మరో అరవ డైరెక్టర్‌ ను దించబోతున్న మాస్ రాజా

Update: 2022-05-14 16:30 GMT
ఈమద్య కాలంలో తమిళ హీరోలు తెలుగు లో సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. తమిళ ఫిల్మ్‌ మేకర్స్‌ తెలుగు హీరోలను డైరెక్ట్ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. తమిళ హీరోలు అయిన విజయ్‌.. ధనుష్‌.. శివ కార్తికేయన్‌ ఇంకా కొందరు హీరోలు తెలుగు దర్శకులతో వర్క్ చేసేందుకు ఇప్పటికే కమిట్‌ అవ్వడం... షూటింగ్‌ కూడా ప్రారంభం అవ్వడం జరిగింది.

ఇక తమిళ దర్శకులు అయిన శంకర్‌.. లింగు స్వామి.. అట్లీ.. మురుగదాస్ తో పాటు మరి కొందరు దర్శకులు తెలుగు హీరోలను డైరెక్ట్‌ చేశారు.. చేస్తున్నారు. టాలీవుడ్‌ కు పాన్ ఇండియా స్థాయిలో మంచి పేరు రావడం వల్ల హీరోలు మరియు దర్శకులు తెలుగు లో సినిమా పై చాలా ఆసక్తిగా ఉన్నారు. ఇప్్పటికే ఎంట్రీ ఇచ్చిన వారు కాకుండా మరి కొందరు అరవ తంబీలు కూడా ఎంట్రీకి సిద్దం అయ్యారు.

పాన్ ఇండియా మార్కెట్‌ ను దృష్టిలో పెట్టుకుని తమిళ దర్శకులు తెలుగు హీరోలకు సరిపోయే కథలను రాస్తున్నారట. తాజాగా రవితేజకు ఒక తమిళ దర్శకుడు చెప్పిన కథ నచ్చిందని.. ప్రస్తుతం రవితేజ చేస్తున్న సినిమాలు పూర్తి అయిన వెంటనే చేసేందుకు ఓకే చెప్పాడని వార్తలు వస్తున్నాయి. ఆ దర్శకుడు మరెవ్వరో కాదు బాలాజీ మోహన్‌.

తమిళంలో మంచి గుర్తింపు ఉన్న బాలాజీ మోహన్‌ ఇప్పటికే అక్కడ లవ్‌ ఫెయిల్యూర్‌.. మారి మరియు మారి 2 సినిమాలను చేసిన విషయం తెల్సిందే. మూడు సినిమాలు కూడా ఆయన స్థాయిని పెంచాయి. తమిళంలో మంచి పేరు దక్కించుకున్న ఈయనతో యంగ్‌ హీరోలు చేసేందుకు చాలా ఆసక్తిగా ఉన్నారట. కాని ఆయనకు మాత్రం తెలుగు లో సినిమా చేయాలనే కోరిక బలంగా ఉన్నట్లుగా అనిపిస్తుంది.

అందుకే రవితేజ కోసం కథను సిద్ధం చేసి ఇటీవలే చెప్పాడట. ప్రస్తుతం రవితేజ ధమాకా.. రాక్షసుడు.. టైగర్ నాగేశ్వరరావు సినిమాలు చేస్తున్నాడు. ఆ మూడు సినిమాలకు తోడుగా ఇప్పటికే రామారావు ఆన్ డ్యూటీ సినిమా విడుదలకు సిద్దంగా ఉంది. ఈ ఏడాది చివరి వరకు రవితేజ క్యాలెండర్‌ ఫుల్‌ బిజీగా ఉంది. కనుక ఆయన హీరోగా బాలాజీ మోహన్ సినిమా వచ్చే ఏడాది ఆరంభంలో పట్టాలెక్కే అవకాశాలు ఉన్నాయి.

రవితేజ సన్నిహితులు మరియు సినీ వర్గాల వారి నుండి అందుతున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం బాలాజీ మోహన్‌ తయారు చేసిన కథ పాన్ ఇండియా అప్పీల్ ఉంటుందని అంటున్నారు. ఆ కథ ను పాన్ ఇండియా రేంజ్ లో రవితేజ తో చేస్తే తప్పకుండా తెలుగు.. తమిళంలోనే కాకుండా దేశ వ్యాప్తంగా మంచి విజయాన్ని సొంతం చేసుకునే అవకాశం ఉందంటున్నారు.
Tags:    

Similar News