షూటింగ్ షెడ్యూల్ ఎందుకు మహేషూ?

Update: 2017-11-29 07:09 GMT
ప్రస్తుతం సినిమాల గురించి ప్రచారం చేసుకోవడం చాలా ముఖ్యం. కొన్నేళ్ల ముందు మాదిరిగా.. రిలీజ్ కి ముందు హంగామా చేసేస్తే సరిపోదు. ప్రాజెక్టు అనుకున్న దగ్గర నుంచి ఏదో ఒక విషయం చెబుతూ సినిమాకు పబ్లిసిటీ చేసుకుంటేనే.. చివరకు మార్కెట్లో రేటు గిట్టుబాటు అవుతుంది.

అలాగని సినిమాకి సంబంధించిన డీటైల్స్ చెప్పేస్తే.. జనాలకు థ్రిల్ పోయి ఆసక్తి తగ్గిపోతుంది. అందుకే ఏదో ఒక చిత్ర విచిత్రమైన ప్రకటనలు చేస్తూ ప్రమోషన్స్ చేసుకుంటున్నారు సినీ జనాలు. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. భరత్ అనే నేను అంటూ టైటిల్ ఫిక్స్ చేశారనే టాక్ ఉంది కానీ.. ఇంకా అఫీషియల్ కన్ఫర్మేషన్ లేదు. ఇప్పటికే కొన్ని షెడ్యూల్స్ షూటింగ్ పూర్తి కాగా.. ఇప్పుడు నవంబర్ 30 నుంచి డిసెంబర్ 7 వరకూ తొలి షెడ్యూల్ హైద్రాబాద్ లోను.. డిసెంబర్ 10 నుంచి 25వరకూ తమిళనాడులోని కరైకుడిలోను షూటింగ్ చేయనున్నట్లు నిర్మాతలు ఓ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. అంతే కాదు.. 2018 ఏప్రిల్ 27న రిలీజ్ అంటూ మరోసారి నొక్కి వక్కాణించారు కూడా.

ఇలా షూటింగ్ షెడ్యూల్ గురించి పోస్టర్స్ వేయడం విచిత్రమైన విషయం. సూపర్ స్టార్ లాంటి హీరో సినిమా అంటే షూటింగ్ చూసేందుకు ఫ్యాన్స్ ఆసక్తి చూపడంలో ఆశ్చర్యం లేదు. ఇప్పుడు షూటింగ్ షెడ్యూల్ ఇవ్వడం అంటే.. అక్కడికి వచ్చి హంగామా చేయండి అంటూ అభిమానులకు హింట్ ఇవ్వడమా అంటున్నారు సినీ జనాలు. వీళ్ల ఎక్స్ పెక్టేషన్ కరెక్ట్ అయి ఫ్యాన్స్ వచ్చి హంగామా చేస్తే.. దాన్ని అడ్డం పెట్టుకుని ఛానల్స్ లో ఫ్రీగా మరింత ప్రచారం కొట్టేసే ప్లాన్ వేశారని జోకులు కూడా వినిపిస్తున్నాయి. అయినా..  చిన్న సినిమాలకు ఇలాంటి చీప్ పబ్లిసిటీలు అవసరం కానీ.. మహేష్ బాబు ఎందుకో అనిపించడం లేదూ!
Tags:    

Similar News