రీమేకులనే నమ్ముకుంటున్న మంచు విష్ణు..!

Update: 2022-10-19 06:18 GMT
డైలాగ్ కింగ్ మంచు మోహన్ బాబు నట వారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన మంచు విష్ణు హీరోగా ఆశించిన మేర రాణించలేకపోయారనే అనుకోవాలి. 2003 లో 'విష్ణు' సినిమాతో డెబ్యూ ఇచ్చిన హీరో.. ఈ రెండు దశాబ్దాల సినీ కెరీర్ లో పెద్దగా హిట్లు అందుకోలేదు. 20కి పైగా సినిమాల్లో నటించాడు కానీ.. అందులో మూడు నాలుగు చిత్రాలు మాత్రమే విజయాలు అందించాయి.

అయితే మంచు విష్ణు గత కొన్నేళ్లుగా సరైన సక్సెస్ కోసం తీవ్రంగా కష్టపడుతున్నాడు. గతేడాది వచ్చిన 'మోసగాళ్లు' మూవీ నిర్మాతగా మంచు విష్ణు ను సంతృప్తి పరిచినా.. హీరోగా మాత్రం హిట్ ఇవ్వలేకపోయారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ''జిన్నా'' సినిమాపై భారీ ఆశలు పెట్టుకున్నాడు. హోమ్ బ్యానర్ లో రూపొందిన ఈ హారర్ యాక్షన్ ఎంటర్టైనర్ పై చాలా నమ్మకంగా ఉన్నాడు.

ఇషాన్ సూర్య దర్శకత్వంలో తెరకెక్కిన 'జిన్నా' సినిమా తెలుగు హిందీ మలయాళ భాషల్లో ఈ శుక్రవారం విడుదల కాబోతోంది. అయితే ఈ మూవీ తర్వాత మంచు విష్ణు చేయబోయే ప్రాజెక్ట్ పై క్లారిటీ రావడం లేదు.

మంచు విష్ణు తన సూపర్ హిట్ చిత్రం 'ఢీ' కి సీక్వెల్ గా 'ఢీ & ఢీ - డబుల్ డోస్' అనే సినిమాని ప్రకటించారు. శ్రీను వైట్ల దర్శకత్వం వహిస్తారని చెప్పిన ఆ ప్రాజెక్ట్ ఇంతవరకూ సెట్స్ మీదకు వెళ్ళలేదు. దాని గురించి అసలు ఎలాంటి అప్ డేట్స్ లేవు.

మరోవైపు దర్శకుడు ఇటీవల హీరో గోపీచంద్ తో తన తదుపరి సినిమా చేయనున్నట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఈ నేపథ్యంలో మంచు విష్ణు 'D & D' ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయ్యుంటుందని రూమర్స్ వచ్చాయి. ఐతే రీసెంట్ గా విష్ణు ఓ ఇంటర్వ్యూలో శ్రీను వైట్ల డైరెక్షన్ లో సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభం కానుందని చెప్పి స్పష్టత ఇచ్చారు.

అంతేకాదు ఏడు సినిమాల రీమేక్ రైట్స్‌ ని సొంతం చేసుకున్నానని మంచు విష్ణు తెలిపారు. హోమ్ ప్రొడక్షన్ లో రూపొందనున్న ఆ సినిమాలను త్వరలోనే ప్రకటిస్తానని చెప్పారు. అందులో 'ఆండ్రాయిడ్ కట్టప్ప' రీమేక్ లో మోహన్ బాబు ప్రధాన పాత్రలో కనిపించనున్నారని సమాచారం. ఇక ఈ రీమేక్స్ లో ఇతర నటీనటులతో కొన్ని సినిమాలు తీయనున్నామని.. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ సంస్థ నిర్మిస్తుందని విష్ణు తెలిపారు.

ఇటీవల కాలంలో టాలీవుడ్ స్టార్ హీరోలు ఎక్కువగా రీమేక్ చిత్రాల్లో నటిస్తున్న నేపథ్యంలో.. మంచు విష్ణు కూడా రీమేకుల బాట పడుతున్నాడు. గతంలో మోహన్ బాబు మరియు విష్ణు పలు రీమేక్స్ లో నటించినప్పటికీ.. ఒకేసారి 7 ఇతర భాషల సినిమాల రీమేక్ రైట్స్ కొనుగోలు చేయడం అనేది జరగలేదు. మరి ఈ రీమేక్స్ మంచు ఫ్యామిలీకి ఎలాంటి అనుభవాన్నిస్తాయో చూడాలి.

ఇకపోతే 'జిన్నా' సినిమాలో విష్ణు సరసన హాట్ భామలు పాయల్ రాజ్ పుత్ మరియు సన్నీ లియోన్ హీరోయిన్లుగా నటించారు. ప్రముఖ రచయిత కోన వెంకట్ ఈ చిత్రానికి క‌థ‌ - స్క్రీన్ ప్లే అందించ‌డ‌మే కాకుండా క్రియేటివ్ ప్రొడ్యూస‌ర్‌ గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతం సమకూర్చగా.. చోటా కె నాయుడు సినిమాటోగ్రఫీ నిర్వహించారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News