మెగా మాస్ కాంబో: శంకర్ దాదాతో చేతులు కలిపిన మాస్ రాజా..!

Update: 2022-07-16 11:30 GMT
మెగాస్టార్ చిరంజీవి హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ బాబీ (కెఎస్ రవీంద్ర) దర్శకత్వంలో ఓ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. #MEGA154 అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించి కొత్త షెడ్యూల్ షూటింగ్ ఇటీవలే ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో మేకర్స్ తాజాగా ఓ సాలిడ్ అప్డేట్ తో వచ్చారు.

చిరంజీవి 154వ చిత్రంలో మాస్ మహారాజా రవితేజ ఓ కీలక పాత్రలో నటించనున్నట్లు చాలా రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అంతేకాదు లేటెస్ట్ షెడ్యూల్ షూట్ లో రవితేజ కూడా జాయిన్ అయినట్లు రూమర్స్ వచ్చాయి. అయితే ఇప్పుడు చిత్ర యూనిట్ ఈ విషయాన్ని అధికారికంగా దృవీకరించారు. అంతేకాదు దీనికి సంబంధించి ఓ ఆసక్తికరమైన వీడియోని కూడా వదిలారు.

రవితేజ కు స్వాగతం పలుకుతూ #MEGA154 టీమ్ ఈ వీడియోని రూపొందించింది. మాస్ రాజా కారులో వచ్చి స్టైల్ గా నడుచుకుంటూ కార్వాన్ దగ్గరకు వెళ్లి 'అన్నయ్యా'  అంటూ అని హుషారుగా పిలవగా.. 'హాయ్ బ్రదర్.. వెల్ కమ్' అంటూ మెగాస్టార్ తన చేయిని అందించి లోపలికి తీసుకెళ్లారు. ఆ తర్వాత బాబీ ఎంట్రీ ఇచ్చి 'ఇది మెగా మాస్ కాంబో' అని చెప్పడంతో ఈ వీడియో ముగుస్తుంది. ఇక్కడ చిరు లుక్ ని రివీల్ చేయలేదు.

ఈ వీడియోకి రవితేజ నటించిన 'వెంకీ' సినిమాలోని 'మాస్ తో పెట్టుకుంటే మడతడిపోద్ది' పాట మరియు చిరంజీవి నటించిన 'శంకర్ దాదా' టైటిల్ సాంగ్ ను మిక్స్ చేసి రీమిక్స్ చేసిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఆకట్టుకుంటోంది. ఈ రెండు సినిమాలకు సంగీతం సమకూర్చిన రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్.. ఇప్పుడు MEGA154 చిత్రానికి మ్యూజిక్ కంపోజ్ చేస్తున్న సంగతి తెలిసిందే.

'మాస్ ఫోర్స్ మెగా స్టార్మ్ లో చేరింది. మాస్ మహారాజా రవితేజ కి #Mega154 టీమ్ స్వాగతం పలుకుతోంది' అని మేకర్స్ ఈ సందర్భంగా ట్వీట్ చేశారు. 2023 జనవరిలో థియేటర్‌లలో ఈ మెగామాస్‌ ను ఎక్స్పీరియన్స్ చేయబోతున్నారని పేర్కొన్నారు.

గతంలో చిరంజీవి హీరోగా నటించిన 'అన్నయ్య' సినిమాలో తమ్ముడుగా రవితేజ కనిపించాడు. ఆ తర్వాత 'శంకర్ దాదా జిందాబాద్' చిత్రంతో ఓ పాటలో మాస్ రాజా తళుక్కున మెరిసారు. చాలా గ్యాప్ తర్వాత ఇప్పుడు మరోసారి ఇద్దరూ స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. ఈ కాంబినేషన్ పై ఇద్దరు హీరోల అభిమానుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి.

ఈ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ లో చిరంజీవి సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. రవితేజ కు కూడా జోడీ ఉంటుందని సమాచారం. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో నవీన్ యెర్నేని - వై రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జికె మోహన్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

ఆర్థర్ ఎ విల్సన్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. ఎఎస్‌ ప్రకాష్‌ ప్రొడక్షన్‌ డిజైనర్‌ గా వర్క్ చేస్తున్నారు. నిరంజన్‌ దేవరమానె దీనికి ఎడిటర్. ఈ చిత్రానికి బాబీ కథ, మాటలు రాయగా.. కోన వెంకట్ - కె చక్రవర్తి రెడ్డి స్క్రీన్‌ ప్లే అందిస్తున్నారు. హరి మోహన కృష్ణ - వినీత్ పొట్లూరి కూడా రైటింగ్ డిపార్ట్‌మెంట్‌ లో ఉన్నారు.

మెగా154 చిత్రానికి 'వాల్తేరు వీరయ్య' అనే టైటిల్ ఖరారు చేసినట్టు సమాచారం. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రానుంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కాబోతున్న ఈ మెగా మాస్ మూవీ ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.


Full View

Tags:    

Similar News