‘మాస్టర్’ మూవీ రివ్యూ

Update: 2021-01-13 17:40 GMT
చిత్రం : మాస్టర్

నటీనటులు: విజయ్-విజయ్ సేతుపతి-మాళవిక మోహనన్-అర్జున్ దాస్-శాంతను-గౌరి కిషన్ తదితరులు
సంగీతం: అనిరుధ్
ఛాయాగ్రహణం: సత్యన్ సూర్యన్
మాటలు: రాజేష్ మూర్తి
నిర్మాత: జేవియర్ బ్రిట్టో
కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: లోకేష్ కనకరాజ్

విజయ్ తమిళంలో ఎప్పట్నుంచో సూపర్ స్టార్. ఈ మధ్య తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ సంపాదించాడు. అతడి కొత్త సినిమా ‘మాస్టర్’.. సంక్రాంతికి విడుదలవుతున్న తెలుగు చిత్రాలకు దీటుగా క్రేజ్ సంపాదించుకుంది. ‘ఖైదీ’ దర్శకుడు లోకేష్ కనకరాజ్ రూపొందించిన ఈ చిత్రం మంచి అంచనాల మధ్య ఈ రోజే ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఆ అంచనాల్ని ‘మాస్టర్’ ఏ మేర అందుకుందో చూద్దాం పదండి.

కథ: జేడీ (విజయ్) ఒక కాలేజీలో సైకాలజీ ప్రొఫెసర్. ఆ కాలేజీ మేనేజ్మెంట్ అంతా జేడీకి వ్యతిరేకంగా ఉన్నప్పటికీ.. విద్యార్థుల్లో మాత్రం అతడికి మంచి ఫాలోయింగ్ ఉంటుంది. కాలేజీ యాజమాన్యం అభీష్టానికి వ్యతిరేకంగా జేడీ స్టూడెంట్ ఎలక్షన్స్ జరగాల్సిందే అని పట్టుబట్టగా.. ఈ ఎన్నికల సమయంలో ఏమైనా గొడవలు జరిగితే జేడీ కాలేజీ విడిచి వెళ్లిపోవాలని ప్రిన్సిపల్ షరతు పెడతాడు. ఎన్నికలు సజావుగా జరిగినప్పటికీ.. ఫలితాల తర్వాత పెద్ద గొడవ జరగడంతో జేడీ కాలేజీని వదిలి పోక తప్పదు. అదే సమయంలో అతను జువైనల్ అబ్జర్వేషన్ హోంలో ఉపాధ్యాయుడిగా పని చేయాల్సిన అవసరం పడుతుంది. ఐతే అక్కడికెళ్లాక జేడీకి అనూహ్యమైన పరిస్థితులు తలెత్తుతాయి. జువైనల్ హోంలో బాల నేరస్థుల్ని అడ్డు పెట్టుకుని బయట అరాచకాలు చేస్తున్న భవాని (విజయ్ సేతుపతి)ని జేడీ ఢీకొట్టాల్సి వస్తుంది. జువైనల్ హోంను గాడిన పెడుతూ భవానిపై జేడీ ఎలా విజయం సాధించాడన్నది మిగతా కథ.

