేమీ లేదు. మొదట్లో ఆమె పాత్ర రెగ్యులర్ హీరోయిన్ క్యారెక్టర్లకు భిన్నంగా ఉండబోతున్న సంకేతాలు కనిపిస్తాయి. కానీ తర్వాత అది చాలా సాధారణంగా తయారవుతుంది. నిలకడ లేని ఈ పాత్రతో డిస్కనెక్ట్ అయిపోతాం. కథలో కీలకమైన పాత్రలో అల్లరి నరేష్ రాణించాడు. రవి పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. అతడి కెరీర్ లో గుర్తుండిపోయే పాత్ర ఇది. ఐతే ద్వితీయార్ధంలో ఒక దశలో చాలా ప్రాధాన్యంతో కనిపించే ఈ క్యారెక్టర్.. తర్వాత సైడ్ అయిపోతుంది. దీనికి సరైన ముగింపు ఇవ్వలేదు. విలన్ పాత్రలో జగపతిబాబు చాలా రొటీన్ గా అనిపిస్తాడు. ఆయన ప్రత్యేకతను చాటుకునే అవకాశమే లేకపోయింది. ప్రకాష్ రాజ్ ఉన్నంతలో బాగానే చేసినా.. పాత్ర పరిధిని బాగా తగ్గించేశారు. రావు రమేష్ - సాయికుమార్ - రాజీవ్ కనకాల తమ పరిధిలో బాగానే చేశారు. వెన్నెల కిషోర్ పాత్ర ఆశించిన స్థాయిలో లేదు.

సాంకేతికవర్గం:

సినిమా ముగింపులో వచ్చే ‘ఇదే కదా ఇదే..’ పాట వింటుంటే.. ఒకప్పటి దేవిశ్రీ ప్రసాద్ గుర్తుకు వస్తాడు. అతడి గత వైభవం కళ్ల ముందు మెదులుతుంది. ఇలాగే మిగతా పాటలూ ఉండి ఉంటే ‘మహర్షి’ స్థాయి పెరిగేది. ఈ చివరి పాట కాకుండా ‘పదరా పదరా’ మాత్రమే కొంచెం ప్రత్యేకంగా అనిపిస్తుంది. మిగతా పాటలన్నీ సినిమాకు ఏ రకంగానూ ప్లస్ కాలేకపోయాయి. పాటలు వింటుంటే వేరే సినిమాలు గుర్తుకు రావడం సహజమే కానీ.. నేపథ్య సంగీతం వింటుంటే కూడా ఇలాంటి ఫీలింగ్ కలిగితే ఏం చెబుతాం? కేయూ మోహనన్ ఛాయాగ్రహణం ఉన్నత స్థాయిలో కనిపిస్తుంది. విజువల్స్ ఆద్యంతం ఆకట్టుకుంటాయి. కాకపోతే ఇలాంటి ఫ్రేమ్స్ అన్నీ ఆల్రెడీ మహేష్ చేసిన కొన్ని సినిమాల్లో చూశాం. నిర్మాణ విలువల గురించి చెప్పేదేముంది? ప్రతి సన్నివేశంలోనూ రిచ్ నెస్ కనిపిస్తుంది. మరో ఇద్దరు రచయితలతో కలిసి వంశీ తీర్చిదిద్దిన కథలో కొత్తదనం లేకపోయినా.. ఒక ఉదాత్తత అయితే ఉంది. కానీ దాన్ని తెర మీద ప్రెజెంట్ చేయడంలో వంశీ పూర్తి స్థాయిలో విజయవంతం కాలేకపోయాడు. ప్రీచీ నరేషన్ ఒక దశ దాటాక అసహనం కలిగిస్తుంది. చాలా చోట్ల డైలాగులు వింటుంటే పర్సనాలిటీ డెవలప్ మెంట్ క్లాసుల్లో కూర్చున్న ఫీలింగ్ కలుగుతుంది. ఏ సన్నివేశానికి ఆ సన్నివేశాన్ని డీల్ చేయడంలో వంశీ పనితనం కనిపిస్తుంది కానీ.. ఓవరాల్ గా కథను ఒక తీరుగా - మనసుకు హత్తుకునేలా అతను చెప్పలేకపోయాడు.

చివరగా: మహర్షి.. ఒక సుదీర్ఘమైన ప్రయాణం

రేటింగ్-2.5/5


Disclaimer : This Review is An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre
Tags:    

Similar News