మెగాస్టార్ డైరెక్టర్ల జాబితాలోకి మారుతి ఎంట్రీ!

Update: 2021-11-04 09:59 GMT
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో మారుతి ఒకరు. ఆయన సినిమాలకు ఆయనే ఒక పెద్ద ఫ్యాక్టరీ. కథ .. స్క్రీన్ ప్లే .. మాటలు ఇవన్నీ కూడా అక్కడే తయారవుతాయి. పేపరు - పెన్ను పరంగా తమ సినిమాలకి కావలసిన అవుట్ పుట్ ను అందించే త్రివిక్రమ్ .. కొరటాల .. సుకుమార్ .. అనిల్ రావిపూడి జాబితాలోనే మారుతి కనిపిస్తాడు. మొదట్లో యూత్ ను దృష్టిలో పెట్టుకుని కథలను అల్లుకుంటూ వచ్చిన మారుతికి, ఏ సినిమా అయినా హిట్ కావాలంటే, ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు రావాలనే విషయం అర్థమైంది.

అప్పటి నుంచి ఆయన ఆ తరహా కథలను రాసుకుంటూ వస్తున్నాడు. కథ .. కథనం .. మాటలు .. పాత్రలను మలిచే విధానంలో మారుతి సిద్ధహస్తుడు. యూత్ కి .. ఫ్యామిలీ ఆడియన్స్ కి కావలసిన అన్ని అంశాలను కథలో సర్దుతూనే, కామెడీ టచ్ ఇవ్వడం ఆయన ప్రత్యేకత. అందుకు 'మహానుభావుడు' .. 'భలే భలే మగాడివోయ్' సినిమాలు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తాయి. ఆయన తాజా చిత్రంగా రూపొందిన 'మంచిరోజులు వచ్చాయి' సినిమా, ఈ రోజునే థియేటర్లకు వచ్చింది. ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ లో ఆయన మాట్లాడుతూ, ఒక ఆసక్తికరమైన విషయం చెప్పాడు.

ఇటీవల తాను చిరంజీవిని కలిసి ఒక లైన్ చెప్పాననీ, అది ఆయనకి చాలా బాగా నచ్చిందని చెప్పాడు. లైన్ నచ్చడంతో పూర్తి స్క్రిప్ట్ సిద్ధం చేసుకుని రమ్మని చిరంజీవి చెప్పారనీ, ప్రస్తుతం తాను అదే పనిలో ఉన్నానని అన్నాడు. చిరంజీవి కామెడీ టైమింగ్ అద్భుతంగా ఉంటుందనీ, తన మార్క్ కామెడీతో పాటు చిరంజీవి నుంచి అభిమానులు కోరుకునే అన్ని అంశాలు ఈ సినిమాలో పుష్కలంగా ఉంటాయని చెప్పాడు. వచ్చే ఏడాది ఈ సినిమాకి సంబంధించిన ఎనౌన్స్ మెంట్ ఉంటుందని అన్నాడు. మొత్తానికి మెగాస్టార్ తో సినిమాలు చేయడానికి లైన్లో ఉన్న దర్శకుల జాబితాలో, మారుతి కూడా చేరిపోయాడన్న మాట.

అయితే ఆల్రెడీ చిరంజీవి ఇంతకుముందు ఒప్పుకున్న సినిమాలను పూర్తి చేయవలసి ఉంటుంది. మోహన్ రాజా దర్శకత్వంలో 'గాడ్ ఫాదర్' సినిమాను పట్టాలెక్కించిన ఆయన, ఆ తరువాత మెహర్ రమేశ్ దర్శకత్వంలో 'భోళా శంకర్' చేయనున్నారు. ఇక ఈ లోగా బాబీ 'వాల్తేర్ వీర్రాజు' ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని పనులను సిద్ధం చేసుకోనున్నాడు. ఆ సినిమాను కూడా పూర్తి చేసిన తరువాతనే మారుతి ప్రాజెక్టుపైకి చిరంజీవి వచ్చే అవకాశం ఉంది. ఒక వైపున చిన్న హీరోలతో .. మరో వైపున  పేద హీరోలతో సినిమాలను  సెట్ చేస్తూ మారుతి తనదైన ప్రత్యేకతను కనబరుస్తున్నాడు.
Tags:    

Similar News