కథనం-విశ్లేషణ: మంచి మాస్ ఫాలోయింగ్ ఉన్న సూపర్ స్టార్ల సినిమాలతో ఒక సౌలభ్యం ఉంటుంది. కథ విషయంలో మరీ కసరత్తు చేయాల్సిన అవసరం లేదు. కొత్తదనం కోసం మరీ కష్టపడాల్సిన పని కూడా ఉండదు. ఆ హీరో అభిమానుల్ని అలరించేలా ఎలివేషన్లు, మాస్ సన్నివేశాలు రాసుకుని.. వాటిని తెరపై చక్కగా ప్రెజంట్ చేసి.. మంచి మసాలా పాటలు, ఫైట్లు జోడించి.. ఎంటర్టైన్మెంట్ కు ఢోకా లేకుండా చూసుకుంటే చాలు.. బాక్సాఫీస్ పరీక్ష పాసైపోవచ్చు. అభిమానులతో పాటు మాస్ ప్రేక్షకులను సంతృప్తి పరిస్తే పాస్ మార్కులు పడిపోతాయి. ఈ కోణంలో చూస్తే ‘మాస్టర్’ తమిళ ప్రేక్షకులకు ఓకే అనిపించొచ్చు. వాళ్లు ఈ సినిమాతో సంతృప్తి చెందొచ్చు కూడా. ఎందుకంటే విజయ్ అక్కడ సూపర్ స్టార్. అతడికి భారీగా అభిమానులున్నారు. మాస్ ఫాలోయింగ్ ఉంది. వాళ్లు కోరుకునే అంశాలన్నీ ఇందులో ఉన్నాయి. కానీ మన ప్రేక్షకులు విజయ్ సినిమాను ఆ కోణంలో చూడరు. విజయ్ ను మనం అలా ఓన్ చేసుకోలేం. ఊగిపోలేం. కేవలం హీరో ఎలివేషన్లు.. మాస్ సన్నివేశాలు.. ఫైట్లు, పాటలు, డ్యాన్సులు అంటే నడవదు. అంతకుమించిన విశేషాలు ఆశిస్తారు. ‘మాస్టర్’లో ఆ విశేషాలే కరవయ్యాయి.

‘ఖైదీ’ లాంటి విభిన్నమైన సినిమాతో తనపై ఎన్నో అంచనాలు పెంచిన యువ దర్శకుడు లోకేష్ కనకరాజ్.. విజయ్‌ తో సినిమా అనేసరికి రూటు మార్చేశాడు. విజయ్ అభిమానుల్ని దృష్టిలో ఉంచుకుని ఫక్తు కమర్షియల్ సినిమా తీశాడు. ఇది ‘లోెకేష్ కనకరాజ్ ఫిలిం’ అనే ఆశిస్తే.. అతను ‘విజయ్ సినిమా’ చూపించాడు. హీరో ఎలివేషన్లు.. భారీ ఇంట్రోలు.. బిల్డప్పులు.. అవసరానికి మించి యాక్షన్ సన్నివేశాలు.. మాస్ పాటలు.. డ్యాన్సులు.. ఇలా ఓ ఛట్రంలో కూరుకుపోయాడు. విలన్ పాత్రను తీర్చిదిద్దడంలో ఒక దశ వరకు దర్శకుడి ప్రత్యేకత కనిపించినా.. మిగతా వ్యవహారమంతా రొటీన్ అయిపోవడంతో ‘మాస్టర్’ ఒక మామూలు సినిమాగా మిగిలిపోయింది. ఒక ఫార్మాట్లో నడిచినప్పటికీ ప్రథమార్ధం వరకు ప్రేక్షకులను బాగానే ఎంగేజ్ చేస్తుంది కానీ.. ద్వితీయార్ధం అనాసక్తికరంగా మారి ‘మాస్టర్’ మీద ఇంప్రెషన్ తగ్గించేస్తుంది.

‘మాస్టర్’ ఆరంభం మాత్రం ఆసక్తికరంగా అనిపిస్తుంది. రొటీన్ గా హీరో పాత్ర ఇంట్రోతో సినిమాను మొదలుపెట్టకుండా.. విలన్ పాత్రను మంచి ఎలివేషన్ తో మొదలుపెట్టడం ఆకట్టుకుంటుంది. జువైనల్ హోంలోకి బాల నేరస్థుడిగా వచ్చిన విజయ్ సేతుపతి.. అక్కడి పరిస్థితుల నేపథ్యంలో కర్కశంగా తయారవడం.. తర్వాత తనకు పైకి తెచ్చిన వాళ్లనే కబళించి పెద్ద గూండాగా ఎదగడం.. ఈ క్రమం ఆసక్తికరంగా సాగుతుంది. తాను టార్గెట్ చేసిన వ్యక్తుల్ని అతను మట్టుబెట్టే విషయంలో ఫాలో అయ్యే స్టయిల్ ఆ పాత్ర మీద ఆసక్తి రేకెత్తిస్తుంది. విజయ్ సేతుపతి పెర్ఫామెన్స్ కూడా అతడి స్థాయికి తగ్గట్లే ఉండటంతో సినిమా మీద మంచి అంచనాలు నెలకొంటాయి. ఐతే హీరో పాత్ర పరిచయం దగ్గరికి వచ్చేసరికి ‘మాస్టర్’ రొటీన్ రూట్లోకి వెళ్లిపోతుంది. కాలేజీ సీన్లు కొంత వినోదాత్మకంగానే సాగినా కొత్తదనం ఏమీ కనిపించదు. కాలేజీ రాజకీయాలు ఏ మలుపు తిరుగుతాయో అనుకునేసరికి.. కథను మరోవైపుకి మళ్లించాడు దర్శకుడు.

