మూవీ రివ్యూ : మామ మంచు అల్లుడు కంచు

Update: 2015-12-26 02:30 GMT
చిత్రం : మామ మంచు అల్లుడు కంచు

నటీనటులు: మోహన్ బాబు - అల్లరి నరేష్ - రమ్యకృష్ణ - మీనా - పూర్ణ - వరుణ్ సందేశ్ - ఆలీ - సోనియా - జీవా తదితరులు
ఛాయాగ్రహణం: బాలమురుగన్
సంగీతం: కోటి-అచ్చు-రఘు కుంచె
మాటలు: శ్రీధర్ సీపాన
నిర్మాత: మంచు విష్ణు
స్క్రీన్ ప్లే - దర్శకత్వం: శ్రీనివాస్ రెడ్డి

మోహన్ బాబు-అల్లరి నరేష్.. ఈ కాంబినేషన్లో ఓ సినిమా వస్తుందని ఎవ్వరూ అనుకోలేదు. సినిమాలు చేయడమే తగ్గించేసిన మోహన్ బాబు.. ఎప్పుడైనా చేసినా తన కొడుకులతోనే జత కడుతున్నారు. అలాంటాయన నరేష్ కాంబినేషన్లో చేసిన ‘మామ మంచు అల్లుడు కంచు’ టైటిల్ దగ్గర్నుంచే జనాల్ని ఆకర్షించింది. కామెడీ సినిమాలు తీయడంలో దిట్ట అయిన శ్రీనివాసరెడ్డి వీళ్లిద్దరి కాంబినేషన్ లో తీసిన సినిమా కావడం ఆసక్తి మరింత పెరిగింది. అనేక ప్రత్యేకతలతో ఆకర్షించిన ఈ మామా అల్లుళ్ల కథ ప్రేక్షకుల్ని ఏమాత్రం ఎంటర్ టైన్ చేసిందో చూద్దాం.

కథ:

మంచు భక్తవత్సలం నాయుడు (మోహన్ బాబు)కు ఇద్దరు భార్యలు. ఒకరికి తెలియకుండా ఒకరిని మెయింటైన్ చేస్తుంటాడు. ఐతే తాను చేసిన ఓ పొరబాటు వల్ల పెద్ద భార్య కొడుకు.. చిన్న భార్య కూతురు కలవబోతున్నారని తెలిసి... కూతుర్ని పక్కదారి పట్టించడానికి బాలరాజు (అల్లరి నరేష్) అనే కంచు లాంటి కుర్రాణ్ని ఏర్పాటు చేసుకుంటాడు భక్తవత్సలం. ఐతే ఆ కంచుగాడు అతడి కూతుర్నే ప్రేమలోకి దింపుతాడు. ఇక అక్కడి నుంచి మామా అల్లుళ్ల మధ్య యవ్వారం మొదలవుతుంది. ఈ యవ్వారం ఎక్కడిదాకా వెళ్లింది? భక్తవత్సలం తన కూతుర్నిచ్చి బాలరాజుకు పెళ్లి చేశాడా లేదా అన్నది మిగతా కథ.

కథనం - విశ్లేషణ:

‘మామ మంచు అల్లుడు కంచు’ సినిమా ద్వితీయార్ధంలో మోహన్ బాబును ఆలీ అడుగుతాడు.. ఇంత మంచి వాళ్లయిన మీరు రెండో పెళ్లి ఎందుకు చేసుకున్నారు అని. ఆ తర్వాత ‘అల్లరి మొగుడు’ సినిమాలోని సన్నివేశాలు రన్ అవుతుండగా మోహన్ బాబు నాలుగైదు నిమిషాల పాటు ఆ సినిమా కథంతా బ్రీఫ్ గా చెబుతాడు. ఈ సీన్ చూస్తే ఓ ఐదు నిమిషాలు ఎలాగోలా కరిగించడానికి ఈ సీన్ పెట్టారేమో అన్న సందేహం కలగక మానదు. ‘అల్లరి మొగుడు’కి ఇది సీక్వెల్ అని చెప్పాలనుకుంటే నేరుగా సినిమా మొదట్లోనే దానికిది కంటిన్యుయేషన్ అంటూ ఓ ముక్క చెప్పేస్తే పోతుంది. కానీ సినిమా ద్వితీయార్ధంలో ఇలా అల్లరి మొగుడులోని సన్నివేశాలు రన్ చేస్తూ అంత పెద్ద రన్నింగ్ కామెంట్రీ ఇవ్వాల్సిన పని లేదు.

‘అల్లరి మొగుడు’ సినిమాను ఇప్పుడు చూసినా మనకు ఎంగేజింగ్ గా అనిపించొచ్చు కానీ.. ఓ మరాఠీ కథను తీసుకుని ‘అల్లరి మొగుడు’కి కంటిన్యుయేషన్ అన్నట్లు తీసిన ‘కొత్త’ సినిమా ‘మామ మంచు అల్లుడు కంచు’ మాత్రం ‘అల్లరి మొగుడు’ కన్నా పాతగా అనిపిస్తుంది. అంతటి ఔట్ డేటెట్ మూవీ ఇది. మరాఠీ సినిమాలో ఏముందో.. వీళ్లేం జోడించారో కానీ.. ఎప్పుడో వాడి అరగదీసేసిన కన్ఫ్యూజింగ్ కామెడీని నమ్ముకుని రెండున్నర గంటల పాటు విసిగించడం తప్ప మరేమీ చేయలేదు ‘మామ మంచు అల్లుడు కంచు’ టీం.

