టికెట్ స‌మ‌స్య పెద్ద‌లు చూసుకుంటారు!

Update: 2022-01-16 05:43 GMT
మూవీ ఆర్టిస్టుల సంఘం (మా) అధ్య‌క్ష ప‌ద‌వి చేప‌ట్టిన‌ప్ప‌టి నుంచి మంచు విష్ణు ఎంతో సైలెంట్ గా త‌న ప‌నిని తాను చేసుకుపోతున్నారు. ఆర్టిస్టుల సంక్షేమం గురించి ఆలోచిస్తున్నారు. అయితే ఇండ‌స్ట్రీ స‌మ‌స్య‌ల‌పైనా.. ఏపీలో టికెట్ రేట్ల పెంపు పైనా ఆయ‌నేమీ మాట్లాడ‌క‌పోవ‌డం ఆశ్చర్య‌ప‌రిచింది. టాలీవుడ్ పెద్ద దిక్కుగా  ప‌రిశ్ర‌మ బాగు కోసం వెట‌ర‌న్ హీరో మంచు మోహ‌న్ బాబు కానీ.. ఆయ‌న వార‌సుడు అయిన మా అధ్య‌క్షుడు విష్ణు మంచు కానీ ఏదీ చేయ‌డం లేదు! అంటూ బాహాటంగా సోష‌ల్ మీడియాల్లో విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి.

ముఖ్య‌మంత్రుల్ని క‌లిసి ప్ర‌తిదీ ప‌రిష్క‌రిస్తామ‌ని ఎన్నిక‌ల వేళ వాగ్ధానం చేసిన ఆ ఇద్దరూ ఏమీ చేయ‌డం లేద‌నేది ఇండ‌స్ట్రీ వ‌ర్గాల ఆవేద‌న‌. అయితే ప్ర‌తిదానికి సైలెన్స్ స‌మాధానం కాద‌ని భావించారో ఏమో కానీ.. ఇండ‌స్ట్రీలో టికెట్ రేట్ల స‌మ‌స్య‌పై పెద్ద‌లే ప‌రిష్కారం వెతుకుతార‌ని మంచు విష్ణు అన్నారు. మా అధ్య‌క్షునిగా 100 రోజుల ప‌ద‌వీ కాలం పూర్త‌యిన సంద‌ర్భంగా ఓ మీడియా తో మాట్లాడుతూ పైవిధంగా స్పందించారు.

టికెట్ ధ‌ర‌ల అంశంలో కొంద‌రు ఛాంబ‌ర్ పెద్ద‌లు ఏపీ ప్ర‌భుత్వంతో మాట్లాడుతున్నార‌ని విష్ణు వెల్ల‌డించారు. ఇలాంటి స‌మ‌యంలో వ్య‌క్తులు వ్య‌క్తిగ‌తంగా మాట్లాడ‌కూడ‌ద‌ని అందుకే మాట్లాడ‌డం లేద‌ని విష్ణు వెల్ల‌డించారు. అన్న‌ట్టు ఇండ‌స్ట్రీకి ఇప్పుడు పెద్ద దిక్కు లేరు!  పెద్ద దిక్కు ఎవ‌రు? అన్న‌ది కూడా ప్ర‌ధాన స‌మ‌స్య‌గానే ప‌రిగ‌ణించ‌బ‌డుతుంది. దీనిపై అయినా విష్ణు ఏదైనా మాట్లాడ‌తారేమో చూడాలి.
Tags:    

Similar News