హీరో జువైనల్ హోంకు రావడం.. అక్కడున్న గ్యాంగ్ అరాచకాలు.. హీరోకు ఎదురయ్యే సవాళ్లు.. ఈ నేపథ్యంలో తొలి గంట తర్వాత వేరే సినిమా చూస్తున్న భావన కలుగుతుంది. హీరోలో మార్పు తీసుకొచ్చే ఇంటర్వెల్ ఎపిసోడ్ సినిమాలో హైలైట్ గా నిలుస్తుంది. ఈ ఎపిసోడ్ ద్వితీయార్ధం మీద అంచనాలు పెంచుతుంది. కానీ ఆ తర్వాత ‘మాస్టర్’ రొటీన్ ఫార్మాట్లోకి వెళ్లిపోవడం నిరాశ కలిగిస్తుంది. జువైనెల్ హోంలో పిల్లల్ని తన వైపు తిప్పుకోవడం.. యాంటీగా ఉన్న విలన్ బ్యాచ్ ను దెబ్బ తీయడం.. ఆ తర్వాత విలన్ వ్యాపారాన్ని టార్గెట్ చేయడం.. ఇవన్నీ కూడా సాధారణంగా అనిపిస్తాయి. హీరో-విలన్ క్లైమాక్స్ వరకు ఎదురు పడకపోవడాన్ని కొత్తదనంగా భావించారేమో కానీ.. దీని వల్ల సినిమాలో ఇంటెన్సిటీ మిస్ అయిన ఫీలింగ్ వస్తుంది. హీరో-విలన్ మధ్య గొడవ చాలా చిన్నదిగా కనిపిస్తుంది. కథ ముందుకు సాగే కొద్దీ సినిమా పరిధి కుచించుకుపోయిన భావన కలుగుతుంది. ద్వితీయార్ధంలో హీరోకు విలన్ సృష్టించే అడ్డంకులు చాలా మామూలుగా అనిపిస్తాయి. చివర్లో హీరో-విలన్ మధ్య పోరాట దృశ్యం మాస్ ను మెప్పిస్తుంది కానీ.. అప్పటికే సినిమా మీద ఇంప్రెషన్ తగ్గిపోయిన సగటు ప్రేక్షకుడికి పతాక సన్నివేశం కూడా ఎలాంటి హై ఇవ్వదు. సంక్రాంతి రేసులో ముందుగా వచ్చిన ‘క్రాక్’లో మాస్ రాజా రవితేజ నుంచి ఆశించే ఎలివేషన్లు, మాస్ అంశాలకు లోటు లేదు. కాబట్టి ఆయన అభిమానులు, మాస్ ప్రేక్షకులు సంతృప్తి చెందారు. ఆ సినిమా అలా అలా ఆడేస్తోంది. కానీ ఒక నాన్ లోకల్ హీరో సినిమాలోనూ ఇవే అంశాలుంటే వాటితో మన ప్రేక్షకులు ఏమేర కనెక్ట్ అవుతారు.. సంతృప్తి చెందుతారు అన్నది ప్రశ్నార్థకం.