అల్లుడు కంచు అనగానే ఇది.. ఓ మామకు చుక్కలు చూపించే అల్లుడి కథ ఇదని అర్థమైపోతుంది. ఐతే ఇక్కడ మామకు చుక్కలు కనిపించడం సంగతేమో కానీ.. సినిమా చూస్తున్నంత సేపు మనకు చుక్కలు కనిపించడం మాత్రం ఖాయం. తన కూతుర్ని పక్కదారి పట్టించడానికి ఒక జాదూగాడిని చూడాలని మామ అన్నపుడే తర్వాత రాబోయే రెండు గంటల సినిమా అంతా రీళ్లు రీళ్లుగా గిర్రున తిరుగుతుంది. ఈ విషయంలో దర్శకుడు ఏమాత్రం నిరాశ పరచకుండా మనం అనుకున్నట్లే సినిమాను నడిపిస్తాడు. పాపను హీరో లవ్ లోకి దించే ట్రాక్ కానీ.. ఆ తర్వాత మామను ఇరుకున పెట్టే సన్నివేశాలు కానీ చూస్తుంటే.. టైం మెషీన్లో ఓ ఇరవయ్యేళ్లు వెనక్కేమైనా వెళ్లిపోయామా అన్న డౌట్ కలుగుతుంది. మామా అల్లుళ్ల డ్రామాలు అంత ఔట్ డేడెట్ గా ఉంటాయి మరి. ఇంటర్వెల్ బ్యాంగ్ కూడా సాదాసీదాగా అనిపిస్తుంది.

ప్రథమార్ధంలో మొదలైన టార్చర్ కి ద్వితీయార్ధం కొనసాగింపే తప్ప అక్కడ కూడా చెప్పుకోవడానికేమీ లేదు. హీరో గురించి హీరోయిన్ నిజం తెలుసుకుని అతడి చెంప చెల్లుమనిపించి.. ఇంకో ఐదు నిమిషాలకే అతడి ఒళ్లో వాలిపోవడం.. తన గౌరవాన్ని కాపాడిన అల్లుడి మంచితనం తెలిసి మామ కూడా ఫ్లాట్ అయిపోవడం.. ఇలా సన్నివేశాలన్నీ చాలా సాదాసీదాగా ఏ ఆసక్తి లేకుండా సాగిపోతాయి. చివరి అరగంటలో ఓ మోస్తరుగా వినోదం పండడం కొంచెం ఉపశమనమే కానీ.. ‘కామెడీ’ సినిమాగా చెప్పుకున్న ‘మామ మంచు అల్లుడు కంచు’లో మనస్ఫూర్తిగా నవ్వుకునే ఒక్క సన్నివేశమూ లేదు. మోహన్ బాబు, అల్లరి నరేష్ సహా చాలామంది పెద్ద నటీనటులున్నా.. వాళ్లు కూడా ఏమీ చేయడానికి లేనంత సాదాసీదా కథాకథనాలు ‘మంచు-కంచు’కి పెద్ద మైనస్ అయ్యాయి.

నటీనటులు:

మోహన్ బాబును చాన్నాళ్ల తర్వాత ఓ ఫుల్ లెంగ్త్ రోల్ లో చూడటం మాత్రమే ఆనందం కలిగించే విషయం. కానీ ఆయన తన టాలెంట్ చూపించే అవకాశమే ఈ పాత్ర ఇవ్వలేదు. మోహన్ బాబు కాకుండా ఎవరు చేసినా ఈ పాత్ర ఓకే అనిపిస్తుంది. తన 50వ సినిమాలో ఇంత సాదాసీదా పాత్ర చేసినందుకు అల్లరి నరేష్ ను చూసి జాలి పడటం తప్ప ఏమీ చేయలేం. రమ్యకృష్ణను పూర్తిగా సైడ్ చేసేశారు. మీనాకు కొంచెం ఎక్కువ స్క్రీన్ టైం ఉంది కానీ.. ఆమె నటనా మామూలే. కథాకథనాల్లో ఏమీ లేనపుడు ఇక పాత్రధారులు మాత్రం ఏం చేయగలరు. వరుణ్ సందేశ్ పాత్రను ఏ అనామకుడితో చేయించినా సరిపోయేది. ఆలీ కూడా నవ్వించలేకపోయాడు.

సాంకేతిక వర్గం:

కథాకథనాలకు తగ్గట్లే పాటలు కూడా తయారయ్యాయి. ముగ్గురు సంగీత దర్శకులు కలిసి అందించిన పాటల్లో చెప్పుకోవడానికి ఒక్కటీ లేదు. అన్నీ సిగరెట్ పాటలే. బాలమురుగన్ ఛాయాగ్రహణం పర్వాలేదు. నిర్మాణ విలువలు ఓకే. మాటల్లో కూడా ఏ విశేషం లేదు. శ్రీనివాసరెడ్డి సినిమాల్లో ఏది ఎలా ఉన్నా కామెడీ బాగా డీల్ చేస్తాడని పేరు. ఇందులో ఒక్క సన్నివేశంలోనూ తన ముద్ర చూపించలేకపోయాడు. దర్శకుడి పనితనం ఎక్కడా కనిపించలేదు.

చివరగా: వాయించేసిన మామా అల్లుళ్లు

రేటింగ్: 2/5
Tags:    

Similar News