మహేష్‌ ను త్రివిక్రమ్‌ రిస్క్‌ లో పెట్టాడు..!

Update: 2018-11-01 05:38 GMT
అంతకు ముందు ఎన్నో సినిమాల్లో నటించినా కూడా పెద్దగా గుర్తింపు దక్కించుకోలేక పోయిన మానిక్‌ రెడ్డి తాజాగా ‘అరవింద సమేత’ చిత్రంలో ఆకు తిను.. అనే డైలాగ్‌ తో ఫేమస్‌ అయ్యాడు. ఎన్టీఆర్‌ - త్రివిక్రమ్‌ ల కాంబినేషన్‌ లో తెరకెక్కి బ్లాక్‌ బస్టర్‌ అయిన ‘అరవింద సమేత’ చిత్రంతో మానిక్‌ రెడ్డి కి మంచి ఆఫర్లు వస్తున్నాయి. త్రివిక్రమ్‌ కు ఆప్త మిత్రుడు అయిన మానిక్‌ రెడ్డి తాజాగా ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో త్రివిక్రమ్‌ గురించి పలు ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చాడు.

త్రివిక్రమ్‌ రచయితగా అవకాశాల కోసం కష్టపడుతున్నప్పటి నుండి కూడా నాకు తెలుసు. అవకాశాల కోసం కష్టపడ్డప్పుడు ఎలా ఉండేవాడో - ఇప్పుడు కూడా ఆయన అలాగే ఉన్నాడు. ఎలాంటి బ్యాడ్‌ హ్యాబిట్స్‌ లేకుండా - మునుపటి మాదిరిగానే అందరిని గౌరవించడం - అందరితో ప్రేమగా ఉండటం చూస్తున్నాను. సినిమాలతో సమాజానికి ఏదైనా మంచి సందేశం ఇవ్వాలనేది త్రివిక్రమ్‌ తాపత్రయం. తన సినిమాల్లో కొత్తదనం - సహజత్వం రెండు ఉండేందుకు త్రివిక్రమ్‌ ప్రయత్నిస్తాడు. అందుకోసం ‘అతడు’ సినిమా సమయంలో మహేష్‌ బాబును చాలా రిస్కీ ప్రదేశంకు తీసుకు వెళ్లాడు. అక్కడ మామూలుగా సెలబ్రెటీలు తిగడమే కష్టం. అలాంటిది అక్కడ చిత్రీకరణ చేశాడు.

‘అతడు’ సినిమాను పాతబస్తీలోని మీర్‌ చౌక్‌ - మీరాలం మండీ వంటి ప్రదేశాల్లో చిత్రీకరణ జరిపారు. కథానుసారంగా ఆ ప్రాంతాల్లో అయితేనే సీన్స్‌ న్యాచురల్‌ గా వస్తాయనే ఉద్దేశ్యంతో త్రివిక్రమ్‌ అక్కడ ప్లాన్‌ చేశాడు. ఆ ప్రదేశంలో షూటింగ్‌ అంటే చిత్ర యూనిట్‌ సభ్యులు అంతా కూడా భయపడ్డారు. మహేష్‌ ను రిస్క్‌ లో పెడుతున్నాడు అంటూ త్రివిక్రమ్‌ ను వారించారు. అయినా కూడా త్రివిక్రమ్‌ తాను అనుకున్నట్లుగా పాతబస్తీలో చిత్రీకరణ జరిపాడు.

పాతబస్తీలోని మీరాలం మండీ చిత్రీకరణ సమయంలో కెమెరాలు కనిపించకుండా - షూటింగ్‌ వాతావరణం అక్కడ లేకుండా - దర్శకుడు - ఇతర టెక్నీషియన్స్‌ ఎవరు కనిపించకుండా చిత్రీకరణ జరిపాడు. ఆ చిత్రీకరణ అంతా పూర్తి అయిన తర్వాత హమ్మయ్య అంటూ అంతా ఊపిరి పీల్చుకున్నాం అంటూ మానిక్‌ రెడ్డి అప్పటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. త్రివిక్రమ్‌ వల్లే తాను ఈ స్థాయిలో ఉన్నాను అంటూ మానిక్‌ రెడ్డి ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. తన ప్రతి సినిమాలో ఏదో ఒక విధంగా తనకు స్థానం కల్పిస్తున్నాడని త్రివిక్రమ్‌ గురించి మానిక్‌ రెడ్డి చెప్పుకొచ్చాడు.

Tags:    

Similar News