'మాస్టర్' వసూళ్లకు గండి పడినట్లేనా..?

Update: 2021-01-27 16:13 GMT
కరోనా లాక్ డౌన్ సమయంలో థియేట్రికల్ రిలీజులు లేకపోవడంతో ఓటీటీలు పుంజుకున్నాయి. అయితే థియేటర్స్ రీ ఓపెన్ అయ్యాక మళ్ళీ సాదారణ పరిస్థితులు వస్తున్నాయి. ఈ సంక్రాంతికి విడుదలైన సౌత్ సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్ళు రాబడుతున్నాయి. తెలుగులో రవితేజ నటించిన 'క్రాక్' దూసుకుపోతుంటే.. తమిళంలో విజయ్ 'మాస్టర్' సినిమా రికార్డ్ కలెక్షన్లను కొల్లగొడుతోంది. అయితే ఇప్పుడు సక్సెస్ ఫుల్‌ గా రన్ అవుతున్న సినిమాలకు ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్స్ అడ్డుకట్ట వేయడానికి రెడీ అయ్యాయి.

'క్రాక్' సినిమాను ఈ నెల 29న 'ఆహా'లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేశారు. అయితే థియేటర్స్ పరిస్థితి అర్థం చేసుకుని 'ఆహా' టీమ్ కాస్త మరో వారం రోజులు విడుదల వాయిదా వేసుకుంది. అయితే 'మాస్టర్' సినిమాను కొనుగోలు చేసిన అమెజాన్ ప్రైమ్ వీడియో వారు జనవరి 29 నుంచి స్ట్రీమింగ్ కి పెడుతున్నట్లు ప్రకటించారు. 200 కోట్లకు పైగా వసూళ్ళతో దూసుకుపోతోన్న 'మాస్టర్' చిత్రాన్ని విడుదలైన 16 రోజుల్లోనే ఓటీటీలోకి తేవడంపై ఫ్యాన్స్ నిరుత్సాహానికి గురవుతున్నారు. ఓటీటీలో ప్రసారం చేస్తామని డేట్ అనౌన్స్ చేసిన తర్వాత జనాలు థియేటర్లకు రారని.. దీని వల్ల 'మాస్టర్' కలెక్షన్స్ కి గండి పడినట్లేనని కామెంట్స్ చేస్తున్నారు.

'ఆహా' ప్రాంతీయ ఓటీటీ కాబట్టి ఇక్కడి పరిస్థితులను అర్థం చేసుకుని సక్సెస్‌ ఫుల్ సినిమా డిజిటల్ రిలీజ్ వాయిదా వేసుకుంది. కానీ అమెజాన్ వారు మాత్రం 'మాస్టర్' విషయంలో వెనక్కి తగ్గలేదు. దీంతో జనవరి 29 తరువాత థియేటర్లలో 'మాస్టర్' ఇంక కనిపించకపోవచ్చు.
Tags:    

Similar News