నటీనటులు: విజయ్ తన అభిమానుల్ని అలరించేలా నటించాడు. అతడి స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది. లుక్స్.. పెర్ఫామెన్స్ స్టైలిష్ గా అనిపిస్తాయి. యాక్షన్ సన్నివేశాలు.. పాటల్లో విజయ్ అభిమానుల్ని అలరించడానికి ప్రయత్నించాడు. ఐతే వీటితో మన ప్రేక్షకులు ఏ మేర కనెక్ట్ అవుతారన్నది సందేహం. హీరోయిన్ మాళవిక మోహన్ చాలా అందంగా కనిపించింది. నటన పర్వాలేదు. విజయ్ సేతుపతి కు పెర్ఫామెన్స్ పరంగా సినిమాలో అగ్ర తాంబూలం దక్కుతుంది. అతడి లుక్ పాత్రకు తగ్గట్లు చాలా సింపుల్ గా ఉంటూనే బలమైన ఇంపాక్ట్ చూపిస్తుంది. సేతుపతి పాత్ర చాలా ఆసక్తికరంగా ఆరంభమవుతుంది. ఒక దశ వరకు బాగా సాగుతుంది. కానీ తర్వాత అది కూడా రొటీన్ అయిపోతుంది. జువైనల్ హోంలో ఖైదీగా అర్జున్ దాస్ నటనకు కూడా మంచి మార్కులు పడతాయి. మిగతా నటీనటులు ఓకే.

సాంకేతిక వర్గం: అనిరుధ్ రవిచందర్ ఒక సూపర్ స్టార్ సినిమాకు అవసరమైన మాస్ బీట్స్ ఇచ్చాడు. నేపథ్య సంగీతంతో మోత మోగించేశాడు. మాస్టర్ కమింగ్.. చిట్టి స్టోరీ పాటలు ఆకట్టుకుంటాయి. అతడి పాటలు.. బ్యాగ్రౌండ్ స్కోర్ లో ఒక స్టైల్ కనిపిస్తుంది. కాకపోతే హీరో ఎలివేషన్ సీన్లలో ఆర్ఆర్ మరీ లౌడ్ గా అనిపిస్తుంది. మనకు విజయ్ సూపర్ స్టార్ కాదు కాబట్టి.. ఏంటీ గోల అనే ఫీలింగ్ కలిగిస్తుంది కొన్ని చోట్ల బ్యాగ్రౌండ్ స్కోర్. సత్యన్ సూర్యన్ ఛాయాగ్రహణం బాగుంది. సినిమా అంతటా విజువల్స్ ఆకట్టుకుంటాయి. నిర్మాణ విలువలకు ఢోకా లేదు. ‘మాస్టర్’ ఆద్యంతం భారీతనానికి లోటు లేదు. డైలాగ్స్ తమిళం నుంచి మక్కీకి మక్కీ దించేసినట్లు అనిపిస్తాయి తప్ప ప్రత్యేకత ఏమీ లేదు. డబ్బింగ్ విషయంలో.. వాయిస్ ల ఎంపికలో ఇంకొంచెం జాగ్రత్త వహించి ఉండాల్సిందనిపిస్తుంది. ఇక దర్శకుడు లోకేష్ కనకరాజ్ విషయానికి వస్తేప.. అతను తనపై పెట్టుకున్న అంచనాలను నిలబెట్టుకోలేకపోయాడు. ‘ఖైదీ’ సినిమాలో కథకు.. కొత్తదనానికి ప్రాధాన్యమిస్తూనే హీరోయిజం ఎలివేట్ అయ్యేలా చూసుకున్న అతను.. ఈసారి మాత్రం కథ మీద అంత అంత శ్రద్ధ పెట్టకుండా ఎలివేషన్లకే పరిమితం అయ్యాడు. ముఖ్యంగా ద్వితీయార్ధంలో కథ.. స్క్రీన్ ప్లే అన్నీ కూడా ఫ్లాట్ గా అనిపిస్తాయి. విలన్ పాత్రను తీర్చిదిద్దే విషయంలో పెట్టిన శ్రద్ధ సినిమా అంతటా అతను చూపించి ఉంటే బాగుండేది.

చివరగా: మాస్టర్.. రొటీన్ మసాలా

రేటింగ్-2.25/5

Disclaimer : This Review is An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre
Tags:    

Similar News