సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ లేదని ఎవరూ చెప్పరు. కానీ.. ఉందని చెప్పేవారు మాత్రం చాలా తక్కువగా కనిపిస్తారు. అందానికి అందం.. అంతకు మించిన అభినయం ఉండి కూడా అవకాశాలు చేజిక్కించుకోలేక.. రెండు మూడు సినిమాలతో ప్యాకప్ అయ్యేటోళ్లు చాలామందే కనిపిస్తారు.
తాజాగా ఆ కోవలోకే వస్తారు నటి మంజరి ఫడ్నిస్. తెలుగు సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ చాలానే ఉందన్న విషయాన్ని ఆమె చెప్పేశారు. గతంలోనూ ఈ ఇష్యూ మీద ఓపెన్ గా మాట్లాడిన ఆమె.. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికర అంశాల్ని వెల్లడించారు.
తాను ఎక్కువ సినిమాలు చేయకపోవటానికి.. చిన్న సినిమాలు చేయటానికి కారణం ఇదేనంటూ కుండ బద్ధలు కొట్టేశారు. క్యాస్టింగ్ కౌచ్ అంశంతో పాటు తన సినిమాలు బాక్సాఫీసు దగ్గర బోల్తా కొట్టటం కూడా తన కెరీర్ మీద ప్రభావాన్ని చూపించినట్లు ఒప్పుకోవటం గమనార్హం. ఆత్మాభిమానం కోల్పోలేక ఎందరో సినిమాల్ని తాను రిజెక్టు చేశానని చెప్పారు. బెడ్రూంకు ఓకే అంటే తప్ప అవకాశాలు రాని పరిస్థితి ఉందని ఆరోపించింది. ఎలాంటి మొహమాటం లేకుండా మాట్లాడేసిన మంజరి మాటలు ఇప్పుడు సంచలనంగా మారాయి.