భక్తి సినిమాకు హాలీవుడ్ డైరెక్టరా

Update: 2018-02-06 07:14 GMT
సరిగ్గా వాడుకోవడం తెలియాలే కాని భక్తి కాన్సెప్ట్ తో కమర్షియల్ గా కాసులు రాబట్టుకోవచ్చు అనేది తెలుగు సినిమా చరిత్ర ఎన్నో సార్లు ఋజువు చేసింది, చేస్తూనే ఉంది. ఆనాటి శ్రీ వెంకటేశ్వర మహత్యం మొదలుకొని మధ్యలో వచ్చిన భక్త తుకారాంతో కలిపి నాగార్జున చేసిన అన్నమయ్య దాకా ఎన్నో సినిమాలు బ్లాక్ బస్టర్లు గా నిలిచి వసూళ్లు రాబట్టి నిర్మాతల జేబులు నింపాయి. ఏ మాత్రం తేడా వచ్చినా గత ఏడాది వచ్చిన ఓం నమో వెంకటేశాయ లాగా నిండా ముంచే అవకాశాలు కూడా అంతే ఉంటాయి. అందుకే ఇలాంటి మూవీస్ రెగ్యులర్ గా రావు. ఇప్పుడు మంచు వారి హీరో వీర శివ భక్తుడైన కన్నప్ప పాత్రలో నటించేందుకు సిద్ధమవుతున్నాడు. అది కూడా ఆశామాషీ బడ్జెట్ లో కాదండోయ్ . 70 నుంచి 80 కోట్ల దాకా మోహన్ బాబుతో సహా మంచు ఫ్యామిలీలో ఏ హీరో మీద పెట్టనంత భారీగా దీని నిర్మించబోతున్నారు.

ఇది స్వయంగా విష్ణునే చెప్పిన మాట. తనికెళ్ళ భరణి రాసిన స్క్రిప్ట్ ని తనతో పాటు మరో హాలీవుడ్ రైటర్ కలిసి మెరుగులు దిద్దే పనిలో ఉన్నామని చెప్పిన విష్ణు దర్శకత్వం కూడా హాలీవుడ్ వాళ్ళకే అప్పజెబుతాడట. అదేంటి అని ఆశ్చర్యపోకండి. అత్యున్నత ప్రమాణాలతో రూపొందే ఈ మూవీ వాళ్ళైతేనే న్యాయం చేకూర్చగాలరని విష్ణు నమ్మకమట. బాపు దర్శకత్వంలో చాలా కాలం క్రితం కృష్ణంరాజు హీరోగా వచ్చిన భక్త కన్నప్ప ఇప్పటికీ ఎవర్ గ్రీన్ క్లాసిక్ గా చెప్పుకోవచ్చు. ప్రభాస్ తో అది రీమేక్ చేయాలనీ ఆయన చాలా ప్రయత్నించారు. కాని కుదరలేదు. ఈ లోపు అదే పేరుతో తనికెళ్ళ భరణి స్క్రిప్ట్ పూర్తి చేయటంతో ఒక దశలో సునీల్ తో తీయాలనే చర్చలు కూడా జరిగాయి. కాని అవి అమలులోకి రాలేదు.

ఇప్పుడు కన్నప్పని తన చేతుల్లోకి తీసుకున్నాడు విష్ణు. తనకు అంత మార్కెట్ లేదని ఒప్పుకుంటూనే హీరో ఎవరు అనే దాని కన్నా సినిమా ఎవరి గురించి అనే దాని మీదే కన్నప్ప ప్రేక్షకులను థియేటర్ల దాకా రప్పిస్తుంది అంటున్నాడు విష్ణు. నాన్న మోహన్ బాబు కూడా ఇప్పటిదాకా ఇలాంటి సాహసం చేయలేదు. అన్నమయ్య - జగద్గురు ఆదిశంకర లాంటి సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్ చేసారు కాని టైటిల్ పాత్ర పోషించలేదు. మరి విష్ణు హాలీవుడ్ టీంతో చేయబోతున్న తెలుగు భక్తుడి సినిమా ఎలా ఉండబోతోందో అనే ఆసక్తి అప్పుడే మొదలైపోయింది
Tags:    

Similar News