ఒక్కోసారి ఓవర్ హైప్ కూడా నష్టం కలిగిస్తుంది బాసూ..!

Update: 2022-08-02 05:32 GMT
సినిమాకు భారీ హైప్ తీసుకొచ్చి మంచి ఓపెనింగ్స్ రాబట్టాలంటే దూకుడుగా ప్రమోషన్స్ చేయాల్సిన అవసరముంది. పాండమిక్ తర్వాత జనాలను థియేటర్లకు రప్పించడానికి అంతకు మించి కష్టపడాల్సి వస్తోంది. అందుకే ఇటీవల కాలంలో మేకర్స్ అంతా జోరుగా ప్రచార కార్యక్రమాలు నిర్వహించే మార్గాన్ని ఎంచుకుంటున్నారు.

అయితే ఒక్కోసారి ఓవర్ హైప్ అనేది సినిమాకు నష్టం కలిగించే అవకాశం ఉంది. ఈ విషయం అనేక సందర్భాల్లో ప్రూవ్ అయింది. రిలీజ్ కు ముందు ఊదరగొట్టిన చిత్రాలు.. తీరా థియేటర్లలోకి వచ్చిన తర్వాత పేలవమైన కంటెంట్ తో ఉసూరుమనిపించడం గతంలో మనం చూశాం. అందుకే కొందరు మేకర్స్ అగ్రిసివ్ గా ప్రమోషన్స్ చేసినప్పటికీ.. అంచనాలు మించకుండా చూసుకుంటూ జాగ్రత్త వహిస్తుంటారు.

ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చిందంటే.. రిలీజ్ కు రెడీ అయిన ఓ సినిమాకు సంబంధించిన ప్రచార కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. డేట్ దగ్గర పడుతుండటంతో హీరో అండ్ టీమ్ ప్రమోషన్స్ స్పీడ్ పెంచారు. మామూలుగానే తన సినిమాల ప్రమోషన్స్ విషయంలో ఎప్పుడూ దూకుడుగా ఉండే హీరో.. ఈసారి ప్రతిష్టాత్మక చిత్రానికి రెట్టింపు ఉత్సాహంతో ముందుకు సాగుతున్నాడు.

ఓ క్రేజీ డైరెక్టర్ తో చేసిన ఈ ప్రాజెక్ట్ పై సదరు హీరో చాలా నమ్మకంగా ఉన్నాడు. ప్రతీ ఇంటర్వ్యూలో ఈ విషయం పై తీవ్ర విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ వస్తున్నాడు. దీనికి తగ్గట్టుగానే ఇప్పటి వరకు విడుదల చేయబడిన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేసింది. దీన్ని రిలీజ్ వరకూ సజీవంగా ఉంచడానికి అతను బాగా కష్టపడుతున్నాడు. ఈ క్రమంలో హీరో అనవసరమైన ఒత్తిడిని తీసుకుంటున్నారనిపిస్తోంది.

మరికొన్ని రోజుల్లో భారీ ఎత్తున ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా గురించి ఇటీవల హీరో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఇది హిట్టు కొట్టకపోతే నేను చాలా గందరగోళానికి గురవుతాను. అలాంటిదేదైనా జరిగితే జడ్జిమెంట్ పై అనుమానం కలుగుతుంది. ఎందుకంటే ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందనే నమ్మకం ఉందంటూ ధీమా వ్యక్తం చేశాడు.

గతంలోనూ అతను పలు సినిమాల విషయంలో ఇలానే స్టేట్మెంట్స్ ఇచ్చాడు. రిజల్ట్ పట్ల చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. అయితే కొన్ని సినిమాలు దాన్ని నిరూపిస్తే మరికొన్ని మాత్రం అతని నమ్మకాన్ని వమ్ము చేశాయి. ముఖ్యంగా భారీ హైప్ క్రియేట్ చేసిన చివరి చిత్రం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా మారింది. అయినప్పటికీ ఇప్పుడు తన కొత్త సినిమా విడుదలకు ముందే అతి విశ్వాసాన్ని ప్రదర్శిస్తున్నాడు.

విడుదలకు ముందే సినిమాకు భారీ హైప్ ను తీసుకురావడానికి హీరో తన వంతు ప్రయత్నం చేస్తున్నాడని స్పష్టంగా తెలుస్తుంది. సినిమా ఫలితాలను ఎవరూ అంచనా వేయలేదు. అయితే ఈ మూవీ ప్లాప్ అయితే తాను చాలా కన్ఫ్యూజన్ లో ఉంటానని.. తన జడ్జిమెంట్ పై అనుమానం కలుగుతుందని అనడం.. అతను అనవసరమైన ఒత్తిడిని తీసుకుంటున్నాడని అనిపిస్తోంది.

తన సినిమాకు కావాల్సిన హైప్ తీసుకురావడం వరకూ ఓకే కానీ.. ఓవర్ హైప్ కోసం అంత ఒత్తిడి తీసుకోవడం మంచిది కాదని నెటిజన్లు సూచిస్తున్నారు. ఏదేమైనా ఈ సినిమా విజయం హీరోకి ఎంతో అవసరం. దీంతో నెక్స్ట్ లెవల్ కు వెళ్లాలని ప్లాన్ చేసుకున్నాడు. దీనికి తగ్గట్టుగానే తన సినిమా పట్ల చాలా నమ్మకంగా ఉన్నాడు. మరి ఈ మూవీ అతనికి ఎలాంటి సక్సెస్ అందిస్తుందో చూడాలి.
Tags:    

Similar News